Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

సాహస సుహాయ్‌..

కరాచీలో ముష్కరుల ఆటకట్టించిన మహిళా పోలీస్‌

సాహస సుహాయ్‌..

శుక్రవారం ఉదయం 9.30గంటల సమయం.. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో గల చైనా రాయబార కార్యాలయం రోజువారీ పనుల్లో నిమగ్నమైంది. సరిగ్గా అదే సమయంలో కొందరు దుండగులు తుపాకులు, గ్రనేడ్లు, మారణాయుధాలతో కార్యాలయం వైపు దూసుకొస్తున్నారు. వారు ఉగ్రవాదులు అని తెలుసుకోవడానికి అక్కడి సిబ్బందికి ఎంతో సమయం పట్టలేదు. క్షణాల్లోనే ఆ ముష్కరులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అలాంటి భయానక వాతావరణంలో ఉగ్రవాదులకు ఎదురొడ్డి నిలిచిందో మహిళా పోలీసు. వారు కార్యాలయంలోకి రాకుండా అడ్డుకుని ముష్కరుల ఆటకట్టించింది. ఒకప్పుడు బంధువుల నుంచి బహిష్కరణకు గురైన ఆమె.. నేడు ఎంతోమంది సిబ్బంది, పౌరుల ప్రాణాలను కాపాడింది. ఆమే సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోలీసు సుహాయ్‌ అజీజ్‌ తల్పూర్‌.

నేడు కరాచీలో జరిగిన ఉగ్రదాడికి అడ్డుకునేందుకు చేపట్టిన భద్రతా ఆపరేషన్‌కు సుహాయ్‌ నాయకత్వం వహించారు. ఉగ్రవాదుల చర్యతో అప్రమత్తమైన సుహాయ్‌ వెంటనే రంగంలోకి దిగారు. ముష్కరులు లోపలికి రాకుండా నిలువరించాలని పోలీసులను అప్రమత్తం చేశారు. సుహాయ్‌ ఆదేశాలతో ఉగ్రవాదులు గేటు దగ్గరకు రాగానే పోలీసులు కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అలా వారి కుట్రను భగ్నం చేశారు.

బంధువులు దూరం పెట్టారు..
ఉగ్రవాదులను అడ్డుకోవడంలో ఎంతో తెగువను ప్రదర్శించిన సుహాయ్‌ చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెది దిగువ మధ్యతరగతి కుటుంబం. సింధ్‌ ప్రావిన్స్‌లోని టాండో మహ్మద్‌ ఖాన్‌ జిల్లా భాయ్‌ ఖాన్‌ తల్పూర్‌ గ్రామంలో పుట్టారు. తండ్రి అజీజ్‌ తల్పూర్‌ రాజకీయ కార్యకర్త. రచయిత కూడా. కుమార్తెను గొప్ప స్థాయిలో చూడాలనే ఆశతో ఆమెను స్కూల్లో చేర్పించారు. అయితే అది వారి కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది.

సుహాయ్‌ను ప్రయివేటు స్కూల్లో చేర్పించినందుకు ఆమె బంధువులు ఎన్నో మాటలు అన్నారు. ఆడపిల్లకు చదువెందుకు అని హేళన చేశారు. వారి కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రామంలో ఉండలేక సుహాయ్‌ కుటుంబం సమీపంలోని పట్టణానికి వెళ్లిపోయింది. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సుహాయ్‌ కూడా చదువులో ముందంజలో ఉన్నారు. హైదరాబాద్‌లోని జుబేదా మహిళల కళాశాల నుంచి బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అవ్వాలని అనుకున్నారు. అయితే సామాజిక సేవ మీద మక్కువతో 2013లో సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ పరీక్ష రాశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి పోలీస్‌ రంగంలో అడుగుపెట్టారు. కుటుంబసభ్యుల అండతోనే తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానని సుహాయ్‌ ఆనందంగా చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు