close

వార్తలు / కథనాలు

నీవే మహాత్ముడివి..

రాజును కొనియాడిన గాంధీ

నీవే మహాత్ముడివి..

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: బ్రిటీషువారి పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహమనే ఆయుధంతో అలుపెరుగని పోరాటం చేసిన గాంధీని దేశ ప్రజలు మహాత్ముడిగా ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే గాంధీ సైతం ఒక యువరాజును నీవే నిజమైన మహాత్ముడివి అని కొనియాడటం విశేషం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
 
1924... కేరళలోని వైఖోమ్‌ ఆలయంలోకి దళితులకు ప్రవేశాన్ని కల్పించాలన్న డిమాండ్‌తో టీకే మాధవన్‌, కేపీ కేశవమీనన్‌, శ్రీ నారాయణగురు.. తదితరుల ఆధ్వర్యంలో సత్యాగ్రహం నిర్వహించారు. ద్రవిడ నేత ఈవీ రామస్వామి పెరియర్‌ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. దళితులకు ఆలయ ప్రవేశంతో పాటు ఆలయానికి చుట్టూ ఉన్న వీధుల్లోకి ఇతరుల ప్రవేశానికి అనుమతి ఇవ్వాలంటూ భారీగా సత్యాగ్రహ ఆందోళ కార్యక్రమం జరిగింది. మహాత్మాగాంధీ కేరళకు వచ్చి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.
 
చిన్న వయసులోనే పెద్ద నిర్ణయం
అప్పట్లో ఈ ప్రాంతం ట్రావెన్‌కోర్‌ ‌రాజుల పాలనలో ఉండేది. యువరాజు తిరుణాల్‌ బలరామ వర్మకు అప్పటికి కేవలం 12 సంవత్సరాల వయసు. యువరాజు తరఫున బంధువైన సేతు లక్ష్మీబాయి పాలనా వ్యవహారాలు నిర్వహిస్తుండేవారు. పాలనా పగ్గాలు ఆమె చేతుల్లోనే ఉండేవి. ట్రావెన్‌కోర్‌ ‌పర్యటనకు వచ్చిన గాంధీ ఆమెతో సమావేశం అనంతరం యువరాజును ఆయన ఈ విధంగా ప్రశ్నించాడు. ‘‘ నీవు రాజుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దళితులకు ఆలయాల్లో ప్రవేశం కల్పిస్తావా?’’ అని అడిగారు. ‘‘తప్పకుండా’’ అంటూ ఎలాంటి తడబాటు లేకుండా యువరాజు బదులిచ్చాడు. అనంతరం రాజ్యపాలనలోకి వచ్చిన బలరామవర్మ 1936లో ట్రావెన్‌కోర్‌ సంస్థానంలోని దళితులందరికీ ఆలయప్రవేశం కల్పిస్తూ శాసనం చేశారు. భారత దేశ చరిత్రలో సాంఘిక సంస్కరణల పథంలో ఇది నూతన అధ్యాయమని చెప్పవచ్చు.
 
గాంధీ లేఖ..
యువరాజు తీసుకున్న సంస్కరణలపై అభ్యుదయవాదుల నుంచి ప్రశంసలు లభించాయి. రాజుకు గాంధీ లేఖ రాశారు.‘‘ప్రజలు నన్ను మహాత్ముడిగా పిలుస్తారు. అయితే నా దృష్టిలో మాత్రం మహాత్ముడంటే నీవే. వేలాది ఏళ్లుగా కొనసాగుతున్న దురాచారాలను నిర్మూలించి ఆలయ ద్వారాలను అందరికీ తెరిపించావు. ఈ గొప్ప పనిని భవిష్యత్తు తరాలు గుర్తించుకుంటాయి. నీవు చూపించిన దారిలో ఇతర హిందూ రాజులు నడుస్తారని ఆశిస్తున్నాను’’ అని లేఖలో ప్రశంసించారు.
 
సంస్కరణల యుగం..
చిత్తిర తిరుణాల్‌ తన పాలనలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. అందులో సంస్థానంలో ఉభయ సభలను ఏర్పాటు చేయడం ముఖ్యమైనది. 1937లో ట్రావెన్‌కోర్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ప్రస్తుతం దీనిని కేరళ విశ్వవిద్యాలయంగా వ్యవహరిస్తున్నారు. అనేక పరిశ్రమలను నెలకొల్పడంతో పాటు కళలు, సాహిత్యానికి విశిష్టస్థానం కల్పించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.