close

వార్తలు / కథనాలు

మీకొచ్చే ప్రతి కలకీ ఓ లెక్కుంది!

కొన్ని కలలు భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. దీంతో ఠక్కున లేచి కూర్చుంటారు. ఏమైంది.. ఎక్కడున్నా అని ఒకటికి రెండుసార్లు చూసుకొని మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. మరికొందరు నీళ్లు తాగి.. ఇంకొందరు దేవుని దండకం చదువుకొని నిద్రపోతారు. అయితే ఇలాంటి కలలు చాలావరకూ ఒకేలా ఉండటం గమనార్హం. ఇలాంటి కలలు రావడానికి నిత్య జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులే కారణమని ఓ అధ్యయనంలో తేలింది. కలలు ఎందుకు వస్తాయి? ఆ కలలకు అర్థమేంటీ? అనేది ఆ అధ్యయనంలో వివరించారు. 

 

దారి తప్పినట్లు.. 

నిత్యం వెళ్తున్న దారిలోనే తప్పిపోవడం, ఓ గదిలో బందీ అయినట్లు మీకు కల వచ్చిందా?... అయితే మీరు నిజ జీవితంలో ఒకరి బలవంతంపై పని చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని అర్థమట. ఇలాంటి కల వస్తే పరిస్థితి మీ చేయి జారిపోతోందని గుర్తించాలంటున్నారు.

జారిపడిపోవడం.. 

నీళ్లలో మునిగిపోతున్నట్లు.. ఎత్తు నుంచి జారి  పడిపోతున్నట్లు మీకెప్పుడైనా కల వచ్చిందా?  ఒకవేళ అలా వచ్చిందంటే.. మీకు ఎదురైన పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అధ్యయనం చెబుతోంది. అంటే మీరు ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. అయితే ఇలాంటి కల వచ్చినప్పుడు ఠక్కున లేచి మీకు మీరుగా తేలిపోతున్నట్లుగా భావిస్తే ఇది నిజ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపించగలదు. 

కంప్యూటర్‌ పాడైపోయినట్లు.. 

కంప్యూటర్‌పై పని చేస్తుండగా ఒక్కసారిగా అది పాడవడం.. ఎవరికైనా ఫోన్‌ చేస్తే వాళ్లు కాల్‌ లిఫ్ట్‌ చేయకపోవడం లాంటి కలలు వచ్చాయా? ఈ ఆధునిక యుగంలో ఇలాంటి కలలు ఎక్కువమందికి వస్తున్నాయని చెబుతున్నారు. వీటికీ మరో అర్థం కూడా ఉంది. నిజ జీవితంలో మీకు బాగా నచ్చిన వ్యక్తులకు మీరు దూరమవుతున్నారని... మీ బంధం బీటలు వారుతోందని ఆ కలల సారం. ఇలాంటప్పుడు ఒక్కసారి వారితో మాట్లాడి చూడండి..  మళ్లీ అలాంటి కల కచ్చితంగా రాదని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.

బహిరంగ ప్రదేశంలో నగ్నంగా

అందరూ ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశంలో నగ్నంగా ఉన్నట్లు కొందరికి కలలు వస్తుంటాయి. నిజాన్ని దాచడానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటి కలలు వస్తాయని అధ్యయనం చెబుతోంది. కలలో నగ్నంగా ఉన్నారంటే...  ఆ నిజాన్ని నిజ జీవితంలో కాకుండా కలలో అలా నగ్నంగా ప్రదర్శిస్తున్నట్లు అర్థం. 

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తులు వచ్చినట్లు కలలో కనిపిస్తే.. అది మీ మానసిక స్థితికి అద్దం పడుతుంది. విపత్తు ఎంత పెద్దగా ఉంటుందో మీ మానసిక స్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయని అధ్యయనంలో తెలుస్తోంది. మీరు మీ బలహీనతలను గుర్తించి.. వాటిని అధిగమించినప్పుడు ఇలాంటి కలలు రాకుండా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

పరీక్షల్లో ఫెయిలవడం

విద్యార్థి దశలో చాలా మందికి వచ్చే కల.. పరీక్షల్లో తప్పడం. అలాంటి కలలు ఆ తర్వాత కూడా వచ్చాయంటే దానికి ఓ కారణముంది. జీవితంలో మీరు సాధించిన విజయాలకు నిజంగా మీరు అర్హులేనా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అనే సందేశం ఈ కలలో ఉంది. గతంలో మీరు చేసిన పనులను ఒక్కసారి సమీక్షించుకోండని ఈ కల చెబుతోంది.

ఇల్లు ధ్వంసమైనట్లు

ఇల్లు కూలిపోయినట్లు.. ఇంటిని ఎవరో ధ్వంసం చేస్తున్నట్లు కొందరికి కలలు వస్తుంటాయి. ఇలాంటి కల వస్తే ఇంటికి ఏమీ అవ్వదు కానీ.. మీరో విషయం అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లు.  మీ విలువైన వస్తువులను నిర్లక్ష్యం చేస్తున్నారని.. అవి ఆపదలో ఉన్నాయని ఆ కల అర్థం. 

ఎవరో చనిపోయినట్లు 

బంధువులు చనిపోయినట్లు లేదా తనే కన్నుమూసినట్లు కలలు వస్తుంటాయి.  అయితే అలాంటి కలలు వచ్చినప్పుడు నిజంగానే అలా జరుగుతుందేమోనని భయపడుతుంటారు. కానీ, ఆ అవసరం లేదు. నిజానికి మరణించినట్లు కల వస్తే.. నిజ జీవితంలో ఇకపై కొత్త దశను చూడబోతున్నట్లు అర్థం. 

ఎవరో వెంటపడుతున్నట్లు.. 

జీవితంలో ఒత్తిడిని భరించలేని వాళ్లకి, సమస్యలతో సతమతమవుతున్నవారికి తనను ఎవరో వెంబడిస్తున్నట్లు కలలు వస్తుంటాయి. పరిస్థితి ఎదుర్కోలేక భయపడుతూ జీవించే వారికి తరచూ ఇలాంటి కలలు వస్తాయని అధ్యయనం చెబుతోంది. వెంటపడటమే కాదు.. ఆ తర్వాత దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు