close

వార్తలు / కథనాలు

చిలుకల పొదుపు.. మనకు మేల్కొలుపు

చిలుకల పొదుపు.. మనకు మేల్కొలుపు

ఇంటర్నెట్‌డెస్క్‌: నెలవారీ ఇంటి ఖర్చుల కోసం చాలా మంది తెగ లెక్కలేసేస్తుంటారు. ఖర్చులపై నియంత్రణ లేకపోతే చిన్న, మధ్య తరగతి ఉద్యోగులకు నెలాఖరు వచ్చే సరికి దాదాపు లోటు బడ్జెట్టే. కొంత మంది మాత్రం పొదుపుగా ఖర్చు చేస్తూ..ఎంతో కొంత వెనకేసుకుంటారు. బడ్జెట్‌ విషయంలో మనుషుల్లాగే చిలుకలు కూడా ప్రణాళికలు వేసుకుంటాయంటున్నారు జర్మన్‌ శాస్త్రవేత్తలు. ముద్దు ముద్దుగా మాట్లాడగలిగే చిలుకలకు పొదుపు మంత్రాలు కూడా తెలుసని వారు అంటున్నారు.

చిలుకల పొదుపు.. మనకు మేల్కొలుపు

జర్మనీలోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు నాలుగు జాతులకు చెందిన 33 చిలుకలపై పరిశోధనలు జరిపారు. వాటికి కొన్ని టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కదాని విలువెంతో వాటికి చెప్పారు. టోకెన్లు ఇస్తేనే వాటికి ఆహారం. అంతేకాకుండా ఆ వాటిని పొదుపు కూడా చేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ రోజులు పొదుపు చేస్తే.. రివార్డు పాయింట్లు అంత ఎక్కువగా వస్తాయి. పాయింట్లను బట్టి మరికొన్ని టోకెన్లను అదనంగా ఇస్తారు. అయితే వాటిలో చాలా చిలుకలు..ఎక్కువ రివార్డు పాయింట్ల కోసమే ప్రయత్నించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

కొన్ని చిలుకలు ఆక్రోటు గింజల కోసం తమ టోకెన్లను విక్రయిస్తే.. మరికొన్ని తక్కువ ధరకు లభించే ఎండు జొన్నలు, సన్‌ఫ్లవర్‌ గింజల కోసం ఉపయోగించుకోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. వారు ఇక్కడ మరో ప్రయోగం కూడా చేశారు. తక్కువ ధర కలిగిన ఆహారాన్ని, ఓ టోకెన్‌ను పక్కపక్కనే పెట్టి చిలుకలను ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోమన్నప్పుడు.. చాలా చిలుకలు టోకెన్‌నే ఎంచుకున్నాయట. ఎందుకో తెలుసా..? ఆ టోకెన్‌ విలువతో మరింత మంచి ఆహారాన్ని కొనుక్కోవచ్చని వాటికి తెలిసిపోయింది.

అయితే... అటవీ ప్రాంతంలో జీవించే చిలుకలకు ఇలాంటి తెలివితేటలు ఉండకపోవచ్చని... పరిశోధనలు జరిపిన చిలుకలు జన జీవనంతో మమేకమై ఉండటం వల్ల వాటికి ఆలోచించే స్వభావం పెరిగిందని పరిశోధనకు నాయకత్వం వహించిన డా. ఆగస్టే వోన్‌ బయెరన్‌ తెలిపారు. వీటిలో చాలా చిలుకలు తక్కువ కష్టంతో.. తమ కొనుగోలు శక్తిని పెంచుకునేందుకే మొగ్గు చూపాయని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిశోధన ద్వారా చిలుకలకు ఆర్ధిక అంశాలపై సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుందని నిర్ధారించినట్లు ఆగస్టే పేర్కొన్నారు. మొత్తం 4 రకాల చిలుకలపై పరిశోధనలు చేశారు. వీటిలో 9 ఆకుపచ్చ చిలుకలు, 8 నీలం రంగు మెడ కలిగిన చిలుకలు, 8 నీలం రంగు తల చిలుకలు, 8 ఆఫ్రికన్‌ చిలుకలున్నాయి. అయితే వీటిలో ఒక్కో రకం చిలుకల ఆలోచనా విధానం ఓక్కోరకంగా ఉన్నట్లు తేలింది. ఆకుపచ్చ చిలుకలు నిర్ణయాలు తీసుకోవడంలో ముందువరుసలో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే రకం పరిశోధనలను చింపాజీలపై కూడా చేస్తున్నట్లు వారు వెల్లడించారు.


Tags :

మరిన్ని