close

వార్తలు / కథనాలు

‘ఫ్లాటీ’ అందాలు చూడతరమా!

ప్రపంచంలోనే బెస్ట్ ద్వీపంగా ఎంపిక

ఉరుకులు పరుగుల జీవితం.. నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతం.. వీటికి దూరంగా ఆటవిడుపు కోసం ప్రశాంతమైన ప్రదేశం కోసం ప్రస్తుతం చాలా మంది అన్వేషిస్తుంటారు. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు, మానసిక ప్రశాంతత కోసం స్నేహితులతో సమయం గడపడమో.. టూర్‌కి వెళ్లడమో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో ప్రశాంతమైన ప్రదేశం కోసం ద్వీపాలను అన్వేషించే ప్రకృతి ప్రేమికులు ఉంటారు. అలాంటి వారి కోసం ఓ ట్రావెలింగ్‌ సంస్థ ప్రపంచంలోని ఉత్తమమైన 50 ద్వీపాలను ఎంపిక చేసింది. అందులో బెస్ట్ ద్వీపంగా ‘ఫ్లాటీ’ ఎంపికైంది. మరి ఇంతకి ఆ ద్వీపం ఎక్కడుంది? దాని విషయాలేంటి? తెలుసుకోవాలని ఉందా? ఆ విషయాలు మీకోసం..
ఐలాండ్‌కు ఉత్తరాన..
పర్యావరణ ప్రేమికులకు స్వర్గధామంలా ఉండే ‘ఫ్లాటీ’ ద్వీపం మంచు దేశమైన ఐస్‌లాండ్‌కు ఉత్తర దిక్కున ఉంటుంది. భూమండలానికి ఉత్తర ధ్రువంలో ఈ ద్వీపం ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగా.. ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఐస్‌లాండ్ భూభాగం నుంచి కేవలం 1.2 మైళ్ల దూరంలోనే ఈ ద్వీపం ఉంది. దీంతో పర్యాటకులు ఈ ప్రదేశానికి రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కేవలం నౌకల ద్వారానే ఈ ద్వీపానికి చేరుకునే వీలుంది. శీతాకాలంలో ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల వేసవికాలంలోనే పర్యాటకులు ఎక్కువగా వస్తారు.

రకరకాల పక్షులు.. భిన్నమైన వృక్ష జాతులు
ఫ్లాటీ ద్వీపం కేవలం ప్రకృతి సోయగాలకే ప్రసిద్ధి కాదు. భిన్నమైన జీవ వైవిధ్యం ఈ ద్వీపం సొంతం. ఇక్కడ దాదాపు 35 రకాల పక్షులు జీవిస్తున్నాయి. ఈ పక్షులను కెమెరాలో బంధించడానికి పర్యాటకులు ఆరాట పడుతుంటారు. ఎందుకంటే అవి అంత బావుంటాయి. ముఖ్యంగా బ్లాక్ గిల్లెమోట్స్, కిట్టివాక్స్, ఫుల్మార్స్, కార్మోరెంట్స్, ఓస్టెర్కాచర్స్, ఆర్కిటిక్ టెర్న్లు అనే పక్షులను ఇక్కడ చూడవచ్చు. అవి చేసే కిలకిల రావాలను, నీటిలో ఈదుతూ చేసే చేష్టలను చూసి పర్యాటకులు ముగ్దులైపోతారు. 

తీరంలో కిల్లర్‌ వేల్స్‌
ఫ్లాటీ ఐలాండ్‌ రకరకాల పక్షులకే కాదు.. దాదాపు 150 రకాల వృక్ష జాతులకు నెలవు. వీటి అందాలను చూడటానికి.. ఈ చెట్ల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. వీటన్నింటికి మించి ఈ ద్వీప తీరంలో కనిపించే కిల్లర్‌ వేల్స్‌ (తిమింగలాలు) అదనపు ఆకర్షణ. ఈ వేల్స్‌ను చూడటానికి పర్యాటకులు అమిత ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. విశాలమైన సముద్ర తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్వీపపు తీరప్రాంతాల్లో వీచే చల్లని గాలులను ఆస్వాదించడానికి పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు. 

ద్వీపం మొత్తం ఆరే నివాసాలు
ప్రకృతి అందాలతో ఇంతటి విశిష్టతలున్న ‘ఫ్లాటీ’ ద్వీపంలో నివాసాలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఇక్కడ ఉండే ఫ్లాటీ హోటల్‌ సంవత్సరం మొత్తంలో మూడు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే వేసవికాలంలోనే ఈ హోటల్ తన రుచులను పర్యాటకులకు అందిస్తుంది. జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో ఈ హోటల్‌ పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. 1926లో నిర్మించిన చర్చి ఇక్కడ మరో ప్రత్యేకత. ఈ చర్చిలో పర్యాటకులు ప్రార్థనలు జరుపుతారు.
ఫ్లాటీతో పోటీపడ్డ టాప్ 10 ద్వీపాలివే
2020 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా బెస్ట్‌ ఐలాండ్‌ ‘ఫ్లాటీ’ ఎంపికైంది. ‘ఫ్లాటీ’ తర్వాత వరుసలో 10 స్థానాల్లో ఉన్న ద్వీపాలివే.. పలవాన్‌ (ఫిలిఫైన్స్), ఇస్‌ప్రిటు శాంటో (వాన్యాటు), సొమరాయ్‌ (నార్వే), కోర్సులా (క్రోయేషియా), ది ఐరన్‌ ఐలాండ్‌ (ఐర్లాండ్‌), పెంబా (జాంజిబార్‌), బార్బడోస్‌ (కరేబియన్‌), లుమ్మి ఐలాండ్‌ (అమెరికా)


Tags :

మరిన్ని