close

వార్తలు / కథనాలు

మీ ‘ఫేస్‌’... మీకు నచ్చినట్లుగా!

సరదాగా... విచిత్రంగా... వైవిధ్యంగా

యువ క్రికెటర్‌లు, సినీతారలు వృద్ధ్యాప్యంలో ఇలా ఉంటారంటూ...కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.  ఆయా వ్యక్తుల ఫొటోలను కొన్ని యాప్‌లతో ఎడిట్ చేసి వృద్ధాప్య ఛాయలు వచ్చేలా మారుస్తున్నారు. ఇలాంటి యాప్‌లు గతంలోనే వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మేకప్‌ యాప్స్‌ అంటే మన ఫొటోల రంగులు పెంచడం లాంటివే అనుకుంటాం. కానీ ఈ తరహా యాప్‌లతో చాలానే చేసుకోవచ్చు. జుట్టు రంగును మార్చుకోవడం. ముఖాలకు గడ్డం, మీసాలు అతికించడం, ముఖ కవళికలు మార్చుకోవడం లాంటివి చేయొచ్చు. ఇవన్నీ చేయాలంటే ఓ సారి ఈ యాప్‌లు చూడండి.

ఫేస్‌ యాప్‌
ఈ యాప్‌ ద్వారా  వయస్సు పెరిగితే మీరెలా ఉంటారో చూసుకోవచ్చు. మీ ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే... మీరు ముసలివాళ్లయ్యాక ఎలా ఉంటారో చూపిస్తుంది. అంతేకాదు మీరు సీరియస్‌గా ఉన్నట్లు దిగిన ఫొటోను ఇందులో అప్‌లోడ్‌ చేసి నవ్వుతున్నట్లుగా మార్చొచ్చు.  అదేవిధంగా శరీర భాగాల్లో పచ్చబొట్లు కూడా సెట్‌ చేసుకోవచ్చు. 
ఎమ్‌ఎస్‌క్యూఆర్‌డీ
ఫేస్‌బుక్‌ సంస్థకు చెందిన ఈ యాప్‌లో మనుషుల ముఖాలకు జంతువుల ముఖాలను సరదాగా అతికించుకోవచ్చు. వ్యోమగాములు, సైంటిస్ట్‌ల తరహాలో మీ ముఖాలను మాస్క్‌లను జోడించుకోవచ్చు. మనుషుల ముఖాల్ని గ్రహాంతరవాసుల తరహాలో మార్చొచ్చు కూడా. ఈ మాస్క్‌లు పెట్టుకున్నాక మాట్లాడి వీడియోలగా చిత్రీకరించొచ్చు కూడా. 
ఫేస్‌ ఛేంజర్‌ 2
ఈ రెండు ఫొటోల మధ్య ఐదు తేడాలు గుర్తించడం అంటూ ఓ ఆట వచ్చేది గుర్తుందా? ఫేస్‌ ఛేంజర్‌ 2 యాప్‌లో అలాంటి ఆట ఉంది. దీంతోపాటు ఇందులో సెలబ్రిటీల మార్ఫ్‌డ్‌ ఫొటోలు కనిపిస్తాయి. వారిని గుర్తిస్తే మీకు పాయింట్లు వస్తాయి. అంటే ఈ యాప్‌లో ఫొటోలు మారచ్చడమే కాదు... మార్చిన ఫొటోలను గుర్తించే ఆటలూ ఆడుకోవచ్చు.
ఫేస్‌ స్వాప్‌
వ్యోమగామిగా మిమ్మల్ని మీరు చూసుకోవాలా... హాలీవుడ్‌ హీరోలా మీరు కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తోందా? అయితే ఫేస్‌స్వాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఈ యాప్‌లో మీ ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే ఇలా మీకు కావల్సినట్లు మార్చుకోవచ్చు. వ్యోమగామి, హీరోలుగా మాత్రమే కాదు... ఇందులో చాలా రకాలున్నాయి. 
యూ క్యామ్‌ ఫన్‌
స్నాప్‌ఛాట్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి కెమెరా ఓపెన్‌ చేస్తే మీ ముఖం మీద ఎమోజీ, ఫన్నీ స్టిక్కర్లు పెట్టుకునే ఆప్షన్‌ వస్తుంది. మరి అలాంటివి కావాలంటే సోషల్‌ యాప్సే అక్కర్లేదు. యూ క్యామ్‌ ఫన్‌ అనే యాప్‌లోనూ ఈ ఆప్షన్లున్నాయి. మీ ఫోన్‌లో ఉన్న పాత ఫొటోలను కూడా ఈ యాప్‌లో మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు