close

వార్తలు / కథనాలు

ప్రఖ్యాత ప్రదేశాలు.. అత్యంత రహస్యాలు!

‘రహస్యం’.. ఈ పదం వినగానే మనలో ఏదో తెలియని ఆసక్తి.. దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత. మనం రోజూ కొన్ని వస్తువులను, ప్రదేశాలను చూస్తుంటాం. అందులో ఓ రహస్యం ఉందని తెలియగానే.. దానిని ఛేదించే వరకు మళ్లీ మళ్లీ దానిని చూడాలని మనసు ఆరాటపడుతుంది. అలాంటిది ప్రపంచ అద్భుత కట్టడాల్లోనే రహస్యాలున్నాయని ఎవరో చెబితే..! అది నిజమని తెలిసిస్తే.. మరుక్షణం ముక్కున వేలేసుకోక తప్పదు. అలాంటి ప్రదేశాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయట. అవేంటో చూసేద్దామా..?

ఈఫిల్‌ టవర్‌లో వ్యక్తిగత గది

ఈఫిల్‌ టవర్‌ అనగానే ఓ ఎత్తైన కట్టడం మన కళ్లముందు కదలాడుతుంది.  ఫ్రాన్స్‌లోని పారిస్‌ నగరంలో గస్టవ్‌ ఈఫెల్‌ అనే వ్యక్తి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. సాధారణంగా అందరికీ ఇదే విషయం తెలుసు. కానీ, ఆ టవర్‌ చివరి భాగాన ఈఫిల్‌  తన కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించుకున్నాడట. ఆయనకు తప్ప ఆ గదిలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. ఆయన బతికున్న రోజుల్లో అందులోకి ప్రవేశించిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో థామస్‌ ఎడిసన్‌ ఒకరు. ఈఫిల్‌ కన్నుమూసిన తర్వాత కూడా అందులోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. కానీ, ఆ గది కిటికీ నుంచి లోపలికి చూసే అవకాశం ఉంది. దీనికి కోసం ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు.

మౌంట్‌ రష్‌మోర్‌లో మరో రహస్యం

అమెరికాకు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన  అబ్రహాం లింకన్, వాషింగ్టన్‌, థామస్‌ జఫర్‌సన్‌, థియోడర్‌  రూజ్‌వెల్ట్‌ శిల్పాలతో కూడిన ఓ కట్టడాన్ని గుట్జన్‌ బోర్గ్‌లమ్‌ అనే శిల్పి నిర్మించారు. దీనిలో అమెరికా మాజీ అధ్యక్షుడైన అబ్రహం లింకన్‌ శిల్పం వెనుక భాగంలో ఓ గదిని నిర్మించారు. అమెరికా చరిత్ర, ఆ దేశానికి చెందిన ప్రముఖ పత్రాలను అప్పట్లో ఆ గదిలో భద్రపరచాలనుకున్నారు. కానీ, అది కుదరలేదు. ప్రస్తుతం ఆ గదిని ఖాళీగా  ఉంచేశారు. అందులోకి ప్రస్తుతం ఎవ్వరినీ అనుమతించడం లేదు.

రైల్వే స్టేషన్‌లో టెన్నిస్‌ కోర్టు

న్యూయార్క్‌లో అత్యంత రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్లలో గ్రాండ్‌ సెంట్రల్‌ టెర్మినల్‌ ఒకటి. అందులో ఒకప్పుడు టెన్నిస్‌ కోర్టు ఉండేది. దీనిని అన్నెక్స్‌ అని పిలుస్తారు. కానీ, అధునీకరణ పనుల్లో క్రమంగా అది మరుగున పడిపోయింది. ప్రస్తుతం దానిని రికార్డింగ్‌ స్టూడియోగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతం అందర్నీ అనుమతిస్తున్నప్పటికీ.. దాని చరిత్ర గురించి మాత్రం చాలా మందికి  తెలియదు.

సుప్రీం కోర్టులో బాస్కెట్‌బాల్‌ కోర్టు

అది అమెరికా అత్యున్నత న్యాయస్థానం. వివిధ కేసుల నిమిత్తం చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు అక్కడికి వస్తుంటారు. అక్కడి వాతావరణమంతా బిజీబిజీగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో బాస్కెట్‌ బాల్ కోర్టు ఉందంటే నమ్ముతారా? నిజమే.. అమెరికా సుప్రీం కోర్టు భవనం చివరి అంతస్తులో ఓ బాస్కెట్‌ బాల్‌ కోర్టు ఉంది. అక్కడ క్లర్కులు, ఆఫ్‌ డ్యూటీ పోలీసు అధికారులు బాస్కెట్‌ బాల్‌ ఆడుతుంటారట. సుప్రీం కోర్టు సిబ్బంది తప్ప ఇతర వ్యక్తులెవ్వరినీ అక్కడికి అనుమతించరు.

లింకన్‌ విగ్రహం కింద ఓ చర్చి!

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ భారీ విగ్రహాన్ని వాషింగ్టన్‌లో నిర్మించారు. లింకన్‌ మెమోరియల్‌ పేరిట నిర్మించిన  విగ్రహం అడుగుభాగం దాదాపు 43,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 1914లో ఈ కట్టడం నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పట్లో విగ్రహం దిగువ ఉన్న ఖాళీ స్థలాన్ని అలాగే ఉంచేశారు. కానీ, 1975లో  పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఆ ఖాళీ స్థలంలో ఓ చర్చిని నిర్మించారు. అయితే ప్రస్తుతం ఇక్కడికి ఎవ్వరినీ అనుమతించడం లేదు.

ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌లో 103వ అంతస్తు..

అమెరికాలోని ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అమెరికాలోని అత్యద్భుత కట్టడాల్లో అదొకటి. అందరూ ఆ భవనంలో 102 అంతస్తులు మాత్రమే ఉంటాయనుకుంటారు. కానీ, చివరి భాగంలో మరో అంతస్తు కూడా ఉందట. అందులోకి కేవలం ఆ భవన నిర్వహణ చూస్తున్న ఇంజినీర్లకు, టేలర్‌ స్విఫ్ట్‌ లాంటి ప్రముఖులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు