close

వార్తలు / కథనాలు

వయసు ఏడేళ్లు.. సంపాదన రూ.150కోట్లు!

వయసు ఏడేళ్లు.. సంపాదన రూ.150కోట్లు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ బుడతడి వయసు ఏడేళ్లే.. కానీ అతడి సంపాదన వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. యూట్యూబ్‌ స్టార్స్‌ అందరి కంటే అత్యధికంగా సంపాదిస్తూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. అతడే అమెరికాకు చెందిన రేయాన్‌. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూట్‌ స్టార్స్‌ 2018కి చెందిన పది మందితో కూడిన జాబితాను అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ మంగళవారం ప్రకటించింది. ఇందులో సుమారు రూ.154కోట్ల వార్షిక ఆదాయంతో ఏడేళ్ల రియాన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాది ఇదే జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్న అతడు ఇప్పుడు అందరినీ వెనక్కి నెట్టేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

రేయాన్‌కు యూట్యూబ్‌లో ‘రేయాన్‌ టాయ్స్‌ రివ్యూ’ పేరిట ఛానల్‌ ఉంది. ఇంతకీ అతడి పనేంటి అనుకుంటున్నారా? బొమ్మలతో ఆడుకోవడమే. రకరకాల బొమ్మలతో చక్కగా ఆడుకుంటూ వాటి పనితీరు గురించి తన ముద్దులొలికే మాటలతో రివ్యూ ఇస్తాడు. అలా ఛానల్‌ ద్వారా 2018 ఏడాదిలో రేయాన్‌ 22 మిలియన్‌ డాలర్లు సంపాదించాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.154.84కోట్లు. గతేడాదితో పోల్చుకుంటే అతడి వార్షిక ఆదాయం ఈ ఏడాది రెట్టింపు అయ్యింది. ఇద్దరు వ్యక్తులు ఈ ఏడాది జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మేకప్‌ ఆర్టిస్ట్‌గా వీడియోలు చేసే జెఫ్రెరీ స్టార్‌, జాక్సపెక్టికై మినహా మిగతా ఎనిమిది మంది ఫోర్బ్స్‌ 2017లో అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూబ్‌ స్టార్స్ జాబితాలో ఉన్నవారే.

జాబితాలోని పది మంది యూట్యూబ్‌ స్టార్స్‌..

* రేయాన్‌ టాయ్స్‌ రివ్యూ- 22 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.154.84కోట్లు)

* జాక్‌ పాల్‌- 21.5 మిలియన్‌ డాలర్లు( రూ.151.32కోట్లు)‌

* డ్యూడ్‌ పర్‌ఫెక్ట్‌- 20 మిలియన్‌ డాలర్లు(రూ.140.74కోట్లు)

* డాన్‌టీడీఎం -18.5 మిలియన్‌ డాలర్లు(రూ.130.21కోట్లు)

* జెఫ్రెరీ స్టార్‌- 18మిలియన్‌ డాలర్లు( రూ.126.67కోట్లు)

* మార్క్‌పైలిర్‌- 17.5 మిలియన్‌ డాలర్లు(రూ.123.15కోట్లు)

* వనోస్‌ గేమింగ్‌- 17 మిలియన్‌ డాలర్లు(రూ.119.63కోట్లు)

* జాక్సపెక్టికై- 16 మిలియన్‌ డాలర్లు(రూ.112.61కోట్లు)

* ప్యూడైపై- 15.5మిలియన్‌ డాలర్లు(రూ.109కోట్లు)

* లోగన్‌ పాల్‌- 14.5మిలియన్‌ డాలర్లు(రూ. 102కోట్లు)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు