close

వార్తలు / కథనాలు

ప్రాణాల మీదకు మరో గేమ్‌!!

చిన్నారులను బలిగొంటున్న ‘మోమో’

ప్రాణాల మీదకు మరో గేమ్‌!!

ఇంటర్నెట్‌డెస్క్‌: నిన్న మొన్నటి వరకు పలువురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ‘బ్లూవేల్‌ ఛాలెంజ్‌’ ఉదంతం మరిచిపోకముందే మరో ప్రాణాంతక గేమ్‌ ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దానిపేరే ‘మోమో’. భయంకరమైన శరీర ఆకృతి, పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఓ విచిత్ర ఆకారం పేరే ఈ ‘మోమో’. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ వేదికగా ఈ గేమ్‌ ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అర్జెంటీనాలో ఓ చిన్నారి ఈ గేమ్‌కు బలవ్వడంతో ఈ గేమ్‌ గురించి చర్చించుకోవడం మొదలైంది.

జపాన్‌కు చెందిన ఓ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ ఈ ఆకారాన్ని రూపొందించింది. అయితే, ఆ కంపెనీకీ ఈ గేమ్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ గేమ్‌లో భాగంగా ‘బ్లూవేల్‌’ తరహాలో కొన్ని టాస్కులు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్‌.. ‘మోమో’ ప్రొఫైల్‌ పిక్‌ ఉన్న ఓ గుర్తు తెలియని నంబర్‌ నుంచి వస్తుంది. వారిచ్చిన పనిని పూర్తి చేయాలని ఆదేశాలు అందుతాయి. ఆ పని పూర్తి చేసి మోమో గేమ్‌లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో దాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారి ఆదేశాలను ధిక్కరిస్తే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన వీడియోలు పంపడం, బెదిరింపులు రావడం మొదలవుతాయి.

ప్రాణాల మీదకు మరో గేమ్‌!!

ఈ గేమ్‌ ఆడుతూ అర్జెంటీనాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలిక చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె వాట్సాప్‌లో ఇందుకు సంబంధించిన చిత్రాలు ఉండడం చూసి నిర్ధారణకు వచ్చారు. చనిపోవడానికి ముందు ఈ గేమ్‌ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియోను తన ఫోన్‌లో చిత్రీకరించినట్లు అక్కడి స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన 18 ఏళ్ల యువతిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఈ గేమ్‌.. యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో విస్తృతమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం లింక్‌ల ద్వారా వచ్చే ఇలాంటి ఛాలెంజ్‌లు మన దేశానికీ వచ్చే అవకాశం లేకపోలేదని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. అలాంటి ఛాలెంజ్‌లకు సంబంధించిన లింకులను క్లిక్‌ చేయకుండా ఉండడమే మంచిదని, ముఖ్యంగా ఇలాంటి గేమ్‌ల పట్ల ఆకర్షితులయ్యే చిన్నారులపై ఒక నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులూ బహుపరాక్‌!!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు