Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

ఆకలిని తీర్చే ‘అనాజ్‌ బ్యాంకు’

ఆకలిని తీర్చే ‘అనాజ్‌ బ్యాంకు’

పేద గిరిజనుల పాలిట అన్నపూర్ణ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ప్రపంచంలో ఎవరికైనా ప్రధాన శత్రువేంటో తెలుసా! ఆకలి. అందుకే ‘కోటి విద్యలు కూటి కోసమే’ అన్నారు. అవి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కోరన్‌, శంకర్‌గఢ్‌ గ్రామాలు. పట్టణ జీవనానికి దూరంగా బతికే పల్లెలు. సరైన పంటలు కూడా పండని ఆ గ్రామాల్లో చాలా మంది గిరిజన తెగకు చెందిన వారే. నిత్యం ఆకలి కడుపులతోనే పడుకునేవారు. మరి అలాంటి వారికి ఇప్పుడు ఆకలన్నదే తెలియదు. ఏ ఒక్కరూ ఆకలి కడుపుతో పడుకోరు. ఒక ఆలోచన వారి జీవితాన్ని మార్చేసింది. అదే ‘అనాజ్‌ బ్యాంక్‌’. ఈ బ్యాంకు ఏర్పాటుతో ఆ గ్రామాల్లోని ప్రజల జీవితాలు ఎలా మారాయి? ఆకలిని ఎలా జయించారు?

జీబీ పంత్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన అధ్యాపకుడు సునీత్‌ సింగ్‌ ఒకసారి ఆ గ్రామాల్లో పర్యటించారు. అంతవరకూ ఆ గ్రామాల్లోని చాలా పేద కుటుంబాలు ఆకలితోనే పడుకునేవి. వారి పరిస్థితి చూసిన సునీత్‌ సింగ్‌ చలించిపోయారు. వెంటనే ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. స్థానికంగా ఉన్న ఎన్‌జీవో ప్రగతి వాహిని ఫౌండేషన్‌ ఎదుట తన ఆలోచనను ఉంచారు. దీంతో ఆ గ్రామాల్లోని స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి, ‘అనాజ్‌ బ్యాంకు’కు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా గ్రామంలో ఒక స్టోర్‌ను ఏర్పాటు చేశారు. అందులో 300కేజీల ధాన్యం పట్టే ఒక పెద్ద డబ్బాను ఉంచారు. గ్రామంలోని ఎవరైనా సరే అందులో ధాన్యాన్ని జమ చేయవచ్చు. అలా జమ అయిన ధాన్యాన్ని కావాల్సిన వారికి అప్పుగా ఇస్తారు. ముఖ్యంగా బియ్యం, గోధుమలు తదితర ధాన్యాలను అప్పుగా తీసుకోవచ్చు. దీని వల్ల ఆయా గ్రామాల్లోని దాదాపు 300 కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి.

ఆకలిని తీర్చే ‘అనాజ్‌ బ్యాంకు’

‘ఈ బ్యాంకులో ఎవరైనా ఒక కిలో బియ్యాన్ని జమ చేయడం ద్వారా సభ్యులుగా చేరొచ్చు. ప్రతి సభ్యుడు అయిదు కిలోల చొప్పున బియ్యాన్ని అప్పుగా తీసుకోవచ్చు. అలా తీసుకున్నవారు 15రోజుల్లోగా మళ్లీ జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎలాంటి అదనపు రుసుము గానీ, అదనంగా బియ్యాన్ని కానీ జమ చేయాల్సిన అవసరం లేదు. తీసుకున్న దాన్ని తిరిగి మళ్లీ జమ చేస్తే చాలు.’ అని సునీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు. ‘ఆకలిలేని అలహాబాద్‌ కోసం’ అంటూ సింగ్‌ అతని సహోద్యోగులు దీన్నో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం వీరి బృందంలో అధ్యాపకులు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు ఇలా మొత్తం 40మందికి పైగా ఉన్నారు. వీరంతా ఆకలితో అలమటిస్తున్న గిరిజనుల సంక్షేమం కోసం పాటుడుతున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు