close

వార్తలు / కథనాలు

యుద్ధాలకు జంతువులు కారణమవుతాయా?

ఆధిపత్యం కోసం, ప్రతికారం కోసం, అందమైన యువరాణిల కోసం జరిగిన యుద్ధాలు చరిత్రలో అనేకం. రామాయణ, మహాభారతం నాటి నుంచి నేటి వరకు ఎన్నో యుద్ధాలు ఇలాంటి కారణాల వల్లే జరిగాయి. కానీ జంతువుల వల్ల దేశాల మధ్య యుద్ధాలు జరిగాయంటే నమ్ముతారా? ఓ కుక్క వల్ల గ్రీస్‌, బల్గేరియా యుద్ధం చేశాయి. పంది వల్ల అమెరికా, బ్రిటన్‌ పోరులో దిగాయి. వాటి గురించి వివరాలు ఇవిగో!

గ్రీస్‌-బల్గేరియా

1908కు ముందు గ్రీస్‌, బల్గేరియా మధ్య సత్సంబంధాలు ఉండేవి. కానీ దేశ సరిహద్దు విషయంలో ఇరు దేశాలు బద్ధశత్రువులగా వ్యవహరించేవి. అది కాస్తా మొదటి ప్రపంచయుద్ధం నాటికి తారస్థాయికి చేరింది. ఇరు దేశాలు వేర్వేరు వర్గాల్లో చేరి యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ తర్వాతి రోజుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ వచ్చాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో భద్రతా బలగాలను మోహరించాయి. ఈ క్రమంలో 1925లో అక్టోబర్‌ 18న గ్రీస్‌ సైనికుడికి చెందిన పెంపుడు కుక్క అతడి నుంచి తప్పించుకొని బల్గేరియా సరిహద్దు వైపుకు వెళ్లింది. దాన్ని వెంబడిస్తూ సరిహద్దు దాటి బల్గేరియాలోకి వెళ్లడంతో గ్రీస్‌ సైనికుడిపై బల్గేరియా  సైనికుడు కాల్పులు జరిపాడు. ఆ వెంటనే గ్రీస్‌ సైనికులు బల్గేరియాపై ఎదురుకాల్పులు జరిపారు.

దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. బల్గేరియా సైన్యం తమ తొందరపాటుకు క్షమాపణ చెప్పినా గ్రీస్‌ పట్టించుకోలేదు. తమ సైనికుడి మరణానికి కారణమైన వారికి శిక్ష, అధికార క్షమాపణ, రెండు మిలియన్‌ ఫ్రెంచ్‌ ఫ్రాంక్స్‌ పరిహారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అంతేకాదు గ్రీస్‌ తన సైన్యాన్ని బల్గేరియాలోని పెట్రిచ్‌ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని  యుద్ధం కొనసాగించింది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన దాదాపు వంద మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది సైనికులకు గాయాలయ్యాయి. దీంతో ‘లీగ్‌ ఆఫ్‌ నేషన్‌’ సంస్థ జోక్యం చేసుకొని ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చర్యలు చేపట్టింది. కాల్పులు ఉపసంహరించడంతోపాటు బల్గేరియాలోని గ్రీస్‌ సైనికులను పెట్రిచ్‌ నుంచి వెనక్కి పిలవాలని గ్రీస్‌ను ఆదేశించింది. దీంతోపాటు 45వేల పౌండ్లు బల్గేరియాకు చెల్లించాలని ఆదేశించింది. దీంతో గ్రీస్‌, బల్గేరియా యుద్ధం ఉపసంహరించుకున్నాయి.

యూఎస్‌ఏ-యూకె

నార్త్‌ అమెరికా, బ్రిటన్‌కు ఒకప్పుడు భూ తగాదాలు ఉండేవి. 1846లో జరిగిన ఒరెగాన్‌ ఒప్పందం ప్రకారం ఒరెగాన్‌ దేశానికి ఆనుకొని పర్వతాలున్న కోస్తా ప్రాంతాన్ని అమెరికా, బ్రిటన్‌కు విభజించి ఇచ్చారు. అయితే సాన్‌ జువాన్‌ ఛానెల్‌ ఐలాండ్‌పై సార్వభౌమాధికారాలు ఇరు దేశాలు పంచుకున్నాయి. దీంతో అయిష్టంగానే 13 ఏళ్లపాటు అమెరికా, బ్రిటన్‌ ప్రజలు ఆ ఐలాండ్‌లో జీవించారు. బ్రిటన్‌ ప్రభుత్వం కూడా ఈ ఐలాండ్‌లో హుడ్సన్స్‌ బే కంపెనీని స్థాపించింది. అక్కడ బ్రిటీష్‌ పౌరులు చాలా మంది ఉద్యోగం చేసేవాళ్లు. అయితే 1859 జూన్‌ 15న అమెరికన్‌ రైతు అయిన లీమన్‌ కట్లర్‌ పొలంలోని బంగాళాదుంపలను తింటున్న ఓ పందిని చూసి చంపేశాడు. అయితే ఆ పంది బ్రిటన్‌కు చెందిన ఉద్యోగి చార్లెస్‌ గ్రిఫిన్‌ది కావడంతో అగ్గి రాజుకుంది. కట్లర్‌ను అరెస్టు చేయాలని కోరుతూ చార్లెస్‌ బ్రిటన్‌ అధికారులను కోరాడు. దీంతో కట్లర్‌కు రక్షణ కల్పించాలని కోరుతూ అతడి స్నేహితుడు అప్పటి యూఎస్‌ జనరల్‌ విలియమ్‌ ఎస్‌. హెర్నీకి విజ్ఞప్తి చేశాడు. 

 బ్రిటీష్‌ వారిని హెర్నీ బద్ధ శత్రులువుగా భావించేవాడు. అందుకే కట్లర్‌ రక్షణ కోసం 66 మంది అమెరికా సైనికులను సాన్‌ జువాన్‌ ఐలాండ్‌కు పంపించాడు. బ్రిటీష్‌ సైన్యం ఈ చర్యను తీవ్రంగా పరిగణించింది. అమెరికన్లపై యుద్ధం ప్రకటించి ఐదు యుద్ధనౌకలను ఐలాండ్‌కు పంపించింది. ఈ విషయం తెలుసుకొని 400 మంది అమెరికన్‌ సైనికులు ఫిరంగులతో సహా బిట్రన్‌ యుద్ధనౌకలు వచ్చిన ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయం ఇరుదేశాల ప్రభుత్వాల దృష్టికి వెళ్లింది. వెంటనే ఇరు వర్గాలు యుద్ధాన్ని విరమించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఐలాండ్‌లో ఇరు దేశాలు భద్రతా బలగాలను మోహరించాయి. 1872లో జర్మనీ మధ్యవర్తిత్వంతో సాన్‌ జువాన్‌ ఐలాండ్‌ అమెరికా వశమైంది. దీంతో బ్రిటన్‌ తమ బలగాలను వెనక్కి పిలుచుకుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు