Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

నెటిజనులారా.. ఊపిరి పీల్చుకోండి!

వీణతో శంకర్‌ మహదేవన్‌ పాటను మీటి ఫిదా చేసిన వీణా శ్రీవాణి

నెటిజనులారా.. ఊపిరి పీల్చుకోండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: సప్త స్వరాలు ఏడే కావచ్చు.. కానీ వాటికున్న శక్తి అనంతమైనది. సరిగమలతో ప్రతి ఒక్కరి మనసు పరవశిస్తుంది.. తనువు పులకరిస్తుంది. కొన్ని పాటలు మనపై చెరగని ముద్రవేస్తాయి. స్మృతిపథంలో నిలిచిపోతాయి. అవి ఎంత చిన్నగా వినపడినా మన పెదవి పదం కదులుతుంది.. పాదం దానికి జతకడుతుంది. అలాంటి పాటల్లో శంకర్‌ మహదేవన్‌ బ్రీత్‌లెస్‌ ఆల్బమ్‌ ఒకటి. 1998 విడుదలైన ఈ ఆల్బమ్‌ ఎందరో సంగీత ప్రియుల మనసు దోచింది. ఆ మహా గాయకుడికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ఆ ఆల్బమ్‌లోని ఓ పాటను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వీణ విద్వాంసురాలు శ్రీవాణి అద్భుతంగా వాయించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. శంకర్‌ మహదేవన్‌ పాట ఎంత శ్రావ్యంగా అలుపు లేకుండా సాగిందో.. అదే స్థాయిలో శ్రీవాణి వీణను మీటుతూ స్వరఝరిని ప్రవహింప చేశారు. ఎక్కడా తడబడకుండా పాట ఏ స్థాయిలో సాగిందో అదే స్థాయిలో ఆమె వీణను వాయించిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ జాబితాలో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కూడా చేరిపోయారు.

ఆమె వీణ వాయిస్తున్న వీడియోను పంచుకున్న ఆయన ‘వీణా శ్రీవాణి సంగీత ప్రదర్శనతో ఈ వారం ముగిసింది. పాటకు అనుగుణంగా వీణపై నీ చేతివాళ్లు చేసిన నాట్యం అద్భుతం. వాటి కదలికలు చూస్తూ నేను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాను’ అంటూ ఆమె వీడియోను పంచుకున్నారు. కేవలం ఆనంద్‌ మహీంద్రానే కాదు, ట్విటర్‌ వేదికగా ఆమె వీడియోను వీక్షించిన వారు సైతం ఆమె వీణా నాదానికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు