close

వార్తలు / కథనాలు

బిడ్డ కోసం తల్లి వేషధారణలో.

హృదయాన్ని ద్రవింపజేసే ఓ తండ్రి కథ ఇది

బిడ్డ కోసం తల్లి వేషధారణలో.

బ్యాంకాక్‌: భూమ్మీద ఉన్న ప్రతీ జీవికి అమ్మంటే ఎంతో ఇష్టం. ఆడపిల్లైనా, మగపిల్లాడైనా వారికి అమ్మ అవసరం ఎంతో ఉంటుంది. ఉదయం లేవగానే అమ్మలేనిదే పనులు జరగవు. కానీ తల్లి ప్రేమకు దూరమైన పిల్లల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంటుంది. తండ్రుల్లోనే తల్లిని చూసుకుంటూ బతుకుతుంటారు. భార్య లేకపోవడంతో పిల్లలకు తల్లి లేని లోటు తీరుస్తూ పెంచుతున్న ఓ తండ్రి కథ ఇది. థాయ్‌లాండ్‌కు చెందిన పనుథాయ్‌ అనే వ్యక్తికి ఇద్దరు మగపిల్లలు.

వారి పేర్లు ఓజోన్‌, ఇమ్సోమ్‌. కొన్ని రోజుల క్రితం పనుథాయ్‌ తన భార్యతో విడిపోయాడు. దాంతో ఆమె యూరప్‌కు వెళ్లిపోయింది. అయితే పిల్లల సంరక్షణ బాధ్యతను మాత్రం అక్కడి న్యాయస్థానం తండ్రికే అప్పగించింది. వారికి అన్నీ తానే అయ్యి ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటున్నాడు పనుథాయ్‌. అయితే థాయ్‌లాండ్‌లో మాతృ దినోత్సవాన్ని ఆగస్ట్‌ 12న జరుపుకొంటారు. 1976 ఆగస్ట్‌ 12న థాయ్‌లాండ్‌ రాణి సిరికిట్‌ జన్మించారు. అప్పటినుంచి ఆమె పుట్టినరోజును మాతృ దినోత్సవంలా జరుపుకొంటున్నారు.

అయితే మొన్న వచ్చిన మాతృ దినోత్సవం రోజున పనుథాయ్‌ పిల్లలు చదువుతున్న పాఠశాలలో తల్లుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఒకటి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా తమ తల్లులను తీసుకుని రావాల్సిందిగా యాజమాన్యం కోరింది. కానీ పనుథాయ్‌ పిల్లలకు తల్లి లేదు. దాంతో పిల్లలు ఎక్కడ బాధపడతారోనని భావించిన పనుథాయ్‌ తన భార్యలా తయారై పాఠశాల కార్యక్రమానికి వెళ్లాడు. తెల్లటి గౌను, క్లిప్‌ పెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. కార్యక్రమానికి తల్లి రాదని బాధపడుతున్న పిల్లలు..తన తండ్రిని చూడగానే ఎంతో సంబరపడిపోయారు. తమ కోసం పాఠశాలకు వచ్చినందుకు ఆ చిట్టితండ్రి తన తండ్రికి నమస్కారం చేస్తుండగా అక్కడే ఉన్న పనుథాయ్ స్నేహితుడు వీడియో తీశాడు. దానిని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ‘ఇలాంటి తండ్రులకు హ్యాట్సాఫ్‌’ అంటూ నెటిజన్లు పనుథాయ్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు