close

వార్తలు / కథనాలు

పుకార్లు పుట్టిస్తే... చెత్త ఎత్తాల్సిందే!

పుకార్లు... బుల్లెట్‌ కన్నా వేగంగా పయనిస్తాయి. వాస్తవం కన్నా ముందే బట్వాడా అయిపోతాయి. అసలు నిజం బయటపడేవరకు హల్‌చల్‌ చేస్తాయి. కొందరికి పుకార్లు వినోదాత్మకంగా కనిపించినా.. మరికొందరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఒకప్పుడు ఇద్దరు కలిసి చెవులుకొరుక్కుంటే పుట్టిన పుకార్లు ఒక ప్రాంతానికే పరిమితమయ్యేవి. ఇప్పుడు వార్తలు, సోషల్‌మీడియా అంటూ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిని అరికట్టడం కష్టసాధ్యం. కానీ ఆ దిశగా ఫిలిప్పిన్‌లోని ఓ పట్టణం అడుగులేసింది.

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాకి 200కి.మీ దూరంలో ఉన్న చిన్న పట్టణం బినలొనన్‌. గతంలో అక్కడ విపరీతంగా పుకార్లు సృష్టించేవారట. దీంతో వీటిని ఎలాగైన అరికట్టాలని భావించిన స్థానిక ప్రభుత్వం ఏకంగా పుకార్లను నిషేధిస్తూ ఓ చట్టం తీసుకొచ్చింది. ఇకపై ఈ పట్టణంలో ఎవరైనా పుకార్లు సృష్టించినా.. వాటిని ప్రచారం చేసినా నేరంలా పరిగణిస్తామని ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తాము చేసిన వ్యాఖ్యలపై బాధ్యత వహించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 
ఈ చట్టం ప్రకారం మొదటిసారి పుకార్లు సృష్టించి పట్టుబడ్డ వ్యక్తికి తక్కువ మొత్తంలో (రూ.264) జరిమానా విధించడంతోపాటు మూడు గంటల పాటు వీధుల్లో చెత్త సేకరించేలా శిక్ష విధిస్తారు. 

ఒక్కటి కంటే ఎక్కువ సార్లు పుకార్లు పుట్టిస్తూ పట్టుబడితే 20 డాలర్లు జరిమానా విధించి.. 8 గంటలు సమాజ సేవ చేసేలా చూస్తారట. అయితే వేటిని పుకార్లుగా పరిగణించాలన్న దానిపై స్పష్టత లేకపోయినా.. స్థానిక ప్రజల సంబంధాలపై, ఆర్థికపరమైన అంశాలు, ఇతరులను ఇబ్బందికి గురిచేసేవేవైనా పుకార్ల కిందకే వస్తాయని పట్టణ మేయర్‌ చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ చట్టాన్ని 2017లోనే మొరెనో ప్రాంతంలో అమలు చేశారు. పుకార్లు సృష్టిస్తున్న వారికి 10 డాలర్లు జరిమానా విధించేవాళ్లు. మధ్యాహ్నం వేళ చెత్తను సేకరించేలా శిక్ష విధించారు. దీనికి మంచి ఫలితాలు వచ్చాయట. జరిమానా పడ్డవాళ్లు మళ్లీ పుకార్లు సృష్టంచడానికి, ప్రచారం చేయడానికి పూనుకోలేదట. దీంతో ఆ చట్టాన్ని  బినలొనన్‌ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు