Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

కోహ్లీ... తొలి యాడ్‌ ఏంటో తెలుసా?

విరాట్‌ కోహ్లీ... బూస్ట్‌ యాడ్‌లో అదరగొడుతున్నాడు!  

ధోనీ... నెట్‌ మెడ్స్‌ ప్రకటనలో మెరుస్తున్నాడు! 

సచిన్‌... ల్యూమినస్‌ ఫ్యాన్స్‌ యాడ్‌లో కనిపిస్తున్నాడు!

ఐపీఎల్‌ కోసం అయితే.. అందరూ కలసి యాడ్స్‌ చేస్తున్నారు!

వీళ్లే కాదు... ఇలా ప్రకటనల్లో కనిపించిన, కనిపిస్తున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఎవరికివారు ఆ ప్రకటనల్లో హీరోల తరహాలో భలేగా నటిస్తున్నారు. ఇప్పుడు సరే.. మరి తొలినాళ్లలో ఈ స్టార్‌ క్రికెటర్లు చేసిన యాడ్స్‌ ఏంటో తెలుసా? 


బ్యాండెయిడ్‌ అతికించి

సచిన్‌ అంటే చిన్న పిల్లలకు చాలా ఇష్టం. సచిన్‌ చెబితే పిల్లలు బాగా వింటారు అందుకేనేమో బ్యాండెయిడ్‌ తన ప్రచారం కోసం సచిన్‌ను ఎంచుకుంది. కెరీర్‌లో రాణిస్తున్న తొలి రోజుల్లోనే ప్రకటనల్లోకి వచ్చేశాడు లిటిల్‌ మాస్టర్‌. చిన్న పిల్లలతో సచిన్‌ క్రికెట్‌ ఆడటం నేపథ్యంలో ఈ యాడ్‌ ఉంటుంది. అందులో సచిన్‌ ఎలా చేశాడో.. దిగువ వీడియో చూసేయండి.

టీమ్‌కి చాలా లక్కీ

టీమిండియాకు విరాట్‌ కోహ్లీ చాలా లక్కీ. ఇప్పుడు క్రికెట్‌ అభిమానులు అంతా అంటున్న మాట ఇదే. దీన్ని ముందే ఊహించారేమో మంచ్‌ చాక్లెట్‌ వాళ్లు ఎప్పుడో కోహ్లీ వచ్చిన తొలి రోజుల్లోనే అలాంటి యాడ్‌ తీసేశారు. ఇది కూడా క్రికెట్‌ నేపథ్యంలోనే సాగుతుంది. క్రికెట్‌ ఆడటానికి పనికిరాడు అనుకున్న కోహ్లీ.. ఆ జట్టుకు లక్కీ ఛార్మ్‌ ఎలా అయ్యాడో మీరే చూడండి!


రిలయన్స్‌ మాటలు

‘కర్లో దునియా ముట్టీ మే’... గుర్తుందా? చాలా రోజుల క్రితం రిలయన్స్‌ తొలి తరం మొబైల్స్‌ వచ్చినప్పుడు వచ్చిన స్లోగన్‌. ఈ యాడ్‌లోనే వీరేంద్ర సెహ్వాగ్‌ తొలిసారి కనిపించాడు. తల్లి మాట, క్రికెట్‌ ఆటను కలిపి రూపొందించిన యాడ్‌కు ఆ రోజుల్లో మంచి స్పందనే వచ్చింది. తల్లి మాట విని సెహ్వాగ్‌ ఎలా ఆడాడో తెలియాలంటే ఓ లుక్కేయాల్సిందే.

 

సత్తా మీ చేతుల్లోనే...

మహేంద్ర సింగ్‌ ధోనికి బైక్స్‌ అంటే ప్రాణం. స్పోర్ట్స్‌ బైక్స్‌ అంటే మరీనూ. కొత్త బండి మార్కెట్‌లోకి వస్తే కొనేస్తుంటాడు. ఈ ఆసక్తిని ఉపయోగించుకొని టీవీఎస్‌ తన  బైక్‌ యాడ్‌కు ధోనీని ఎంచుకుంది. టీవీఎస్‌ నుంచి వచ్చిన స్టార్‌ సిటీ బైక్‌ తొలి యాడ్‌లో ధోనీ నటించాడు. అందులో యువతకు స్ఫూర్తినిచ్చేలా ‘సత్తా మీ చేతుల్లోనే...’ అంటూ ధోనీ మాట్లాడాడు. మరి ధోనీ ఏం చెప్పాడో, తొలి యాడ్‌లో ఎలా నటించాడో మీరే చూడండి.

 

యువీ సలహాలు...

ఇప్పుడు కుర్రకారుకు ఉన్న అతి పెద్ద సమస్య... జుట్టు రాలిపోవడం. దానికి ఎన్నో క్రీములు, ఆయిల్స్‌ వచ్చాయి. వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనతోనే యాడ్స్‌ అరంగేట్రం చేశాడు యువరాజ్‌ సింగ్‌.  ప్యారాచూట్‌ ఆఫ్టర్‌ షవర్‌కు తొలి యాడ్‌ చేశాడు. జుట్టు రాలిపోవడంతో బాధపడుతున్న తోటి క్రికెటర్‌ శ్రీశాంత్‌కు యువరాజ్‌ ఏం సలహా చెప్పాడో చూసేయండి.

 

ఫ్రెండ్‌షిప్‌ కోసం...

భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య చాలా రోజుల క్రితం ఫ్రెండ్‌ షిప్‌ సిరీస్‌ పేరుతో ఓ టోర్నీ జరిగింది. దీని కోసం చేసిన ఓ యాడ్‌తో మహ్మద్‌ కైఫ్‌ ప్రకటనల అరంగేట్రం చేశాడు. పెప్సీ ఈ ప్రకటనను రూపొందించింది. ఫ్రెండ్‌ షిప్‌ అనే బోర్డు నేపథ్యంలో ఉన్న ఈ ప్రకటనలో జహీర్‌ ఖాన్‌, సౌరభ్‌ గంగూలీ కూడా ఉన్నారు. 

 

డిపెండబుల్‌... కూల్‌

రాహుల్‌ ద్రవిడ్‌ యాక్టివ్‌ క్రికెటర్‌గా ఉన్నన్ని రోజులూ మిస్టర్‌ డిపెండబుల్‌ అని పిలిచారు. అతను డిపెండబులే కాదు.. మిస్టర్‌ కూల్‌ కూడా. దాన్ని చూపిస్తూ పెప్సీ ఓ యాడ్‌ను చేసింది. ఇదే ద్రవిడ్‌ తొలి యాడ్‌. ఇందులో ద్రవిడ్‌ పెప్సీ తాగి సరదా వేషాలు వేయకుండా... కూల్‌గా ఆట మీద అంకితభావం ఎలా చూపిస్తున్నాడు అనేది చూపించారు. అన్నట్లు ఇందులో బాలీవుడ్‌ నటి కిమ్‌ శర్మ కూడా కనిపిస్తుంది. 

 

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

ఒకప్పుడు మొబైల్స్‌, రీఛార్జిలు మీద ఆఫర్లు అంటే గగనం. ఎప్పుడో గాని ఫుల్‌ టాక్‌టైమ్‌ ఆఫర్లు ఉండేవి కావు. అలాంటి సమయంలో అదనపు ఫీచర్లతో టాటా ఇండికామ్‌ వచ్చింది. ఆ యాడ్‌తోనే ఇర్ఫాన్‌ పఠాన్‌ తొలిసారి కనిపించాడు. మరి ఫోన్‌ గురించి పఠాన్‌ ఏం చెప్పాడో.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఎవరికిచ్చాడో చూసేయండి.

 

చలికాలం సమస్య 

రోహిత్‌ శర్మ యాడ్స్‌ ఎంట్రీ కూడా క్రికెట్‌ నేపథ్యంలోనే జరిగింది. బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధమవుతున్న రోహిత్‌... ముక్కు దిబ్బడతో బాధపడుతుంటాడు. ఆ టైమ్‌లో కోచ్‌ వచ్చి నేసీవియాన్‌ ఇస్తాడు. దాంతో రోహిత్‌ ముక్కు దిబ్బడ సమస్య పోయి... బ్యాటింగ్‌కు సిద్ధమవుతాడు. సగటు ప్రజల సమస్యతో వచ్చిన ఈ యాడ్‌కు ఆ రోజుల్లో మంచి స్పందన వచ్చింది.

 

కపిల్స్‌ ఎనర్జీ

‘బూస్ట్‌ ఈజ్‌ ద సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ...’ ఈ మాటను ఇప్పుడు కోహ్లీ అంటున్నాడు. అంతకుముందు ధోనీ అన్నాడు. ఆ ముందు సచిన్‌ చెప్పాడు. మరి అందరికంటే ముందు చెప్పింది ఎవరు అంటే కపిల్‌ దేవ్‌ అని చెప్పాలా. అదే అతని తొలి యాడ్‌ కూడా. జాగింగ్‌ చేసి వచ్చి బూస్ట్‌ తాగుతూ ‘బూస్ట్‌ ఈజ్‌ ద సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ’ అని చెబుతాడు. ఎలా చెప్పాడో చూసేయండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు