Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

టీమిండియాను మార్చేసిన ఆ నిర్ణయం..!

ఇంటర్నెట్‌డెస్క్‌:  ‘‘నాకు ఏదైతే భయమో ముందు అది చేసేయటం అలవాటు’’ ఇది పోకిరి సినిమాలో బాగా పాపులర్‌ అయిన డైలాగ్‌. కొన్నేళ్లుగా భారత క్రికెట్‌ జట్టు కూడా ఇదే ఫాలో అవుతున్నట్లుంది. అందుకే ఛాంపియన్‌గా మారింది. అది ఎలాగో తెలుసుకోండి..

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ పిచ్‌లపై భారత్‌ సిరీస్‌ గెలవడం అసంభవం. సిరీస్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు గెలిచినా గొప్పే.  ఉపఖండంపై ఉండే మందకొడి పిచ్‌లపై మాత్రమే భారత్‌ చెలరేగిపోతుందనే అపవాదు ఉంది. దీనికి తోడు హోంటైగర్స్‌ అనే పేరొకటి. ఇది పొగడ్తో.. విమర్శో అర్థం కాదు... కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితిలో మెల్లగా మార్పు చోటు చేసుకొంది. ఒకప్పుడు హోం టైగర్స్‌గా పేరున్న భారత జట్టు ఇప్పుడు దుర్భేద్యంగా తయారైంది. ఒకప్పుడు భారత్‌ అంటే స్పిన్నర్లు మాత్రమే ఉంటారనే అపవాదు ఉండేది.. కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయి నాణ్యమైన పేస్‌ బౌలర్లను తయారు చేస్తోంది. దీని వెనుక భారత క్రికెట్‌ పునాదుల్నే మార్చేలా దేశీయ పిచ్‌లపై మరింత  పచ్చిక పెంచాలని బీసీసీఐ తీసుకొన్న ఒక కీలక నిర్ణయం దోహదపడింది.  

2014 వరకు  అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ప్రదర్శన నిలకడగాలేదు. విదేశాల్లోని పచ్చటి మైదానాలపై దూసుకొచ్చే బంతులను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక భారత బ్యాట్స్‌మన్‌ తడబడే వారు. ఈ విషయం బాగా తెలిసిన బీసీసీఐ భారత క్రికెట్‌ జట్టును దుర్భేద్యంగా మార్చాలంటే ఉన్న లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించింది. సీమర్లకు అనుకూలించే పిచ్‌లపై భారత్‌ రికార్డు ఏమాత్రం బాగోలేదని గుర్తించింది. దీంతో క్రీడాకారులకు బౌలింగ్‌ పిచ్‌లను అలవాటు చేయాలని నిర్ణయించింది. బీసీసీఐ పరిధిలోని మైదానాల్లోని పిచ్‌లపై కచ్చితంగా నిర్ణీత ప్రమాణాల మేరకు పచ్చిక పెంచాలని క్యూరేటర్లను ఆదేశించింది. పరిస్థితులను బట్టి పిచ్‌లపై కనీసం 5 మిల్లీ మీటర్ల నుంచి 8 మిల్లీ మీటర్ల వరకు గడ్డి కచ్చితంగా ఉండాలని పేర్కొంది. దీంతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో కనిపించేటటువంటి పచ్చికతో కూడిన ట్రాక్‌లు భారత్‌లో కూడా దర్శనమివ్వడం మొదలైంది. ఇప్పటికే ఉన్న స్పిన్‌ పిచ్‌లకు ఇవి కూడా తోడవ్వడంతో వైవిధ్యభరితమైన బంతులను ఎదుర్కొనే అవకాశం భారత యువ క్రికెట్లరకు లభించింది. పిచ్‌ల తయారీలో క్యూరేటర్లకు ప్రత్యేక్ష శిక్షణ కూడా ఇప్పించారు. మట్టిపై పరిశోధనలు చేసి డాక్టరేట్లు పొందిన వారితో క్యూరేటర్లకు అవగాహన కల్పించారు. మ్యాచ్‌ ఫార్మాట్‌ను బట్టి మట్టిని సిద్దం చేసి  పిచ్‌ను తయారు చేయడాన్ని నేర్పించారు.  దీంతోపాటు జోనల్‌ క్యూరేటర్లు, అసిస్టెంట్‌ జోనల్‌ క్యూరేటర్లు పిచ్‌ క్యూరేటర్‌తో తరచూ సంప్రదింపులు జరిపి సూచనలు సలహాలు అందజేస్తున్నారు. ఐదురోజుల మ్యాచ్‌ల ఫలితాలు తేలేలా సజీవమైన పిచ్‌లు అందుబాటులోకి వచ్చాయి.

ఫలితంగా దేశవాళీ టోర్నీల్లో మెల్లగా సీమర్ల ఆధిపత్యం మొదలైంది. కొన్నేళ్లుగా స్పిన్నర్లతో పోలిస్తే సీమర్లే మెరుగైన సగటులు నమోదు చేస్తున్నారు. దీనికి తోడు బ్యాట్స్‌మెన్లు కూడా దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడానికి అలవాటుపడ్డారు. దాదాపు 37 దేశవాళీ జట్లు ఉన్న భారత్‌కు ఈ పిచ్‌లు బాగా ఉపయోగపడ్డాయి. ఫలితంగా బుమ్రా, షమీ, భువి, పాండ్యా వంటి స్టార్లు తెరపైకి వచ్చారు. అంతేకాదు విదేశీగడ్డపై భారత బ్యాట్స్‌మెన్లు పరుగుల వరదను పారిస్తున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు భారత్‌ మొత్తం 16 టెస్టు సిరీస్‌లు ఆడితే వీటిల్లో 12 సిరీస్‌లను కైవసం చేసుకోగా.. ఒక సిరీస్‌ ఫలితం తేల్లేదు. మరో మూడు సిరీస్‌లను ఓడిపోయింది. 2015లో 2-0 తేడాతో ఆస్ట్రేలియాలో సిరీస్‌ కోల్పోయిన భారత్‌ 2018-19లో మాత్రం 2-1 తేడాతో సిరీస్‌ గెలుచుకొంది. ఇక న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌లో  ఆతిథ్య జట్టుకు చుక్కులు చూపిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇది మన భారత జట్టు దూకుడుకు మూలకారణం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు