close

వార్తలు / కథనాలు

భయమెందుకు మిత్రమా.. యాప్స్‌ ఉండగా!

 

నేటి తరం డిజిటల్‌ ప్రపంచంతో ఎంతగా ముడిపడి ఉందో అందరికీ తెలిసిందే. స్మార్ట్‌ ఫోన్లు లేనిదే క్షణం గడవని విధంగా పరిస్థితి మారింది. కాంటాక్ట్స్‌ నుంచి బ్యాంకు లావాదేవీల వరకు ఏపనీ ఫోన్‌ లేకుండా జరగదు. ఇలాంటి తరుణంలో మనం ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు ఫోన్‌ పొగొట్టుకుపోవడం లేదా ఎవరైనా చోరీ చేయడం వంటివి జరిగితే ఎలా? ఇక ఆ రోజు మన పనులన్నింటికీ అవాంతరాలు ఎదురైనట్లే. మన ఫోన్‌తో పాటు అందులోని ముఖ్యమైన సమాచారం, జ్ఞాపకాలు, బ్యాంకు సమాచారం సహా అన్నీ కోల్పోతాం. అలాంటి పరిస్థితుల్లో  మన ఫోన్‌ చోరీకి గురైతే ఎక్కడ ఉందో తెలుసుకునేలా కొన్ని యాప్స్‌ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

లైఫ్‌ 360:
ఈ యాప్‌ ద్వారా కుటుంబసభ్యుల అందరి ఫోన్లను మీరు ఇందులో అనుసంధానం చేసుకోవచ్చు. గ్రూప్‌ తయారుచేసుకుని అందరి లొకేషన్స్‌ని షేర్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్‌ చాట్‌ కూడా చేయవచ్చు. మీ గ్రూప్‌ సభ్యులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు,  ఏ వాహనంలో వెళుతున్నారు.. ఎంత వేగంతో వెళ్తున్నారు అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు కూడా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. www.life360.com సైట్‌లోకి లాగిన్‌ అయి చెక్‌ చేసుకోవచ్చు. ప్రమాదాలు జరిగి అత్యవసర సమయాలు తలెత్తినపుడు ఈ యాప్‌  అంబులెన్స్‌కు సమాచారం అందిస్తుంది. 


ఫైండ్‌ మై డివైజ్‌:
ఈ యాప్‌ గూగుల్‌ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా పోయిన మీ ఫోన్‌ లొకేషన్‌ను మరో డివైజ్‌లో ఈ మెయిల్‌ ఐడీ లాగిన్‌ చేసి సులువుగా గుర్తించవచ్చు. ఇందుకోసం మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్‌ కొన్ని మార్చుకుంటే సరిపోతుంది. అవేంటంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. మళ్లీ అందులో సెక్యురిటీ ఆప్షన్‌లోకి వెళ్లి లొకేషన్‌ ఆన్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. మీ ఫోన్‌ పోగొట్టుకు పోయినపుడు ఇతర ఫోన్లలో ఈ యాప్‌ను ద్వారా ఈమెయిల్‌ ఐడీ లాగిన్‌ చేసి ఆ ప్రాంతానికి వెళ్లి అలారం ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌ దొరికిపోతుంది. ఇది మీకు ప్లేస్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది. ఇందులో గ్రూప్‌ చాటింగ్‌ సదుపాయం ఉండదు. దీని ద్వారా డివైజ్‌లోని పోయిన ఫోన్‌లోని డేటా డిలీట్‌ చేయవచ్చు.


ఫ్యామిలీ లొకేటర్‌:
ఈ యాప్‌ కూడా కుటుంబసభ్యులు అందరూ ఉపయోగించుకోవడానికి తోడ్పడుతుంది. ఇందులోనూ ‘లైఫ్‌360’ తరహా లొకేషన్‌ ట్రేసింగ్‌, గ్రూప్‌ ఛాటింగ్‌ చేసుకోవచ్చు. గ్రూప్‌ సభ్యులందరి లొకేషన్స్‌ తెలుసుకోవచ్చు. గత వారం రోజుల్లో మీ కుటుంబసభ్యులు ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకోవడానికి లొకేషన్‌ హిస్టరీ ఆప్షన్‌ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ప్రమాదకర, సురక్షిత ప్రాంతాలను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు అలాంటి జోన్లలోకి వెళ్లినపుడు ఈ యాప్‌ అప్రమత్తం చేస్తుంది.


ఐషేరింగ్‌:
ఈ యాప్‌ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లతో పాటు, ఇతర యాప్‌ల మాదిరి కుటుంబసభ్యులతో అనుసంధానం కూడా వీలవుతుంది. గ్రూప్‌ సభ్యుల లొకేషన్‌ హిస్టరీ చూసుకోవడమే కాకుండా, ఎవరైనా ఒక ప్రాంతం విడిచి ఇంకో ప్రాంతం వెళ్లినపుడు నోటిఫికేషన్‌ ఇస్తుంది. ఇతర యాప్‌లతో పోలిస్తే ఇందులో పానిక్‌ అలర్ట్‌ అనే ఒక ఆసక్తికరమైన ఫీచర్‌ ఉంది. ఏంటంటే మీ ఫోన్‌ను ఒకసారి షేక్‌ చేస్తే ఇతర గ్రూప్‌ సభ్యులకు నోటిఫికేషన్‌ వెళ్తుంది. అంతేకాకుండా ఇది రియల్‌ టైం అలర్ట్స్‌ను కూడా చేరవేస్తుంది. ఇది ఉచితంగా లభించదు. కేవలం 7రోజుల వరకు దీన్ని ఉచితంగా పొందవచ్చు. 


సేఫ్‌ 365:
ఈ అప్లికేషన్‌ ద్వారా కూడా పోయిన మీ మొబైల్‌ను ట్రాక్‌ చేసి లొకేషన్‌ గుర్తించవచ్చు. ఇందులోనూ స్నేహితులతో గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని వారు ఎక్కడున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, వారి బ్యాటరీ శాతంతో పాటు వారు ఉపయోగిస్తున్న ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను కూడా తెలుసుకోవచ్చు. రియల్‌ టైం లొకేషన్స్‌ పంపుతుంది. కానీ ఫైండ్‌ మై డివైజ్‌ మాదిరిగా ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు అలర్ట్స్‌ ఇవ్వదు. 


ఎక్స్‌ఎఫ్‌ఐ లొకేటర్‌:
ఇది కేవలం పోగొట్టుకున్న డివైజ్‌లను గుర్తించడానికే రూపొందించారు. లైవ్‌ మ్యాప్స్‌ ద్వారా సులువుగా పోయిన ఫోన్‌ను ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఫైండ్‌ మై డివైజ్‌ లాగే ఇందులోనూ ఫోన్‌ పోయినపుడు గుర్తించడానికి అలారం సదుపాయం ఉంటుంది. నావిగేషన్‌ సక్రమంగా ఉండటంతో పాటు పక్కా లొకేషన్‌ చూపిస్తుంది. ఇందులో పోయిన ఫోన్‌లోని డేటా డెలీట్‌ చేయడానికి వీలు కాదు. 


ట్రాక్‌ వ్యూ:
ఈ అప్లికేషన్‌ రియల్‌టైం ట్రాకింగ్‌ కోసం ఉపయోగపడుతుంది. పోయిన డివైజ్‌కు సంబంధించి ఇది అలారం సౌండ్‌ ఇవ్వడం లేదా మెసేజ్‌ అలర్ట్స్‌ని పంపుతుంది. దీని ద్వారా పోయిన ఫోన్‌ను లైవ్‌ వీడియో మానిటరింగ్‌ కూడా చేయవచ్చు. 

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

మరిన్ని