Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

నాడు లైంగిక బాధితురాలు.. నేడు నోబెల్‌ గ్రహీత‌

నాడు లైంగిక బాధితురాలు.. నేడు నోబెల్‌ గ్రహీత‌

బాగ్దాద్‌: లైంగిక బాధితురాలిగా ఎన్నోసార్లు ఉగ్రవాదుల చేతిలో సామూహిక అత్యాచారాలకు గురై, తల్లిని, తోబుట్టువులను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న యువతి.. ఇప్పుడు అత్యున్నత నోబెల్‌ శాంతి బహుమతి అందుకోబోతోంది. ఆమే ఇరాక్‌లోని యాజిదీ తెగకు చెందిన నదియా మురద్‌. తనలా నరకం అనుభవిస్తున్న యాజిదీ యువతులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న మురద్‌ అందుకోసం ఎంతో కృషి చేస్తోంది. యుద్ధంలో మహిళలపై లైంగిక హింసను ఆయుధంగా వాడుకోవడాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషికి గాను కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్‌ ముక్‌వెగె, ఇరాక్‌కు చెందిన నదియా మురద్‌లకు ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. 25ఏళ్ల నదియా మురద్‌ యాజిదీ అమ్మాయిగా ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు.

నదియాది ఇరాక్‌లో యాజిదీలు ఎక్కువగా నివసించే సింజర్‌ ప్రాంతం. ఇది సిరియా సరిహద్దుకు దగ్గరగా ఉంది. అక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ. వారు చేసే అకృత్యాలు మాటల్లో వర్ణించలేనంత దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా యాజిదీ స్త్రీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తారు. 2014 ఆగస్టులో నదియా జీవితంలో నరకం మొదలైంది. ఐఎస్‌ ఉగ్రవాదులు నల్లని జెండాలతో ట్రక్కుల్లో వచ్చారు. నదియా గ్రామమైన కోచోలో చొరబడి ఇష్టం వచ్చినట్లుగా పురుషులను చంపేశారు. చిన్న పిల్లలను బంధించి ఉగ్రవాదులుగా శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్లిపోయారు. వేలాది యాజిదీ స్త్రీలు, అమ్మాయిలను పనివాళ్లుగా, లైంగిక బానిసలుగా మార్చేశారు.

అప్పుడే నదియాను కూడా ఉగ్రవాదులు అపహరించారు. కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై ఉగ్రవాదులు సామూహికంగా అత్యాచారాలకు పాల్పడ్డారు. విపరీతంగా కొట్టి హింసించారు. ఉగ్రవాదులు యాజిదీ మహిళలను, బాలికలను మార్కెట్లో అమ్మేసేవారు. వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి పెళ్లిళ్లు చేసుకునేవారు. సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయిల చేత బలవంతంగా మేకప్‌ వేయించి, బిగుతైన బట్టలు వేయించి జిహాదీలు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉగ్రవాదుల చెరలో ఉన్న నదియా ఓ ముస్లిం కుటుంబం సాయంతో మోసుల్‌ నగరం నుంచి తప్పించుకుని బయటపడింది. నకిలీ పత్రాలతో వేల కిలోమీటర్లు ప్రయాణించి యాజిదీలు ఉండే సహాయక శిబిరాలకు చేరుకుంది. అప్పటికే తన తల్లి, ఆరుగురు సోదరులు చనిపోయారని తెలుసుకుంది. దుఃఖాన్ని దిగమింగుకుని జర్మనీలో తన సోదరి ఉంటుందని తెలుసుకుని ఓ సంస్థ సహాయంతో అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె జర్మనీలోనే ఉంటోంది.

అప్పటి నుంచి నదియా తన జీవితాన్ని.. నరక కూపంలో మగ్గుతున్న యాజిదీ మహిళలను కాపాడడానికే అంకితం చేసింది. కనిపించకుండా పోయిన దాదాపు 3వేల మంది యాజిదీల ఆచూకీ కోసం ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. తనపై జరిగిన అకృత్యాల గురించి, యాజిదీ మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి నదియా 2015లో ఐరాస భద్రతా మండలిలో మాట్లాడుతూ కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ఐరాస నదియాను గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించింది. నదియా జీవితాన్ని తెలియజేస్తూ 2017లో ‘ది లాస్ట్‌ గర్ల్‌’ అనే పుస్తకం విడుదలైంది. లైంగిక హింసను అరికట్టేందుకు ఆమె చేస్తున్న కృషికి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు