close

వార్తలు / కథనాలు

ఐదు రోజుల దీపావళి.. ఒక్కోరోజు ఇలా..

ఐదు రోజుల దీపావళి.. ఒక్కోరోజు ఇలా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెలుగు దివ్వెల పండుగ దీపావళి . ఈ వేడుకను దేశ ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటున్నారు. టపాసులు పేల్చి సందడి చేస్తున్నారు. దీపావళిని పండుగను ఏటా ఆశ్వయుజ మాసాంతంలో వచ్చే అమావాస్యనాడు చేసుకుంటాం. దీన్ని అయిదు రోజుల పాటు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమావాస్యతో పాటు, ముందు, వెనక రెండు రోజులూ దీపావళి పర్వదినోత్సవంలో భాగాలే. ఆ అయిదు రోజుల్లో చేసుకునే వేడుకలన్నిట్లో అర్థం, పరమార్థం కనిపిస్తాయి. మానవ జీవితం మంగళకరం కావాలని, లోకానికి శ్రేయోదాయకంగా మారాలని ఇవి సూచిస్తాయి. ఐదు రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం.

1వ రోజు: అమావాస్యకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని చేసుకుంటారు. ధన్‌తేరస్‌ అని పిలిచే ఈ పండగనాడు దీపాలు వెలిగించి, లక్ష్మీ దేవిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు సంపద వృద్ధి చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతలు భువికి దిగివచ్చే రోజుగా కూడా భావిస్తారు కాబట్టి వారికి దారి చూపేందుకు ఆ పవిత్ర దినాన ఇంటిముందు దీపాలు వెలిగించడం ఓ సంప్రదాయమైంది.

2వ రోజు: లోకకంటకుడైన నరకాసురుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు సత్యభామతో పాటు యుద్ధరంగానికి వెళ్లాడు. ఆమె సహకారంతో రాక్షస వధ చేశాడు. ఆ రోజు నరక చతుర్దశిగా నిలిచిపోయింది.

3వ రోజు: అమావాస్యనాడు వచ్చే దీపావళి పండగ రోజు ఇంటింటా దీపాలు వెలుగుతాయి. నరకాసుర వధకు సంతోషంగా టపాసులు కాల్చుతారు. వ్యాపార సముదాయాలు, నివాస గృహాల్లోకి లక్ష్మీ దేవి అడుగు పెడుతుందని నమ్మే ప్రజలు రాత్రి వేళల్లో ఆమె రాక కోసం తలుపులు తెరిచి ఉంచుతారు.

4వ రోజు దీపావళి తరువాత రోజు బలిపాడ్యమి. ఆ రోజు మహా విష్ణువు వామనావతారం ధరించాడని, బలి చక్రవర్తి అహంకారం అణచాడని నమ్ముతారు. అంతేకాకుండా ఆ రోజే బలికి పాతాళ లోకపు ఆధిపత్యం కూడా లభించింది. అందుకే బలిపాడ్యమిని పర్వదినంగా చేసుకుంటారు.

5వ రోజు చివరి రోజు: యమద్వితీయగా నిర్వహిస్తారు. ఆరోజు సోదరి చేతి వంట తిని, ఆమెకు కానుకలివ్వడం ఆనవాయితీ.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు