close

వార్తలు / కథనాలు

వీక్షించండి: నీటి అలలపై మువ్వన్నెల మురిపెం

వీక్షించండి: నీటి అలలపై మువ్వన్నెల మురిపెం

హైదరాబాద్‌: పంచ భూతాల్లో అత్యంత ముఖ్యమైంది నీరు. జల జల పారే ప్రవాహాన్ని ఆనకట్టతో బంధించి అవసరమైనప్పుడు విడుదల చేసి భూమాతను సస్యశ్యామలం చేస్తున్నారు. దాంతో అందరికీ పట్టెడన్నం పెడుతున్నారు రైతన్నలు. నీరెంత ఉపయోగకరమో అంతకు మించి అందమైనది!

ఫెళ.. ఫెళ ధ్వనులతో ఉరిమే ఉరుముల మధ్య కారు మబ్బుల కడుపులు చీల్చుకొని నేలమీద పడే వాన చినుకులు ఎంత అందమైనవో వర్ణించగలమా! వాన చినుకులు వరద నీరై చెరువులు, సరస్సులు, నదులను నింపితే కలిగే ఆనందం అంతకన్నా రెట్టింపే. కొండ కోనల నడుమ వయ్యారంగా నేలపైకి దూకే జలపాతాల సోయగాలు తనివి తీరా వీక్షించేందుకు ఎక్కడికైనా.. ఎంత దూరమైనా.. వెళ్తారు ప్రకృతి ప్రేమికులు.

మరి కన్నుకుట్టే సోయగాలతో పొంగి పొర్లే వరద నీటికి జాతీయ భావం రంగరించి అద్దితే అదెంత వర్ణ రంజితంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూడొచ్చు ఇక్కడ. కర్ణాటకలోని సుప్రసిద్ధ ఆనకట్టల్లో ‘కృష్ణ రాజ సాగర ’ఒకటి. ఎగువన పడుతున్న వర్షాలతో రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. అన్ని గేట్లను తెరిచి రోజుకు 80,000 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు అధికారులు. మరి మాములూగా వదిలితే ఏముంది మజా అనుకున్నారో ఏమో ఆనకట్ట మీద జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుద్దీపాలు అమర్చారు. ఆ రంగుల కాంతి నీటి మీద పడడంతో నీరంతా మువ్వన్నెలుగా మారిపోయింది. మనసుకు చెప్పలేనంత హాయిని అందిస్తోంది. మీరూ చూసి ఆనందించండి మరి!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు