close

వార్తలు / కథనాలు

‘బంగారు’ దేశాలివి!

అత్యధికంగా ఎక్కడంటే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడవాళ్లకూ, బంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ప్రత్యేకించి భారతీయ స్త్రీలకైతే మరీనూ. పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టిన రోజులు, పండగలు ఇలా ఏది జరిగినా మహిళలు ముందుగా ఆలోచించేది బంగారం గురించే. ఇక అమ్మాయిలయితే నలుగురిలో ‘పుత్తడి’ బొమ్మల్లా మెరిసిపోవాలని కలలు కంటుంటారు. ఎందుకంటే మన భారతీయ సంప్రదాయపు పెళ్లిళ్లలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అందుకే పుత్తడి వినియోగదారుల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. మరి అంతలా బంగారాన్ని ఉపయోగించుకునే భారత్‌లో రిజ్వర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారం చాలా తక్కువ. మిగతా దేశాల్లోని సెంట్రల్‌ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం రిజర్వు నిల్వలతో పోలిస్తే మన దేశం అట్టడుగున ఉంది. వీటి గురించి ఆసక్తికరమైన విషయాలున్నాయి. మరి అవెంటో తెలుసుకుందాం!

* అగ్రరాజ్యంలో బంగారానికి అగ్రతాంబూలం..

అమెరికన్లంటే ఆధునికంగా ఉంటారు. మనలాగా పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు పెట్టుకోరు అనుకుంటున్నారేమో! వాళ్ల అసలు రూపం వేరే ఉంది. భారతీయ ప్రజల్లాగా వాళ్లు ఒంటిపై ధరించకపోచ్చు. కానీ అక్కడి ఫెడరల్‌ బ్యాంకులో బోలెడంత బంగారం ఉందట. బంగారం నిల్వ ఉంచుకున్న బ్యాంకుల్లో దీనిదే అగ్రస్థానం. ఇక్కడ ఏకంగా 8,100 మెట్రిక్‌ టన్నుల బంగారం అక్కడుంది. ఆ బ్యాంకు లెక్కల ప్రకారం ఈ మొత్తం బంగారం మార్కెట్‌ విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు.

* జర్మనీది రెండో స్థానం...

నిజమే! బంగారం నిల్వల్లో జర్మనీ రెండో స్థానంలో ఉంది. 3,370 మెట్రిక్‌ టన్నుల పుత్తడి అక్కడి సెంట్రల్‌ బ్యాంకు సొంతం. తొలుత ఇక్కడ 3,410 మెట్రిక్‌ టన్నులు బంగారం ఉండేది. కానీ కొన్ని కారణాల 40 మెట్రిక్‌ టన్నులు తగ్గి ప్రస్తుత సంఖ్యకు చేరుకుంది. అయినప్పటికీ బంగారం నిల్వ చేసే దేశాల్లో ఒకప్పుడు మూడో స్థానంలో జర్మనీ..ఇప్పుడు రెండోస్థానానికి చేరుకుంది.

* మూడు, నాలుగు స్థానాల్లో..!

అత్యధికంగా పుత్తడిని కలిగిన దేశాల్లో ఇటలీ మూడో స్థానంలో ఉంది. ఇక్కడి కేంద్ర బ్యాంకులో ఉన్న బంగారం 2,450 మెట్రిక్‌ టన్నులు. తొలుత ఇక్కడ 2,800 మెట్రిక్‌ టన్నుల బంగారం ఉండేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి పేర్కొంది. అయితే వివిధ కారణాల వల్ల అది 2,450 మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న దేశం ఫ్రాన్స్‌. 2,435మెట్రిక్‌ టన్నుల బంగారం ఇక్కడి సెంట్రల్‌ బ్యాంకు సొంతం. 18 ఏళ్ల క్రితం ఇక్కడ 3,025 మెట్రిక్‌ టన్నుల బంగారం ఉండేది. కానీ రాను రాను 20% బంగారాన్ని విక్రయించినట్లు సెంట్రల్‌ బ్యాంకు తెలిపింది.

* ఐదు, ఆరు స్థానాల్లో..!

బంగారం ఎక్కువగా నిల్వ ఉన్న దేశాల్లో రష్యాది ఐదో స్థానం. ఈ దేశానికి చెందిన సెంట్రల్‌ బ్యాంకులో 2,070 మెట్రిక్‌ టన్నుల పుత్తడి నిల్వ ఉంది. అయితే ఐఎంఎఫ్‌ టాప్‌-10 గ్లోబల్‌ ఎకానమీ దేశాల్లో దరిదాపుల్లో లేని రష్యా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉండటం విశేషం. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో తొలి స్థానంలో ఉన్న చైనా ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. చైనాలోని అతి పెద్ద బ్యాంకులో(మనకు రిజర్వు బ్యాంకు మాదిరిగా) దాదాపుగా 1,840 మెట్రిక్‌ టన్నుల బంగారం నిల్వ ఉంది. 18 ఏళ్ల క్రితం ఇక్కడ కేవలం 395 మెట్రిక్‌ టన్నుల బంగారం మాత్రమే ఉండేది.

* ఏడు, ఎనిమిది, తొమ్మిది  స్థానాల్లో..!

ధనవంతులు డబ్బులు దాచుకునే స్విస్‌లో పై దేశాలతో పోలిస్తే బంగారం చాలా తక్కువగా ఉందట.  1,040 మెట్రిక్‌ టన్నుల కనకం ఈ దేశానికి చెందిన సెంట్రల్‌ బ్యాంకులో వివిధ రూపాల్లో నిల్వ ఉందట. టాప్‌-10 ఎకానమీలతో ఒకటైన స్విస్‌లో మాత్రం బంగారం నిల్వ తక్కువగా ఉండటం ఆశ్చర్యపోవాల్సిన విషయమే మరి!.ఈ జాబితాలో జపాన్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక రాజ్యంగా ఉన్న జపాన్‌ సెంట్రల్‌ బ్యాంకులో 765 మెట్రిక్‌ టన్నుల బంగారం మాత్రమే నిల్వ ఉందట. ఇక నెదర్లాండ్స్‌ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక్కడి కేంద్ర బ్యాంకులో దాదాపుగా 610 మెట్రిక్‌ టన్నుల బంగారం నిల్వ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ 910 మెట్రిక్‌ టన్నులు ఉండేది. కొంత బంగారాన్ని అమ్మేయడం, ఇతర కారణాల వల్ల 300 మెట్రిక్‌ టన్నులు తగ్గి 610కి చేరుకుంది. అయితే తర్వాత బంగారం పరిరక్షణకు గానూ ఈ దేశపు రక్షణ శాఖ ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చింది.

పదో స్థానంలో భారత్‌..

మన దేశపు రిజర్వు బ్యాంకులో కేవలం 590 మెట్రిక్‌ టన్నుల బంగారం నిల్వ ఉన్నట్లు లెక్కల్లో తేలింది. జనాభా లెక్కల్లో రెండో స్థానంలో మన దేశం ఈ జాబితాలో చివరన ఉంది. 2000 నుంచి 2009 మధ్య 360 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉండగా..గత దశాబ్ద కాలంలో నిల్వ శాతం కూడా గణనీయంగా పెరిగింది. అయితే వ్యక్తిగత లెక్కలు తీసుకుంటే మన దేశ జనాభా అందరి వద్దా కలిపి 20 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా బంగారం ఉండటం విశేషం. రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారంతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు