close

వార్తలు / కథనాలు

ఈ ఐస్‌క్రీమ్‌ను చూస్తే ముద్దు చేయాలనిపిస్తుంది

ఈ ఐస్‌క్రీమ్‌ను చూస్తే ముద్దు చేయాలనిపిస్తుంది

ఇంటర్నెట్ డెస్క్‌: చిట్టి కుక్క పిల్లలను చూస్తే దగ్గరకు తీసుకొని ముద్దు చేయాలనిపిస్తుంది. వాటితో ఆడుకుంటూ అవి చేసే అల్లరిని ఆస్వాదించాలనిపిస్తుంది. కానీ తైవాన్‌ వాసులు ఈ చిట్టి పప్పీలను ముక్కలు ముక్కలుగా చేసుకొని ఎంతో ఇష్టంగా తినేస్తున్నారు. అది కూడా డబ్బులు చెల్లించి మరీ, పబ్లిక్‌గా రెస్టారెంట్‌లలో కూర్చొని. ఛీ వాళ్లకు మనసెలా ఒప్పింది అంటూ వెంటనే తిట్టేయకండి. ఆ విషయాలేంటో తెలుసుకోండి..

అయితే అవి నిజమైన కుక్క పిల్లలు కాదులెండి. ఐస్‌క్రీమ్‌లనే అలా వినూత్నంగా తయారు చేశారు. ఓ ప్లేట్‌లో పొట్ట ఆనించి, నిద్రావస్థలో ఉన్న పప్పీలా కన్పిస్తుంది. దగ్గరికెళ్లి ఆ చల్లదనాన్ని గమనిస్తే తప్ప ఎవ్వరూ వాటిని ఐస్‌క్రీమ్‌లని నమ్మలేరు. ఇప్పుడు ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐస్‌క్రీమ్‌ ప్రియులను ఆకట్టుకోవడానికి తైవాన్ ఈ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. అచ్చం చైనా జాతికి చెందిన కుక్క పిల్లల్లాగే వీటి ఆకారాన్ని రూపొందించారు. వాటి వైపు చూస్తుంటే ఇక లేస్తాయేమో.. తోక ఊపుతాయేమో అనిపిస్తుంది.

ఈ ఐస్‌క్రీమ్‌ను చూస్తే ముద్దు చేయాలనిపిస్తుంది

ఈ పప్పీ ఐస్‌క్రీమ్‌లను తైవాన్‌లోని జేసీ కో ఆర్ట్ కిచెన్ వారు మొదట వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పగ్స్‌, షార్‌ పీస్‌, లాబ్రడార్‌ వంటి రకాల జాతుల శునకాలను పోలిన ఐస్‌క్రీమ్‌లను వీరు తయారు చేస్తున్నారు. రకరకాల పప్పీల ఆకారంలో మాడ్యూల్స్‌ తయారుచేసి ఐస్‌క్రీమ్‌ మిక్చర్‌ను దానిలో ఉంచి, దాదాపు మైనస్‌ 22 డిగ్రీల వద్ద గడ్డ కట్టిస్తారు. అనంతరం దానికి ఫైనల్ టచ్‌ ఇచ్చి వినియోగదారులకు ఇస్తారు. ఇంకో విషయమేంటంటే ఒక్కో జాతి ఒక్కో ప్లేవర్‌లో దొరుకుతుంది. లాబ్రడార్ పప్పీ ఐస్‌క్రీం..ఎర్ల్ గ్రే ఫ్లేవర్‌లో, షార్‌ పీస్‌, పగ్స్‌.. పీనట్ ప్లేవర్‌లో లభిస్తున్నాయి. వీటి ధరలు రూ.260 నుంచి రూ.445 మధ్య ఉన్నాయి. ఇవి ఆకట్టుకుంటున్నా.. వాటి ఆకారం మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉందని పలువురు అంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు