Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

ఐపీఎల్‌.. రికార్డులు ఫుల్‌ 

క్రికెట్‌ అభిమానులకు మార్చి 23 నుంచి పండుగ వాతావరణం మొదలవనుంది. మెగా క్రికెట్‌ టోర్నీ ఐపీఎల్‌ 12వ ఎడిషన్‌ ప్రారంభమవుతుంది. ఫోర్లు, సిక్స్‌లు, సెంచరీలు, హ్యాట్రిక్‌లు, రికార్డుల.. అబ్బో రెండు నెలలపాటు ఇక ఇవే మాటలు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఐపీఎల్‌లో నమోదైన రికార్డుల గురించి ఓ సారి తెలుసుకుందాం..!

పరుగుల వీరుడు

ఐపీఎల్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన క్రికెటర్‌గా సురేశ్‌ రైనా రికార్డు నెలకొల్పాడు. 176 మ్యాచ్‌ల్లో 4,985 పరుగులు సాధించాడు. రైనా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఆడాడు. సురేశ్‌ రైనా పేరిట మరో రికార్డు నమోదైంది. అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డూ రైనాదే. 176 మ్యాచ్‌ల్లో 95 క్యాచ్‌లు పట్టాడు. 

కీపర్‌గా కిర్రాక్‌

ఐపీఎల్‌లో ఎక్కువ మందిని ఔట్‌ చేసిన వికెట్‌ కీపర్‌గా దినేశ్‌ కార్తీక్‌ రికార్డు సాధించాడు. 168 మ్యాచ్‌ల్లో 124 (94 క్యాచ్‌లు, 30 స్టంపింగ్లు) మందిని పెవిలియన్‌కు పంపించాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరఫున ఆడాడు.

 

హ్యాట్రిక్‌ల మిశ్రా

బ్యాట్స్‌మన్‌ ఆధిపత్యం కనిపిస్తున్న ఐపీఎల్‌లో బౌలర్లూ అదరగొట్టిన సందర్భాలున్నాయి. లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించి రికార్డు సృష్టించాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌ (2008), డెక్కన్‌ ఛార్జర్స్‌ (2011), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2013)పై హ్యాట్రిక్‌ సాధించాడు.

బౌండరీల బాద్‌షా

ఐపీఎల్‌ అంటేనే ఫోర్లు, సిక్స్‌లు. క్రీజులోకి వచ్చామా.. కొట్టామా... వెళ్లామా అనుకుంటుంటారు బ్యాట్స్‌మన్‌. అలా ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధికంగా ఫోర్లు బాదిన ఆటగాడిగా గౌతమ్‌ గంభీర్‌ రికార్డు నెలకొల్పాడు. అలా ఎడమచేతి వాటం ఓపెనర్‌ 152 ఇన్నింగ్స్‌లో 491 బౌండరీలను బాదేశాడు.

ఒక్క పరుగూ...

ఒక ఓవర్‌ వేసి.. ఒక్క పరుగూ ఇవ్వకపోవడం ఐపీఎల్‌లతో సాధ్యమంటారా? బ్యాట్స్‌మన్‌ జోరు చూస్తుంటే కష్టమే అనిపిస్తోంది. కానీ ఐపీఎల్‌లో అప్పుడప్పుడు అలాంటివీ జరిగాయి. వారిలో అత్యధికం ప్రవీణ్‌ కుమార్‌ వేశాడు. ఈ మాజీ క్రికెటర్‌ 119 మ్యాచ్‌ల్లో 14 ఓవర్లు మెయిడిన్‌ వేశాడు.

 

ఆ స్కోరు ఆర్‌సీబీదే..

భారత జట్టను వరుస విజయాలతో ముందుకు తీసుకుపోతున్న విరాట్‌ కోహ్లీ... ఐపీఎల్‌లో మాత్రం తన జట్టును ఆ స్థాయిలో నడిపించలేకపోతున్నాడు. ఈ క్రమంలో అత్యంత చెత్త రికార్డును కూడా సాధించాడు. 2017లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో 10 ఓవర్లలోపే 49 పరుగులకు ఆలౌటై.. అతి తక్కువ పరుగుల రికార్డు కొట్టేశాడు.

సిక్సర్ల గేల్‌..

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డు సాధించాడు. 2013లో పుణె వారియర్స్‌పై 66 బంతుల్లోనే 175 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ వెస్టిండీస్‌ ఆటగాడు 112 మ్యాచ్‌ల్లో 292 సిక్సర్లు కొట్టాడు.

 

సింగ్‌ ఈజ్ కింగ్‌

ఐపీఎల్‌లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన రికార్డు టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ పేరిట ఉంది. ఈ మాజీ ముంబయి ఇండియన్స్‌ క్రికెటర్‌ అత్యధికంగా 1,128 బంతుల్ని పరుగులు రాకుండా కట్టడి చేశాడు. ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు.

14 బంతుల్లోనే 50

ప్రస్తుతం ప్రపంచకప్‌ టీమ్‌లో స్థానం కోసం పోరాడుతున్న కేఎల్‌ రాహుల్‌ పేరు మీదా ఓ రికార్డు ఉంది. అదే వేగవంతమైన అర్ధ శతకం. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ 2018లో దిల్లీ డేర్‌డెవిల్స్‌పై 14 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు.

అత్యధిక వికెట్లతో...

శ్రీలంక ఆటగాడు లసిత్‌ మలింగ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అన్ని సీజన్లలో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన మలింగ 19.01 సగటుతో 110 మ్యాచ్‌ల్లో 154 వికెట్లు తీశాడు. అయితే గత కొన్ని సీజన్లలో అతడి ఆటతీరు అంతగా బాగోలేదు.

 

అత్యధిక భాగస్వామ్యం

భారత్‌ క్రికెట్‌ జట్టులో పరుగుల యంత్రం... విరాట్‌ కోహ్లీ. దక్షిణాఫ్రికాకు చెందిన మిస్టర్‌ 360 డిగ్రీ బ్యాట్స్‌మన్‌ ఎబీ డివిలియర్స్‌. వీరిద్దరూ కలిస్తే ఆ ఆట అదుర్స్‌. అందుకు తగ్గట్టే వీరిద్దరూ కలసి మూడేళ్ల క్రితం ఓ మ్యాచ్‌లో అదరగొట్టేశారు. 2016లో గుజరాత్‌ లయన్స్‌పై 229 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.

మిస్టర్‌ కూల్‌ ‘కెప్టెన్‌’

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్‌గా వ్యవహరించి రికార్డు సృష్టించాడు. 2008 నుంచి 2018 వరకు 159 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రైజింగ్‌ పుణె సూపర్‌జైంట్స్‌ జట్లకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు