Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

పనిచేయకున్నా.. జీతం వచ్చే ఉద్యోగం

డబ్బు సంపాదించాలంటే వ్యాపారమో, ఉద్యోగమో చేయాల్సిందే.. కష్టపడాల్సిందే. అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్నా బుద్ధికి, దేహానికి పని చెప్పక తప్పదు. అలాంటిది.. ఏ కష్టం పడకున్నా.. అసలు ఏ పని చేయకున్నా నెలకు రూ. 1.72లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని ఇస్తామంటోంది.. స్వీడిష్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ ఆర్ట్‌ ప్రాజెక్టు అనే సంస్థ. వివరాల్లోకి వెళ్తే..

స్వీడన్‌ ప్రభుత్వం గోథెన్‌బర్గ్‌లోని కోర్వ్సేగన్‌ ప్రాంతంలో రైల్వేస్టేషన్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఒక ఉద్యోగిని నియమించాలని నిర్ణయించింది. అయితే ఇక్కడ ఉద్యోగం పొందినవారు ఏ పని చేయనక్కర్లేదు. డ్యూటీకి వచ్చి స్టేషన్‌లోని గడియారం వద్ద ఉన్న బటన్‌ నొక్కితే చాలు. అక్కడ అమర్చిన బల్బులు వెలుగుతాయి. ఆ తర్వాత ఆ ఉద్యోగికి ఏ పని ఉండదు. బయటకెళ్లి తిరిగి రావొచ్చు.. స్టేషన్‌లోనే ఖాళీగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అయితే డ్యూటీ పూర్తయ్యాక బటన్‌ ఆఫ్‌ చేసి ఇంటికి వెళ్లిపోవాలి. ఇలా ఉద్యోగికి నచ్చినన్ని రోజులు ఈ ఉద్యోగం చేసుకోవచ్చు. వేరే ఉద్యోగమేదైనా లభిస్తే నిరభ్యంతరంగా స్టేషన్‌ నిర్వాహకులు ఉద్యోగిని రిలీవ్‌ చేస్తారు. లేదంటే రిటైర్మెంట్‌ వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఈ ఉద్యోగికి నెలకు 2,500 డాలర్లు(దాదాపు రూ. 1.72లక్షలు) జీతంతోపాటు ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్సులు, సెలవులు, రిటైర్‌ అయ్యాక పింఛన్‌ కూడా ఇస్తారు. 

ఎందుకిదంతా అంటే.. నూతనంగా నిర్మించే కోర్స్వేగన్‌ రైల్వేస్టేషన్‌ అన్నింటికన్నా విభిన్నంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ వినూత్న ఉద్యోగ ఆలోచనను ఆ దేశానికి చెందిన ఇద్దరు కళాకారులు, ఆర్థికవేత్తలు సీమన్‌ గోల్డిన్‌, జాకబ్‌ సెన్నెబీలు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం అంగీకరించడంతో స్వీడిష్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ ఆర్ట్‌ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఉద్యోగిని నియమించడం, అతడికి జీతం ఇవ్వడం ఈ సంస్థ పనే. విద్యార్హతలంటూ ఏమీ లేని ఈ ఉద్యోగానికి ప్రపంచంలో ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. అయితే ఈ నియామకాలు మాత్రం ఇప్పుడు కాదండోయ్‌.. రైల్వే స్టేషన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాతే ఉద్యోగం కల్పిస్తారట. పని లేని ఉద్యోగం కావాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే మరి!

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు