Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

బాల్‌ వేస్తే...  వికెట్‌ విరిగిపోవాల్సిందే!

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌కే ఎక్కువ ఆదరణ. నేటి యువ క్రికెటర్లంతా ప్రతి బంతిని బౌండరీకి పంపించేలా ఆడుతున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! వీరికి దీటుగా బౌలర్లూ వచ్చేశారు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్‌కి సవాలు విసురుతున్నారు. వేగంగా దూసుకొస్తున్న బంతుల్లో లెన్త్‌, టైమింగ్‌ని అంచనా వేయలేక బ్యాట్స్‌మెన్‌ తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాలంలో ప్రపంచంలో వేగంగా బంతులు విసిరిన బౌలర్లు ఎవరు... వారు ఏ స్థానాల్లో ఉన్నారో చూద్దాం!

పాక్‌కు కీలకం...

దశాబ్దాలుగా క్రికెట్‌కు అత్యుత్తమ బౌలర్లని అందించిన పాకిస్థాన్ తరపున ఇప్పుడు వాహబ్‌ రియాజ్‌ ఆడుతున్నాడు. రాబోయే ప్రపంచకప్‌లో పాక్‌కు ఇతనే కీలక ఆయుధం. 2015 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో ఆసీస్‌తో పాక్‌ ఓడినా... ప్రపంచంలోనే వేగంగా బంతులు విసిరే బౌలర్ పాక్‌కు దొరికాడు.  ఈ మ్యాచ్‌లో షేన్‌ వాట్సన్‌, వాహబ్‌ రియాజ్‌ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది.  రెండేళ్ల క్రితం  భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో గంటకు 149.6 కి.మీ. వేగంతో వాహబ్‌ వేసిన బంతి అత్యంత వేగవతమైంది.

మరో బ్రెట్‌ లీ

ఆస్ట్రేలియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ కొద్ది తేడాతో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 24 ఏళ్ల  ఈ కుడిచేతి వాటం బౌలర్‌ వన్డేల్లో అవలీలగా, నిలకడగా గంటకు 143 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు.  వేగంలో మాత్రమే కాకుండా, కచ్చితత్వంతో ఆకట్టుకుంటున్నాడు.  బ్రెలీని మరిపిస్తూ, ఆసీస్‌ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నాడు. ఇతను అత్యంత దూకుడుగా వేసిన బంతి వేగం 149.2 కి.మీ/గ. ఇంగ్లండ్‌పై 2017 జూన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ వేగం అందుకున్నాడు. 

 

మిల్స్‌.. మిసైల్స్‌

ఇంగ్లాండ్‌ బౌలర్‌ టైమల్‌ మిల్స్‌ది ఈ జాబితాలో మూడో స్థానం. 2017లో భారత్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో తన స్పెల్‌తో బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బందులకి గురిచేశాడు. ఇంగ్లిష్‌ జట్టులో అతని పేరు ప్రస్తుతం అంతగా వినిపించకపోకయినా... తన పేస్‌తో ప్రత్యర్థి జట్టుకు ముప్పు తిప్పలు పెట్టడంలో దిట్ట. ససెక్స్‌ జట్టు తరపున నిలకడగా రాణిస్తున్న టైమల్‌ మిల్స్‌ వచ్చే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ జట్టు బౌలింగ్‌లో కీలకం. ఇతను అత్యంత వేగంగా వేసిన బంతి వేగం 149 కి.మీ/గ. 2017 ఫిబ్రవరిలో మన జట్టుపైనే ఈ బంతిని విసిరాడు మిల్స్‌. 

మ్యాజిక్‌ మిచెల్‌

వేగంగా బంతులు విసరడంలో మిచెల్‌ స్టార్క్‌ది నాలుగో స్థానం.  బౌలింగ్‌ దిగ్గజాలు బ్రెట్‌ లీ, జాసన్‌ గిలెస్పీలను మరిపించేలా మిచెల్‌ స్టార్క్‌ ఆసీస్‌ జట్టులో రాణిస్తున్నాడు. ప్రత్యర్థులు భయపడేలా బంతులు విసరడంలో స్టార్క్‌ దిట్ట. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరపున ఆడాడు.  ముంబై ఇండియన్స్‌, బెంగుళూరు మధ్య జరిగిన పోరులో విధ్వంసకర కీరన్‌ పొలార్డ్‌, స్టార్క్‌ మధ్య జరిగిన పోరు ఎవరు మరిచిపోతారు? స్టార్క్‌ అత్యంత వేగంగా వేసిన బంతి వేగం 148.5 కి.మీ.

 

విండీస్‌ తురుపుముక్క

ఒకప్పుడు ఫాస్ట్‌ బౌలర్లకు పెట్టనికోట అయిన వెస్టిండీస్‌లో ఆ స్థాయి బౌలర్లు లేరనే వాదన గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. దీనిని పటా పంచలు చేస్తూ షానన్‌ గాబ్రియెల్‌ వచ్చాడు. వేగవంతమైన బౌలర్ల జాబితాలో గాబ్రియెల్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు విసిరిన వేగవంతమైన బంతి 148.2 కిమీ. 2017 మేలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ బంతి వేశాడు. ప్రస్తుతం పేస్‌, వైవిధ్యంగా గాబ్రియెల్‌ నిలకడగా రాణిస్తున్నాడు.

బూం.. బూం బుమ్రా

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున ఆడి... మెరుగైన ప్రదర్శనతో జస్‌ప్రీత్‌ బుమ్రా భారత జట్టులో చోటు సంపాదించాడు. తొలి రోజుల నుంచి రాణిస్తూ తనదైన ముద్ర వేసుకున్న బుమ్రా వేగంలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.  గత కొన్ని సంవత్సరాలుగా బుమ్రా భారత్‌కు విలువైన ఆస్తిగా మారాడు. ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకి పెద్ద సవాలుగా మారాడు. 2017 జూన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా తన కెరీర్‌లోనే అత్యధిక వేగం (148.1 కిమీ) తో బంతి వేశాడు. 

 

కివీస్‌ సంచలనం

న్యూజిలాండ్‌ కీలక బౌలర్లు బౌల్ట్‌, సౌథీ ఫామ్‌లో లేకపోవడంతో జట్టులో ఆడమ్‌ మిల్న్‌ బాధ్యత మరింత పెరిగింది. ప్రస్తుతం జట్టుకి ఎంతో విలువైన ఆటగాడిగా మారాడు.  ఛాంపియన్‌ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో ఆడిన సమయంలో 147కి.మీ వేగంతో బంతుల్ని విసిరాడు.  నిలకడగా రాణిస్తున్న ఈ కివీస్‌ ఆటగాడిది వేగంగా బంతుల్ని విసరడంలో ఏడో స్థానం. మిల్న్‌ అత్యంత వేగంగా విసిరిన బంతి వేగం 147.7 కి.మీ/గంట (బంగ్లాదేశ్‌పై).

ప్లంకెట్‌... హిట్‌

ఇంగ్లాండ్‌ టెస్ట్‌ జట్టులో జిమ్మీ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ నిలకడగా రాణిస్తుండటంతో... లామ్‌ ప్లంకెట్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌తో సరిపెట్టుకుంటున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని బంతులతో విజృంభిస్తున్నాడు. ఇతను 147.3 కి.మీ/గంట వేగంతో బంతులు విసరుతున్నాడు  (దక్షిణాఫ్రికాపై). ప్లంకెట్‌ వేగంగా బంతుల్ని వేయడంలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అండర్సన్‌ టెస్ట్‌ల నుంచి తప్పుకొన్నాక ప్లంకెట్‌ను జట్టులోకి తీసుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

రప్ఫాడిస్తున్న రబాడా

 

22 ఏళ్ల దక్షిణాఫ్రికా బౌలర్‌ కగిసో రబాడా వేగంగా బంతులు విసరడంలో తొమ్మిదో స్థానం. డేల్‌ స్టెయిన్‌ రిటైర్డ్‌ తర్వాత అతని స్థానాన్ని అన్ని ఫార్మాట్‌లలో భర్తీ చేస్తున్నాడు.  2017లో ఇంగ్లాండ్‌ జట్టుతో ఆడకముందు వరకు 137 కి.మీ/గంట వేగంతో బంతుల్ని వేసేవాడు. ఈ సిరీస్‌ నుంచి 147 కి.మీ/గంట  వేగంతో బంతుల్ని విసురుతున్నాడు. అత్యధిక వేగం 147 కి.మీ/గ (ఇంగ్లండ్‌పై).

ఉమేశ్‌ సత్తా

ఉమేశ్‌ యాదవ్‌ భారత జట్టులో అన్ని ఫార్మాట్స్‌లో ఆడుతున్నా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. ఎన్నో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా నిలకడలేమితో ఇబ్బందులు పడుతున్నాడు. వేగంగా బంతుల్ని విసరడంలో పదో స్థానంలో ఉమేశ్‌ కొనసాగుతున్నాడు. ఉమేశ్‌ ఇప్పటి వరకు అత్యధిక వేగంతో వేసిన బంతి వేగం 146.6 కి.మీ/గ (శ్రీలంకపై).

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు