Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

జెంటిల్మన్‌ క్రికెట్‌లో ‘మిసెస్‌ అండ్‌ మిసెస్‌’

క్రికెట్‌ అంటే పక్కా జెంటిల్మన్‌ క్రీడ! పేరుకు తగ్గట్టే పదేళ్ల క్రితం వరకు మగాళ్లదే రాజ్యం. ఇప్పుడీ క్రీడా సామ్రాజ్యంలో మహిళలూ కీలకమయ్యారు. అందంతోనే కాదు ఆటతోనూ అదరగొడుతున్న మహిళా క్రికెటర్లకు అభిమానుల్లో క్రేజ్‌ పెరిగిపోయింది. ఒకప్పుడు పేర్లే గుర్తించుకోని వారు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ తెరల్లో వారి చిత్రాలను పెట్టుకుంటున్నారు. ఆట.. ఫిట్‌నెస్‌.. అంకితభావం.. సాంకేతికత.. వ్యూహ ప్రతివ్యూహాల్లో మగాళ్లను దాటేస్తున్నారు. ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ఓ సరికొత్త సరళికి బాటలు వేస్తున్నారు. జెంటిల్మన్‌ క్రీడలో ‘మిసెస్‌ అండ్‌ మిసెస్‌’గా దర్శనమిస్తూ ఓ గట్టి సందేశం పంపిస్తున్నారు.

‘ఒక్కటై’ ఆడుతున్నారు 

పురుషులతో పోలిస్తే మహిళల్లో భావోద్వేగం పాళ్లు ఎక్కువ. అందుకే అన్నిటితో అనుబంధం పెంచుకుంటారు. మగాళ్లతో పోలిస్తే వినూత్నంగా ఆలోచించగలరు. తర్కంలోనూ వారిదే పైచేయి. ‘మాకేం తెలుసులేండి...’ అంటూ దీర్ఘాలు తీస్తూనే కుండబద్దలు కొట్టేస్తారు. సమాజాన్ని చాలా తెలివిగా ఎదురించగలరు. బ్యాటు, బాల్‌ చేతబట్టినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం అనే యువతుల స్ఫూర్తి గాథలు కొన్ని ఇప్పటికే తెలుసు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టిన మహిళలు ఇప్పుడు సహచరులనే ప్రేమించి పెళ్లాడుతున్నారు. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. పెనవేసుకొనే అనుబంధం ఉండాలే తప్ప స్వలింగ సంపర్కంలో తప్పేముందని చాటుతున్నారు. ఆధునిక భావాలతో ‘మిసెస్‌ అండ్‌ మిసెస్‌’గా తమ ప్రయాణం మొదలుపెడుతున్నారు. విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఆయా దేశాలు స్వలింగ సంపర్కం తప్పుకాదని చట్టాలు చేయడంతో మహిళల క్రికెట్‌లో ఈ దాంపత్య సరళి ఇప్పుడు పెరుగుతోంది. ఇప్పటికే మూడు జంటలు అధికారికంగా వివాహాలు చేసుకొని ఆనందంగా జీవిస్తున్నారు.

‘అమీ-మేరీ’ తొలి అడుగు

తొలిసారి వివాహ బంధంతో ఒక్కటైన మహిళా క్రికెటర్ల జంట అమీ ఎల్లా శాటర్త్‌ వైట్‌, లియా మేరీ మౌరీన్‌ తహూహూ. వీరిది న్యూజిలాండ్‌. ప్రస్తుతం శాటర్త్‌వైట్‌ కివీస్‌ సారథి. అద్భుతమైన రికార్డులు ఆమె సొంతం. 2009, 2013 మహిళల ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆమె ప్రాతినిథ్యం వహించింది. కుమార సంగక్కర తర్వాత వన్డేల్లో వరుసగా నాలుగు శతకాలు బాది సరికొత్త రికార్డు నెలకొల్పింది. విధ్వంసకరంగా ఆడగలదు. ఇక తహూహూ నాలుగేళ్లు చిన్నది. 2010లో తొలిసారి వీరిద్దరూ జట్టుకు ఆడారు. ఒకర్నొకరు అర్థం చేసుకున్నారు. 2014లో బంధం బలపడింది. 2017 వసంత కాలంలో పెళ్లి చేసుకున్నారు.  ‘దీన్ని చదువుతున్నప్పుడు, మా గురించి విన్నప్పుడు, కష్టాలు పడుతున్న మాలాంటి వ్యక్తులకు సాయపడేందుకు దీన్నో అవకాశంగా ఎంచుకుంటున్నాం. మేం ఇలా చేస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నాం’ అంటారు అమీ, మేరీ దంపతులు. తమ బంధం గురించి ప్రపంచానికి చాటేందుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదని పేర్కొంటున్నారు.

‘దాంపత్యం’లో రికార్డు

మహిళల క్రికెట్‌ను క్రమంతప్పకుండా అనుసరించే వారికి డేన్‌ వాన్‌ నీకెర్గ్‌, మారిజానె కాప్‌ పేర్లు సుపరిచితమే. నీకెర్గ్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు సారథి. కాప్‌ అద్భుతమైన క్రికెటర్‌. వీరిద్దరూ ఆల్‌రౌండర్లే కావడం గమనార్హం. 2018లో వివాహమాడారు. వీరిద్దరి కెరీర్లు సమాంతరంగా సాగుతుండటం విశేషం. 2009 ప్రపంచకప్‌లో రెండు రోజుల వ్యవధిలో జాతీయ జట్టులో అరంగేట్రం చేశారు. నాటి నుంచి వీరి బంధం బలపడింది. అభిప్రాయాలు పంచుకోవడం, అర్థం చేసుకోవడంతో చనువు పెరిగింది. అదే క్రమంలో ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ‘నాకు నువ్వు నీకు నేను’ అనుకున్నారు. సఫారీల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్‌ నీకెర్గే. ఐసీసీ టోర్నీలో ఆడిన తొలి దంపతులుగా వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. ప్రతి విషయంలోనూ ఒకర్నొకరు ప్రశంసించుకుంటారు.

‘మేగాన్‌-జెస్‌’ కొత్తజంట

ఆస్ట్రేలియా క్రికెటర్లు మేగాన్‌ షూట్‌, జెస్‌ హలీయోక్‌ ఈ వారంలోనే ఒక్కటయ్యారు. 2019, మార్చి 31న వీరిద్దరూ తమ వివాహ జీవితంలో తొలి అడుగు వేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో మేగాన్‌ ఒకరు. 26 ఏళ్ల ఈ పేసర్‌ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. క్రికెట్‌ విధానాలపై ఆమె బహిరంగంగా మాట్లాడుతుంది. అన్యాయంగా అనిపిస్తే ఎదురు తిరుగుతుంది. మహిళల క్రికెటర్ల పరిస్థితులు మెరుగుపడేందుకు కృషి చేస్తోంది. చాలా కాలంగా ఆమె ప్రేమిస్తున్న సహచర క్రికెటర్‌ జెస్‌ను అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో పెళ్లాడింది. 2018లో ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కం గురించి సోషల్‌ మీడియాలో చేపట్టిన ఓటింగ్‌లో వీరు ‘అవును’ అని ఓటు వేశారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో, జట్టులో వీరిద్దరినీ ఒక్కరిగానే భావిస్తారట సహచరులు. ‘నా జీవితంలో అత్యుత్తమైన రోజు. నా హృదయం ప్రేమతో నిండిపోయింది. నేనెంతో అదృష్టవంతురాలిని. ప్రేమతో.. మిసెస్‌ అండ్‌ మిసెస్‌ షూట్‌’ అని పెళ్లిరోజున ట్వీట్‌ చేసింది. 

అంతర్జాతీయ మహిళా క్రికెటర్ల వివాహ సరళి ఈ ముగ్గురితోనే ముగిసిపోదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లలో స్వలింగ సంపర్కులు ఉన్నారని తెలుస్తోంది. కొందరు ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా కొన్ని చిత్రాలు పోస్ట్‌ చేస్తూ సూచనలు చేస్తున్నారు.

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు