Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

ఎప్పుడు టికెట్‌ రద్దు చేసుకుంటే.. డబ్బులొస్తాయి

ఎప్పుడు టికెట్‌ రద్దు చేసుకుంటే.. డబ్బులొస్తాయి

సిద్ధాంత్‌ తన కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లడానికి ముందస్తుగా నాలుగు రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల వారి ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సరైన అవగాహన లేకపోవటంతో రద్దు చేసుకున్న టికెట్ల డబ్బులు తిరిగి పొందలేకపోయారు. నాలుగు టికెట్లు అంటే ఎంత నష్టం? రైలు టికెట్ల రద్దు విషయంలో కాస్త అవగాహన ఉంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఎప్పుడు టికెట్‌ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగొస్తాయి? ఎప్పుడు క్యాన్సిల్‌ చేసుకుంటే డబ్బులు పొందలేము? లాంటి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

తత్కాల్‌ టికెట్టు...
తత్కాల్‌ టికెట్లు రద్దు చేసుకుంటే... డబ్బులు తిరిగొస్తాయా? చాలామందికి ఈ అనుమానం ఉంటుంది. ఇటీవల వరకు కన్‌ఫర్మ్‌డ్‌ తత్కాల్‌ టికెట్‌ రద్దు చేసుకుంటే డబ్బులు వచ్చేవి కావు. కేవలం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న తత్కాల్‌ టికెట్లు, అధికారులు రద్దు చేసిన టికెట్లకు మాత్రమే డబ్బులు వచ్చేవి. కానీ జూలై 1 నుంచి కన్‌ఫర్మ్‌డ్‌ తత్కాల్‌ టికెట్లను రద్దు చేసుకున్నా నిర్ణీత రుసుము తగ్గించి డబ్బులు వెనక్కి ఇస్తున్నారు.

ప్రయాణం రోజున
సాధారణంగా రైలు బయలుదేరటానికి నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటే డబ్బులు వెనక్కి రావు. ఇక టికెట్‌ రద్దు రుసుములు చూసుకుంటే... రైలు బయలుదేరటానికి 48 గంటల ముందు రద్దు చేసుకుంటే ఏసీ మొదటి తరగతి టికెట్టుకు రూ.240, ఏసీ 2టైర్‌ /మొదటి తరగతి టికెట్టుకు రూ.200, ఏసీ 3టైర్‌ టికెట్టుకు రూ.180 తగ్గించి టికెట్‌ డబ్బులు వాపసు ఇస్తారు. స్లీపర్‌ టికెట్టుకు రూ.120, రెండో తరగతి టికెట్టుకు రూ.60 చొప్పున ఒక్కో టికెట్టుపై తగ్గించి మిగిలిన డబ్బులు తిరిగిస్తారు. ప్రయాణానికి 12 గంటల ముందు రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్టు రుసుముపై 25 శాతం కోత విధిస్తారు. అదే మీరు వెళ్లాల్సిన రైలు అందుకోలేకపోతే ఈ- టికెట్‌ ఉన్నవారు వెబ్‌సైట్‌లో టీడీఎస్‌ ఫైల్‌ చేసుకోవాలి. మాన్యువల్‌ టికెట్‌ ఉన్నవాళ్లయితే కౌంటర్‌కి వెళ్లి తిరిగిచ్చి మీ డబ్బులు తీసుకోవచ్చు. దీని కోసం కొంత రుసుము తగ్గించుకొని మీకు డబ్బులు ఇస్తారు.

ఆర్‌ఏసీ టికెట్‌...

ఆర్‌ఏసీ టికెట్లు రద్దు చేసుకుంటే... డబ్బులు తిరిగొస్తాయా? చాలామందికి ఈ అనుమానం ఉంటుంది. సాధారణ టికెట్లను రద్దు చేసుకున్నట్లే... ఆర్‌ఏసీ టికెట్లను రద్దు చేసుకున్నా మీ డబ్బులు వెనక్కి వస్తాయి. రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు అలాంటి టికెట్టు రద్దు చేసుకోవచ్చు. ఆ 30 నిమిషాల్లోపు రద్దు చేసుకోకపోతే మాత్రం టికెట్టు డబ్బులు తిరిగి పొందలేరు.

పార్టీ టికెట్టు
కుటుంబ సభ్యులందరూ కలసి విహార యాత్రలు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఉపయుక్తంగా ఉండటానికి రైల్వే.. పార్టీ టికెట్టు ను ప్రారంభించింది. ఇలా తీసుకున్న టికెట్‌లో కొంతమందికి కన్ఫర్మ్‌ అయ్యి, మరికొంతమంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండొచ్చు. మామూలుగా అయితే రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు టికెట్‌ రద్దు చేసుకుంటే డబ్బులు వెనక్కి రావు. కానీ పార్టీ టికెట్ల విషయంలో ఈ నిబంధన వర్తించదు. పార్టీ టికెట్‌లు రద్దు చేసుకుంటే మీ పూర్తి డబ్బులు మీకు వస్తాయి. రైల్వే అధికారులకు విషయాన్ని వివరించి.. రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందుగా అందరి టికెట్లు రద్దు చేసుకుంటే తిరిగి టికెట్టు డబ్బులు వాపసు పొందవచ్చు.

టికెట్టు పోయినప్పుడు..
ఆన్‌లైన్‌ టికెట్‌ ప్రింటవుట్‌ పోతే మరొకటి తీసుకోవచ్చు. మరి కౌంటర్‌లో బుక్‌ చేసిన టికెట్‌ పోతే ఏం చేయాలి. మళ్లీ కొత్తది తీసుకోవాలా?. ఈ అనుమానం చాలామందికి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ టికెట్‌ కొనక్కర్లేదు. మీ టికెట్‌ పోయిన విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేయండి. వారు నిర్ధరించుకొని నకలు టికెట్టు ఇచ్చి ప్రయాణం కొనసాగించేలా చర్యలు తీసుకుంటారు. అంతేకానీ పోగొట్టుకున్న టికెట్టు డబ్బులు మాత్రం తిరిగి పొందలేరు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు