
వార్తలు / కథనాలు
ఫ్లయింగ్ సూట్‌తో గాల్లో రయ్రయ్!
ఇంటర్నెట్: స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్.. వారి ప్రయాణానికి ట్రాఫిక్ రూల్స్ లేవు. సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్‌లాంటి సమస్యలు అసలే ఉండవు. టీవీల్లో చూసినప్పుడల్లా మనం కూడా గాల్లో ఎగురుతూ ప్రయాణిస్తే ఎంత బాగుండు అనుకుంటాం. అలాంటి వారి కోసం బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ బ్రౌనింగ్ ఫ్లయింగ్ సూట్‌ను కనిపెట్టాడు.
గాలిలో ఎగరాలని, ప్రయాణించాలని మొదటి నుంచీ బ్రౌనింగ్ కలలు కనేవాడు. అందుకే ఎన్నో సంవత్సరాలు కష్టపడి గాలిలో ప్రయాణించేందుకు వీలుగా ఫ్లయింగ్ సూట్‌ను కనిపెట్టాడు. ఫ్లయింగ్ సూట్ అనగానే నెమ్మదిగా వెళుతుందనుకునేరు! ఈ సూట్ వేసుకొని గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. గాలిలో ఎగరాలనుకునే వారి కోసం దాన్ని విక్రయానికి పెట్టారు. ఈ గ్రావిటీ ఫ్లయింగ్ సూట్ ధర దాదాపు రూ.3కోట్లు ఉంటుందని అంచనా. మీకు అంత మొత్తం చెల్లించే సామర్థ్యం ఉంటే మీరూ ఐరన్ మ్యాన్‌లా గాలిలో విహరించవచ్చు.
అది మా బ్లడ్‌లో ఉంది..
ఇంతకీ ఫ్లయింగ్ సూట్‌ను తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అని బ్రౌన్‌ను అడిగితే వచ్చే సమాధానమిదీ.. ‘మా నాన్న ఓ ఎరోనాటికల్ ఇంజినీర్. వాళ్ల నాన్న విమాన పైలట్. యుద్ధ విమానాలూ నడిపేవారు. మరో తాత బ్రిటీష్ హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని నడిపించేవారు. అందుకే విమానయానం అన్నది మా రక్తంలో ఉంది. మా కుటుంబ సభ్యులంతా విమానరంగానికి చెందిన వారు. అందువల్ల సహజంగా నాకూ ఆసక్తి కలిగింది’ అని బ్రౌనింగ్ తెలిపారు. అది తన సంతృప్తి కోసం తయారు చేశానని పేర్కొన్నారు. ఇంతటితో ఆగిపోనని, ఎలక్ట్రానిక్ వెర్షన్లో మరో సూట్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని బ్రౌనింగ్ చెప్పారు.
ఏప్రిల్ ఫూల్ అనుకున్నారు..
బ్రౌనింగ్ 2017లో విల్ట్‌షైర్‌లోని తన ఇంట్లో గ్రావిటీ స్ప్రింగ్ అనే కంపెనీని ప్రారంభించారు. దీనికి సంబంధించిన వార్తలు ఏప్రిల్ 1న వార్తాపత్రిల్లో వచ్చాయి. ఏప్రిల్ ఫూల్ చేసేందుకే ఈ ప్రయత్నమంటూ అందరూ అనుకున్నారు. ఆ తర్వాత నిజమని తెలుసుకున్నారు. మొదట్లో జెట్ సాయంతో ఎగిరే ఫ్లయింగ్ సూట్‌ను కనిపెట్టారు. కానీ, అది ఎక్కువ ఎత్తు ఎగరలేకపోయింది. ఫ్లయింగ్ సూట్‌ను కనిపెట్టాలనుకున్నప్పుడు ఇంతకు ముందు అలాంటి సూట్లు ఉన్న దాఖలాలు లేవు. మొదట్లో ఈ ప్రాజెక్టును సరదాగా తీసుకున్న బ్రౌనింగ్.. ఆ తర్వాత ఎంతో శ్రమ కోర్చి నిజంగానే గాల్లో ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. ఇది ఇప్పటికే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకుంది.
12వేల అడగుల ఎత్తులో..
ఈ గ్రావిటీ ఫ్లయింగ్ సూట్ త్రీడి ప్రింటెడ్, ప్రత్యేక ఎలక్ట్రానిక్ భాగాలు, ఐదు జెట్ ఇంజిన్లను ఉపయోగించి తయారు చేశారు. గంటకు 52 కిలోమీటర్ల వేగంతో, 12వేల అడుగుల ఎత్తు వరకూ ఎగరవచ్చు. కాళ్లూ, చేతుల ఆడిస్తూ మనకు కావాల్సిన వైపు ప్రయాణించవచ్చు. దీనికి వైఫై కనెక్ట్ చేసి ఉంటుంది. ఏ ప్రాంతంలోనైనా, ఏ సమయంలోనైనా దిగే అవకాశం ఉంటుంది. ఆ సూట్ బరువు 27కిలలో ఉంటుంది. గ్యాస్‌తో నింపిన ఐదు టర్బైన్లు ఉంటాయి.
మొదట్లో మోటార్ కారు సైతం ఎక్కువ ఖర్చుతో, శబ్ధం, వాసన, కాలుష్యంతో ఉండేది. కానీ, ఇప్పుడు వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ ఆధారిత సూట్లు వస్తే భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి ఈ ఫ్లయింగ్ సూట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. సో బ్రౌనింగ్ కృషి ఫలించాలని ఆశిద్దాం..!