
వార్తలు / కథనాలు
సగటు మొబైల్ వినియోగదారుడ్ని వెంటాడుతున్న భయం.. ‘ఫోన్ ట్యాపింగ్’. దీని ద్వారా మొబైల్లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు దొంగలిస్తారు. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ రహస్య వివరాలను తెలుసుకొని మీ ఖాతాలకు కన్నం వేస్తారు. మీరే పంపించినట్లుగా అనుచిత సందేశాలను ఇతరులకు పంపిస్తారు. మీ పనిని మరింత సులభం చేస్తామంటూ ‘ట్రాక్ వ్యూ’ లాంటి ట్యాపింగ్ యాప్స్ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ ట్యాపింగ్ భూతం నుంచి తప్పించుకోవడం ఎలా.. మన మొబైల్ ట్యాపింగ్‌కు గురైందని తెలుసుకోవడం ఎలా?
1. మొబైల్ నుంచి శబ్దాలు వస్తున్నాయా?
ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు లేదా ఝుమ్మని వినిపిస్తుంటే.. మీ ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని అనుమానించొచ్చు. కొన్ని సందర్భాల్లో నెట్వర్క్ సమస్యల వల్ల కూడా ఇలాంటి ధ్వనులు రావచ్చు. సాధారణంగా ఫోన్ ఉపయోగించనప్పుడు ఎలాంటి శబ్దాలు రాకూడదు. అలాకాకుండా మామూలు సందర్భాల్లో కూడా బీప్ సౌండ్స్‌గానీ, క్లిక్ సౌండ్స్‌గానీ వస్తున్నట్లయితే మన ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేసినట్లే. సాంకేతికంగా దీనిని మరింతగా నిర్ధారించుకోవడానికి ‘సౌండ్ బ్యాండ్ విడ్త్ సెన్సార్’ అనే పరికరం ఉంటుంది. దీనిని ట్యాపింగ్‌కు గురైన ఫోన్ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని నిర్ధారించుకోవచ్చు.
2. బ్యాటరీ లైఫ్‌ని పరిశీలించుకోండి
ఫోన్ ఛార్జింగ్ బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారిగా బ్యాటరీ లైఫ్ పడిపోయినట్లయితే కొంచెం ఆలోచించాల్సిందే. మనకు తెలియకుండానే బ్యాక్ గ్రౌండ్లో ట్యాపింగ్ సాఫ్ట్వేర్ రన్ అవుతుండటం వల్ల కూడా ఇలా జరగొచ్చు. ఎంత సేపు ఛార్జింగ్ పెట్టాం? ఎక్కువగా ఫోన్ కాల్స్ ఏమైనా మాట్లాడామా? యాప్స్ ఏమైనా ఉపయోగించామా? నెట్ బ్రౌజ్ చేశామా? లాంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. ఒకవేళ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే దానివల్లే బ్యాటరీ ఖర్చయిందని అర్థం. లేదంటే మన ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లే లెక్క.
యాపిల్, ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఏ అప్లికేషన్ ఎంత మేర బ్యాటరీని వినియోగించుకుంటుందో తెలుసుకోవచ్చు. ‘సెట్టింగ్స్->బ్యాటరీ సెట్టింగ్స్-> బ్యాటరీ యూసేజ్’ ఆప్షన్‌తో తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్, కోకోనట్ బ్యాటరీ తదితర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా బ్యాటరీ ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత దాని ఛార్జింగ్ నిల్వ సామర్థ్యం సంవత్సరం వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ తగ్గిపోతుంది. అలాంటి సందర్భాల్లో బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్, జీపీఎస్, వైఫై ఆఫ్ చేయడంతోపాటు, డిస్ప్లే స్క్రీన్ బ్రైట్నెస్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి.
3. మీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి చూడండి
మీ మొబైల్ ఇంతకు మునుపటిలా సమర్థంగా పని చేయడం లేదా? స్విచ్చాఫ్ చేసిన వెంటనే షట్‌డౌన్ కావడం లేదా? స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ లైట్ ఇండికేటర్ వెలుగుతూనే ఉందా? అయతే మీ ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేశారని అనుమాన పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ను ఒక్కసారి రీబూట్ చేయడం మంచిది. కొన్నిసార్లు కొత్తగా ఇన్స్టాల్ చేసిన యాప్స్ వల్లగానీ, ఆప్డేటెడ్ సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపాలున్నా సరే ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.
4. ఫోన్ ఆటోమేటిక్‌గా ఆన్/ఆఫ్ అవుతోందా?
మీ ప్రమేయం లేకుండానే ఫోన్ ఆన్/ఆఫ్ అవుతోందా? కొత్త యాప్స్ వాటంతట అవే ఇన్స్టాల్ అయిపోతున్నాయా? అయితే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లే.. మీ మొబైల్లో కొన్ని స్పై యాప్స్‌ని ఇన్స్టాల్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొరకబుచ్చుకుంటారు. తద్వారా మీ కాల్స్‌ను ట్యాప్ చేస్తారు. మీకు ఇలాంటి అనుమానం వచ్చినట్లయితే వెంటనే అలెర్ట్స్‌ను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన మొబైల్లో ఎలాంటి యాప్స్ ఇన్‌స్టాలైనా సంబంధిత ఈ మెయిల్ అకౌంట్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. మీ మొబైల్‌కు అపరిచత వ్యక్తుల నుంచి ఎన్‌కోడెడ్ మెసేజ్‌లు వస్తున్నట్లయితే.. కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మొబైల్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఇదో నిదర్శనం. వీటి ద్వారా మాల్వేర్ను మన ఫోన్లోకి చొప్పించి ట్యాపింగ్‌కు పాల్పడతారు.
5. ట్యాపింగ్‌కు గురైందని ఇలా కూడా చెప్పొచ్చు..
మీరెప్పుడైనా గమనించారో లేదో.. మాట్లాడుతున్న ఫోన్‌ను టీవీ దగ్గర గానీ, రేడియో దగ్గర గానీ, ల్యాప్‌టాప్, కాన్ఫరెన్స్ ఫోన్ దగ్గర ఉంచినప్పుడు ఝుమ్మ్ని శబ్దం వినిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పడు ఇలాంటి శబ్దాలు రావు. ఫోన్ ఉపయోగించనప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు వస్తున్నాయంటే మీ ఫోన్ ద్వారా అవతలి వ్యక్తులు మీరు మాట్లాడుకుంటున్నది వింటున్నట్లే లెక్క.
6. ఫోన్ బిల్ చెక్ చేసుకోండి
సాధారణంగా వస్తున్న ఫోన్ బిల్ కంటే ఒకేసారి ఎక్కువ బిల్ వచ్చిందా? వెంటనే ఆ లిస్ట్ తెప్పించుకొని చెక్ చేయండి. కాల్స్ కోసం ఎంత ఖర్చు చేశామో? డేటా కోసం ఎంత ఖర్చు చేశామో? పరిశీలించండి. కొందరు వ్యక్తులు మాల్‌వేర్స్‌ని మొబైల్‌లోకి చొప్పించి.. మన డేటా ప్లాన్‌ను తస్కరించి వారి రహస్య లావాదేవీలను జరుపుతారు. మనకు తెలియకుండా ఏదో యాప్‌ను ఇన్స్టాల్ చేస్తే... అది ఎక్కువ డేటాను ఉపయోగించినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.
7. యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్త
చాలా మాల్వేర్స్ యాప్స్ ద్వారానే మొబైల్‌లోకి చొరబడతాయి. అందువల్ల యాప్‌స్టోర్ నుంచి గానీ, గూగుల్ ప్లేస్టోర్ నుంచి గానీ యాప్స్‌ని డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా యాప్స్‌లో స్పైవేర్‌కి సంబంధించిన లక్షణాలు లేనప్పుడే వాటిని డౌన్లోడ్ చేయాలి. అయితే అధికారిక యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్ అన్నీ దాదాపు స్క్రీనింగ్ చేసినవే ఉంటాయి. కానీ, కొన్ని మాల్వేర్ యాప్స్ ప్లేస్టోర్ సెక్యూరిటీ కళ్లుగప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ముఖ్యంగా గేమింగ్ యాప్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు కాల్ హిస్టరీ, అడ్రస్‌బుక్, కాంటాక్ట్ లిస్ట్ కోసం పర్మిషన్ అడిగితే ఆలోచించుకోవాలి. మరికొన్ని చీటింగ్ యాప్స్ మనందరికీ తెలిసిన పేరుతో.. అదే లోగోతో కనిపిస్తాయి. అందువల్ల డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ డెవలపర్ పేరును చెక్ చేసుకోవడం మంచిది. మీ ఫోన్‌ను మీ పిల్లలు కూడా ఉపయోగిస్తున్నట్లయితే.. అనుచిత యాప్స్‌ని డౌన్లోడ్ చేయకుండా పేరెంటల్ యాక్సిస్ తీసుకోవడం ఉత్తమం.
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం