Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

... అనుమానాస్పద బౌలింగ్‌?

హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో నిప్పులు చెరిగే బంతులు విసిరిన బౌలర్లు ఎందరో ఉన్నారు. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెట్టిన స్పిన్నర్లు మనకు తెలుసు. మళ్లీ మళ్లీ అలాంటి వారి బౌలింగ్‌ను చూడాలని తహతహలాడుతుంటాం. మణికట్టు మాంత్రికులు, మిస్టరీ స్పిన్నర్లను మనం గమనిస్తున్నాం. వీరిలో అప్పుడుప్పుడు అనుమానాస్పద బౌలింగ్‌ శైలితో ఎప్పుడూ చర్చల్లో నలిగేవారు కొందరున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేసేందుకు కొన్ని నిర్దేశిత ప్రమాణాలు, నిబంధనలు ఉన్నాయి. అందరూ వీటిని కచ్చితంగా పాటించాల్సిందే. ఐసీసీ ప్రమాణాల ప్రకారం బౌలింగ్‌ చేసేటప్పుడు బంతి విసిరే మోచేతి 15 డిగ్రీల కన్నా ఎక్కువ వంచరాదు. అలా చేస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుతుంది. అంపైర్లు, ఆటగాళ్లు ఎవరైనా ఇలాంటి వారిపై ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడా బౌలర్లు నిర్దేశిత గడువులోపు ఐసీసీ అధునాతన పరీక్ష కేంద్రంలో తమ బౌలింగ్‌ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. లేని పక్షంలో నిషేధం విధిస్తారు. తిరిగి బౌలింగ్‌ యాక్షన్‌ మార్చుకొని మళ్లీ పరీక్షకు వెళ్లి జట్టులోకి రావొచ్చు. గతంలో మోచేతి వంపు 5 డిగ్రీలే ఉండేది. తమ కెరీర్‌ను నాశనం చేస్తున్నారని చాలామంది బౌలర్లు ఫిర్యాదులు చేయడంతో  ఐసీసీ ఈ మోచేతి వంపును 15 డిగ్రీలకు పెంచింది.

ఈ మధ్యే టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు బౌలింగ్‌ యాక్షన్‌పై సందేహం తలెత్తింది. ఐసీసీ ఇచ్చిన 14 రోజుల గడువులోగా అతడు బౌలింగ్‌ పరీక్షకు వెళ్లలేదు. దీంతో ఇకపై అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేసేందుకు వీలుండదు. అనుమానాస్పద బౌలింగ్‌ శైలితో నిషేధానికి గురై ఐసీసీ నిర్వహించే పరీక్షకు వెళ్లిన బౌలర్లు ఎందరో ఉన్నారు. రాయుడి బౌలింగ్‌ యాక్షన్‌ నేపథ్యంలో అనుమానాస్పద బౌలర్ల గురించి తెలుసుకుందామా!

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)‌

అంతర్జాతీయ క్రికెట్‌లో ముత్తయ్య మురళీధరన్‌ అంటే ఎవరో తెలియని క్రికెట్‌ అభిమాని ఉండడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌ అతడు. 1995లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ముత్తయ్య వేసిన మూడు ఓవర్లలో అంపైర్‌ డారెల్‌ హెయిర్‌ ఏడు నోబాల్స్‌ ఇచ్చాడు. ఇదేమిటంటే అనుమానాస్పద బౌలింగ్‌ కారణమన్నాడు. దాంతో శ్రీలంక సారథి అర్జున రణతుంగ సహా ఆటగాళ్లంతా మైదానంలోనే నిరసన వ్యక్తం చేశారు. అయితే 1996, 1999లో తన బౌలింగ్‌ యాక్షన్‌ను పరీక్షించుకొని తిరిగి ఆటలోకి వచ్చాడు. 2004లో దూస్రా బంతి మాత్రం అనుమానాస్పదంగా తేల్చారు.

సచిత్ర సేననాయకె (శ్రీలంక)

సచిత్ర శ్రీలంక ఆల్‌రౌండర్‌. ఆఫ్‌స్పిన్‌ వేస్తాడు. 2014 జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో నాలుగు బంతులు నిబంధనల ప్రకారం వేయలేదు. 15 డిగ్రీల నిబంధనను అతిక్రమించాడు. వెంటనే అతడిపై నిషేధం విధించారు. 2014 డిసెంబర్‌లో తిరిగి జట్టులోకి వచ్చాడు.

షేన్‌ షిల్లింగ్‌ఫోర్డ్‌ (వెస్టిండీస్‌)

ఇతడు 2010 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే అతడి బౌలింగ్‌ అనుమానాస్పదంగా ఉందని అంపైర్లు అసద్‌ రవూఫ్‌‌, రిచర్డ్‌ కెటిల్‌ బరో, స్టీవ్‌ డేవిడ్‌ గుర్తించారు. అతడి మోచేతి 17 డిగ్రీలు వంగుతోందని గమనించారు. 2010 డిసెంబర్‌లో నిషేధం విధించగా తిరిగి 2011 జూన్‌లో జట్టులోకి పునరాగమనం చేశాడు.

సునిల్‌ నరైన్ (వెస్టిండీస్‌)

మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన సునిల్‌ నరైన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సంచలనం. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహులే ఇబ్బందిపడ్డారు. తన రహస్య సామర్థ్యంతో అనతి కాలంలోనే నరైన్‌ టీ20 క్రికెట్‌లో నంబర్‌వన్‌ బౌలర్‌గా అవతరించాడు. కెరీర్‌లో అత్యున్నత స్థితిలో ఉనప్పుడే అతడిపై వేటు పడింది. 2014 టీ20 ఛాంపియన్‌ లీగ్స్‌లో అనుమానాస్పద బౌలింగ్‌తో రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. దాంతో 2015 వన్డే ప్రపంచకప్‌ నుంచి స్వయంగా తప్పుకున్నాడు. ఏడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. మళ్లీ 2016 టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పుకొని మారిన బౌలింగ్‌ శైలితో జట్టులోకి వచ్చాడు. అయితే తనలోని మునుపటి మ్యాజిక్‌ మాత్రం మాయమైంది.

మార్లోన్‌ శామ్యూల్స్‌ (వెస్టిండీస్‌)

విండీస్‌ ఆల్‌రౌండర్‌ శామ్యూల్స్‌పై చాలా వివాదాలు ఉన్నాయి. 2008లో అనుమానాస్పద బౌలింగ్‌తో నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. తిరిగి 2010లో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత మూడేళ్ల పాటు బౌలింగ్‌ చేయలేదు.

అబ్దుర్‌ రజాక్‌ (బంగ్లాదేశ్‌)

ఈ పొడగరి స్పిన్నర్‌ది ఎడమచేతి వాటం. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌ జట్టు 2008లో బంగ్లాదేశ్‌లోపర్యటించింది. అంపైర్లు హార్పర్‌, అశోక డిసిల్వా అతడి బౌలింగ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బౌలింగ్‌ యాక్షన్‌ క్లియర్‌ చేసుకొని 2009లో పునరాగమనం చేశాడు.

జోహన్‌ బోథ (దక్షిణాఫ్రికా)

భోథ ఆఫ్‌స్పిన్నర్‌. 2006లో సఫారీ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ సిరీస్‌లో బోథ వేసిన కొన్ని బంతులు 15 డిగ్రీల నిబంధనలకు అనుగుణం లేవని సస్పెండ్‌ చేశారు. బౌలింగ్‌ యాక్షన్‌ను మార్చుకొని అదే ఏడాది నవంబర్‌లో జట్టులోకొచ్చాడు. 2009 ఏప్రిల్‌లో మళ్లీ నిషేధం ఎదుర్కొన్నాడు.

సయీద్‌ అజ్మల్‌ (పాకిస్థాన్‌)

ఈ పాకిస్థానీ కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్‌ తన మోచేతిని 42-44 డిగ్రీలు వంచుతున్నాడని ఐసీసీ పరీక్షలో తేలడంతో నిషేధం విధించారు.

షబ్బీర్‌ అహ్మద్‌ ఖాన్‌ (పాకిస్థాన్‌)‌

ఈ పాక్‌ బౌలర్‌ పేసర్‌. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో ఆడుతూ 2005 డిసెంబర్‌లో నిషేధానికి గురయ్యాడు. దాదాపు 12 నెలల తర్వాత జట్టులోకి వచ్చాడు. అంతకు ముందూ 1999లోనూ నిషేధం పడింది. మళ్లీ ఏడాది తర్వాత జట్టులోకి వచ్చినా టెస్టు క్రికెట్‌ ఆడలేదు. దేశవాళీకి పరిమితమయ్యాడు.

ఇక కుమార ధర్మసేన (శ్రీలంక), మహ్మద్‌ హఫీజ్‌ (పాక్‌), జెర్మైన్‌ లాసన్‌ (విండీస్‌), బ్రెట్‌లీ (ఆస్ట్రేలియా), షోయబ్‌ మాలిక్‌ (పాక్‌) హర్భజన్‌ సింగ్‌ (భారత్‌), షమింద ఎరంగ (శ్రీలంక)పై అనుమానం వచ్చిన నిషేధం విధించలేదు. వెంటనే వారి బౌలింగ్‌ యాక్షన్‌ను క్లియర్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు