close

వార్తలు / కథనాలు

గంటల తరబడి కాదు.. రోజుల తరబడి

ట్రాఫిక్‌.. ఈ పేరు వినగానే సగంమందికి అలసట వచ్చేస్తుంది. స్కూల్‌, కాలేజీ, ఆఫీస్‌, సినిమా... ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా కొంచెం ముందే బయలుదేరుతాం. ఎందుకంటే ట్రాఫిక్‌లో చిక్కుకుని ఎక్కడ ఆలస్యమైపోతుందేమోనన్న భయం. రోడ్డు ప్రమాదాలు, ప్రముఖుల పర్యటనలు వంటి సందర్భాల్లో ఆయా రోడ్లలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామైపోయి మన సహనానికి పరీక్ష పెడుతుంటాయి. వీటికే మనం హైరానా పడిపోతే కొన్ని దేశాల్లో గంటలు కాదు, ఏకంగా రోజులు తరబడి రోడ్లపైనే ప్రజలు స్తంభించిపోయారు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ప్రపంచంలో ఏర్పడిన అతి భయంకరమైన ట్రాఫిక్‌ జామ్‌ల గురించి తెలుసుకుందామా!


పండగ కోసం...

ఇండోనేషియాలోని బ్రెబస్‌ నగరంలో ప్రధాన హైవే జంక్షన్‌ వద్ద 2016 జూలైలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. స్థానికంగా వారు జరుపుకునే ఓ పండగ కోసం వేలమంది ప్రజలు తమ ఇళ్లకి తరలివెళ్లడంతో సుమారు 21 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్‌ సమస్య మూడు రోజుల పాటు కొనసాగడంతో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు.


వీకెండ్‌ కారణంగా...

ప్రధాన నగరాల్లో సాయంకాలంలో ట్రాఫిక్‌ సమస్యలు ఉండటం సర్వసాధారణం. కానీ బ్రెజిల్‌లోని సౌపాలో నగరం దీనికి భిన్నం. ఇక్కడ ట్రాఫిక్‌ ఏర్పడితే ప్రయాణికులు సినిమా చూసేంతా సమయం ఉంటుంది. అంటే అంతగా ‘సౌ పాలో’లో ట్రాఫిక్‌ సమస్య ఉందని అర్థం. కానీ 2013 నవంబర్‌లో ‘సౌ పాలో’లో భయంకరమైన ట్రాఫిక్‌ ఏర్పడింది. వారాంతపు సెలవు నేపథ్యంలో సుమారు 309 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


33 కిలోమీటర్ల మేర...

1969లో జిమి హెండ్రిక్స్‌ ప్రదర్శిస్తున్న ఉడ్‌స్టాక్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌కి నిర్వాహకులు 50వేల మంది అభిమానులు వస్తారని అంచనా వేశారు. కానీ సుమారు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యేసరికి న్యూయార్క్‌లో 33 కిలోమీటర్ల మేర మూడు రోజుల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ప్రదర్శకులు హెలికాఫ్టర్ల ద్వారా స్థలానికి చేరుకుంటే, సుమారు 5 లక్షల అభిమానులు కార్లని వదిలి కాలినడకతో వెళ్లారు.


12 రోజులపాటు...

2010 ఆగస్టులో బీజింగ్‌-టిబెట్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణికులు సుమారు 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఇది 12రోజులపాటు కొనసాగడం విశేషం. వాతావరణ మార్పులు, ఇతర ఇబ్బందుల వల్ల జరిగిందనుకుంటే పొరపాటే. ఎక్కువగా కార్లు రోడ్లపై రావడంతో ఈ సమస్య తలెత్తింది.


గోడ పడగొట్టాక...

1990 ఏప్రిల్‌లో బెర్లిన్‌ గోడ పడగొట్టడంతో తూర్పు, పశ్చిమ జర్మనీలు అవతల నగరంలో ఉన్న బంధువులు, మిత్రులని కలుసుకోవడానికి బయలుదేరారు. 5లక్షల కార్లు సరిపోయే ప్రదేశంలో 18 మిలియన్ల కార్లు రావడంతో 48 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.


హరికేన్‌ వచ్చి...

హరికేన్‌ రీటా సంభవించడంతో టెక్సాస్‌కు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. 2005 సెప్టెంబర్‌లో సుమారు 2.5 మిలియన్ల మంది ప్రజలు టెక్సాస్‌లోని హౌస్టన్‌ను విడిచి వెళ్లారు. దీంతో రద్దీ ఏర్పడి 48 గంటలపాటు 161 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


వాతావరణం వల్ల...

ఫ్రాన్స్‌లో వాతావరణ ఇబ్బందుల వల్ల 1980 ఫిబ్రవరిలో ఆ ప్రాంతంలోని లియోన్‌ ప్రజలు పారిస్‌కు తరలి వెళ్లారు. దీంతో లియోస్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు 175 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.


201 కిలోమీటర్లు

మంచు తుఫాను కారణంగా 2012 నవంబర్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రధాన రహదారిపై ఈ ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు మూడు రోజుల పాటు 201 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


అన్నీ మూసేయడంతో...

వరల్డ్‌ ట్రేడ్‌ టవర్‌పై ఉగ్రవాదుల దాడి అనంతరం న్యూయార్క్‌లో వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంతెనలు, సొరంగాలను మూసివేసి అత్యవసర వాహనాలు మినహా మిగిలిన వాటిని తనిఖీ చేయడంతో కొన్ని రోజులపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


15 వేల కార్లు

రెండు కారణాల వల్ల 1990లో జపాన్‌ ప్రజలు ఇబ్బంది పడ్డారు. టైఫూన్‌ ప్రమాద హెచ్చరిక జారీచేయడం, సెలవులకి టోక్యో ప్రజలంతా తమ ఇళ్లకి బయలుదేరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పశ్చిమ జపాన్‌లోని హైగా, షిగాల మధ్య సుమారు 15 వేల కార్లు 135 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి.


ద్వారాలు కుదించగా...

సెలవుల కారణంతో మరోసారి ట్రాఫిక్‌ స్తంభించింది. 2015 అక్టోబర్‌లో చైనాలోని బీజింగ్‌ - హాంకాంగ్‌ - మాకా ఎక్స్‌ప్రెస్‌వేలో కొత్త తనిఖీ కేంద్రాన్నిఏర్పాటు చేయడంతో 12 రోజుల పాటు 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. తనిఖీ కేంద్రంలో 50 ద్వారాలని 20 ద్వారాలుగా కుదించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.


మంచు కురిసి...
2011 ఫిబ్రవరిలో మంచు కురవడంతో చికాగోలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఏకంగా 12 గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. హిమపాతం ఎక్కువగా ఉండటంతో 51 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. దీంతో చాలా కార్లు మంచులో కూరుకుపోయాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని