Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

ఈ కేఫ్‌ కునుకు తీసేందుకే..

రాత్రి నిద్ర సరిగా లేకనో, భోజనం తిన్నాకనో పగటిపూట కునుకు రావడం సహజం. అయితే అది ఉద్యోగులను చాలా ఇబ్బంది పెట్టే విషయం. ఒక అరగంట సేపు కునుకు తీద్దామనుకున్నా ఆఫీసులో అలాంటివి అస్సలు కుదరదు. పోనీ ఇంటికెళ్దామా అంటే అరగంట, గంట నిద్ర కోసం ఆఫీసుకు సగం పూట సెలవు పెట్టలేం. అలా ఇబ్బంది పడే ఉద్యోగుల కోసం వారు పనిచేసే కంపెనీల సమీపంలో ‘నెస్కేఫ్‌ స్లీప్‌ కేఫ్‌’ పేరుతో ప్రముఖ కాఫీ బ్రాండ్‌ నెస్కేఫ్‌ వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు కాస్త కునుకు తీయాలనుకుంటే నేరుగా ఈ కేఫ్‌కు వచ్చి కాసేపు పడుకోవచ్చు. ఇందుకోసం కేఫ్‌ నిర్వాహకులు సౌకర్యవంతమైన మంచాలు, పరుపుతో చేసిన ఆరాం కుర్చీలు ఏర్పాటు చేశారు.
 

జపాన్‌లోని టోక్యో నగరంలో ఈ నెస్కేఫ్‌ స్లీప్‌ కేఫ్‌ను గతంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన నెస్కేఫ్‌.. ఇటీవల శాశ్వతంగా అందబాటులోకి తెచ్చింది. ఎవరైనా బయట పనులు చేసి అలిసిపోయినా.. నిద్ర వచ్చినట్టు అన్పించినా ఈ కేఫ్‌ను ఆశ్రయించొచ్చు. ఇందుకోసం కేఫ్‌ ‘న్యాప్‌ కోర్స్‌’, ‘స్లీప్‌ కోర్స్‌’ పేరుతో రెండు రకాల సర్వీసులను అందుబాటులో ఉంచింది. న్యాప్‌ కోర్సులో ఆరాం కుర్చీలో నిద్రపోవచ్చు. అయితే అరగంటకు 750 యెన్లు(రూ. 462) చెల్లించాలి. నిద్ర లేచాక కాంప్లిమెంటరీగా కాఫీ ఇస్తారు. అదే స్లీప్‌ కోర్సులో అయితే ఆరాం కుర్చీలు, లేదా మంచంపై పడుకోవచ్చు. ఇందుకోసం గంటకు 1500 యెన్లు(రూ. 924) వసూలు చేస్తారు. స్లీప్‌ కోర్సులో పడుకునే ముందు కఫైన్‌ లేని కాఫీ.. నిద్ర  లేచాక కఫైన్‌ కలిపిన కాఫీ సర్వ్‌ చేస్తారు. తలగడ ఎంత మెత్తగా ఉండాలి? పడుకునే స్థలంలో ఏ రంగు లైట్లు వెలగాలి? వంటి వాటిని ఎంపిక చేసుకునే వీలుంది. 

అంతేకాదండయ్‌.. మీరు ఎంతసేపు పడుకున్నారు. ఎంత గాఢ నిద్రలో ఉన్నారో తెలిపే  విధంగా స్మార్ట్‌ ఐ మాస్క్‌ను ఇస్తారు. కావాలనుకునే వాళ్లు దాన్ని ధరించి పడుకోవచ్చు. వెళ్లే సమయంలో మాస్క్‌లో నమోదైన రికార్డులను అందజేస్తారు. ఇదివరకు ఈ కేఫ్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన నెస్కేఫ్.. టోక్యోలో శాశ్వతంగా అందుబాటులో తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగానూ వీటిని విస్తరింపజేయాలని నెస్కేఫ్‌ భావిస్తోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు