
వార్తలు / కథనాలు
దిల్లీ : రూ.100 కొత్త నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. మహాత్మాగాంధీ సిరీస్‌లో, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఊదా రంగులో ఈ నోటు ఉండనుంది. ఈ నోటు వెనకాల గుజరాత్‌లోని ప్రసిద్ధ కట్టడం ‘రాణి కీ వావ్’ మోటీఫ్ను ముద్రించారు. దీంతో అప్పటి నుంచి ‘రాణి కీ వావ్’ వారసత్వ కట్టడం గురించి తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు. దీని ప్రత్యేకత ఎంటి? చరిత్ర ఏంటి? లాంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
భారతీయ అద్భుత కళాసంపదకు నిలయంగా నిలిచిన ఈ కట్టడం గురించిన విశేషాలు..
* ‘రాణి కీ వావ్’ గుజరాత్‌లోని సరస్వతి నదీ తీరంలో ఉన్న సుప్రసిద్ధ కట్టడం. భూగర్భ నీటి వనరులను వాడుకోవడం కోసం నిర్మించిన మెట్ల బావి నిర్మాణం ఇది. పఠాన్ పట్టణంలో ఉన్న ఈ కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కింది.
* 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన రాణి ఉదయమతి.. తన భర్త భీమ్దేవ్ జ్ఞాపకార్థం ఈ కట్టడాన్ని నిర్మించారు. భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా దీని నిర్మాణం అద్భుతంగా జరిగింది.
* కొంత కాలానికి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈ నిర్మాణం కూరుకుపోయింది. దశబ్దాల అనంతరం 1980ల్లో పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో దీని ఆనవాళ్లు బయటపడ్డాయి. అనంతరం దీన్ని పునరుజ్జీవంలోకి తీసుకువచ్చారు.
* ఏడంతస్తుల మెట్లబావిగా దీన్ని నిర్మించారు. నీటి వినియోగం కోసమే కాకుండా అద్భుత కళాసంపదకు ఈ కట్టడం నిలయం. సుమారు 500 అద్భుత శిల్పాలు, వెయ్యికిపైగా చిన్న కళాకండాలు ఇందులో ఉన్నాయి. ఈ శిల్పాల్లో విష్ణువు దశావతారాలు కనిపిస్తాయి.
* ఈ బావి 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతు ఉంటుంది. నాలుగో అంతస్తులో నీటి ట్యాంక్ నిర్మాణం ఉంది.
* ఈ బావి అడుగున 30 కిలోమీటర్ల సొరంగం ఉన్నట్లు చెబుతుంటారు. ప్రస్తుతం ఇది రాళ్లు, బురదతో కూరుకుపోయిందని.. పఠాన్‌కు సమీపంలోని సిధ్‌పూర్‌కు ఈ సొరంగం దారితీస్తుందని తెలుస్తోంది. ఆ కాలంలో ఏదైనా విపత్తులు సంభవిస్తే రాజవంశస్థులు తప్పించుకోవడానికి ఈ సొరంగమార్గాన్ని వినియోగించేవారని చెబుతుంటారు.
*ఈ ప్రాంతం చుట్టుపక్కల ఆయుర్వేదానికి సంబంధించిన ఔషధ చెట్లు ఉండటంతో ఈ బావిలోని నీటితో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని ప్రజలు నమ్మేవారు.
*అహ్మదాబాద్‌కు 125 కి.మీ దూరంలో ఉన్న ఈ కట్టడాన్ని ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించొచ్చు. రోజు వేలాది సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
*దీని నిర్వహణ బాధ్యతలను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూస్తోంది. 2014లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో దీనికి చోటు దక్కింది.
* త్వరలో ఆర్బీఐ తీసుకురానున్న రూ.100 నోటుపై దీన్ని మోటీఫ్గా ముద్రించనున్నారు. దీంతో ఈ కట్టడం మరింత ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది.