close

వార్తలు / కథనాలు

అక్కడ దహన సంస్కారాలు చేయాలంటే...

నెలలు... సంవత్సరాలూ పట్టొచ్చు!

అక్కడ దహన సంస్కారాలు చేయాలంటే...

‘మన బస్తీలో ఎవరైనా పోతే గంటలో ఎత్తుతారు. అదే బాగా డబ్బున్నోడు పోతే ఇలా రెండు.. మూడు రోజులు ఫ్రిజ్‌ల్లో పెట్టుకుంటారు’’ అంటూ ‘వేదం’ సినిమాలో అల్లు అర్జున్‌ డైలాగ్‌ చెప్తాడు. దహన సంస్కారాలపై రాసిన ఆ డైలాగ్‌ అక్షర సత్యం. ఎవరైనా మృతి చెందితే.. కొన్ని గంటల్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా విదేశాల్లో ఉండి, వెంటనే ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోతే... వారు వచ్చే వరకు ఐస్‌ బాక్స్‌‌లో భద్రపరుస్తారు. అదీ కూడా రెండు మూడ్రోజుల పాటే ఉంచగలరు. అయితే ఘనాలో ఎవరైనా మరణిస్తే అతడి మృతదేహాన్ని కొన్ని నెలల పాటు భద్రపర్చాల్సిందే. ఎందుకంటే దహన సంస్కారాల విషయంలో ఆ దేశంలో విచిత్రమైన సంప్రదాయం ఉంది. అదేంటో మీరే చదవండి. 
 

 

ఎక్కడైనా ఒక వ్యక్తి మరణిస్తే అతడి కుటుంబమే అంత్యక్రియలు నిర్వహిస్తుంది. కుటుంబం అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య/భర్త, కన్నబిడ్డలు. వీరికే ఆ వ్యక్తి దహన సంస్కారాలు చేసే బాధ్యత ఉంటుంది. కానీ, ఘనాలో అలా కాదు. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబసభ్యులు పరాయి వ్యక్తులుగా మారిపోతారు. అంత్యక్రియలు నిర్వహించాలంటే కుటుంబసభ్యులు కాకుండా... వేలు విడిచిన దూరపు బంధువుల్లో ఎవరో ఒకరు ఇంటి పెద్ద దిక్కుగా మారి అంత్యక్రియల బాధ్యత తీసుకుంటారు. బంధువు ఎంపికలోనూ ఓ నిబంధన ఉంది. మృతుడి గురించి బంధువుకు బాగా తెలిసి ఉండాలి.. కానీ, మృతుడి కుటుంబంతో 30 ఏళ్లుగా ఎలాంటి మాటలు, రాకపోకలు ఉండకూడదు.

అక్కడ దహన సంస్కారాలు చేయాలంటే...

అలా పెద్దదిక్కును ఎంపిక చేసిన తర్వాత గ్రామ పెద్దలతో పలు దఫాలుగా చర్చలు జరుపుతారు. మరణించిన వ్యక్తి దహన సంస్కారం చేయడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవని నిర్ధరణ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా కోర్టు అనుమతి తీసుకోవాలి. మీడియా ద్వారా మృతుడి విషయాన్ని అందరికీ తెలియజేసి.. ఎవరెవరు అంత్యక్రియలకు హాజరు అవుతారో ఒక జాబితా తయారు చేయాలి. అలాగే మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు చేయడానికంటే ముందే వారు నివసించిన ఇంటిలో మార్పులు చేయాలి.. లేదా ఇంటిని కూలగొట్టి కొత్తగా నిర్మించాలి. చివరిగా ఘన నివాళి అర్పించేందుకు ఏర్పాట్లు చేయాలి. అంతేకాదు శవపేటికల్ని కూడా కొత్తగా తయారు చేస్తారు. రంగురంగుల్లో, వైవిధ్యమైన బొమ్మలు జోడించి శవపేటికలు రూపొందిస్తారు. కోర్టు నుంచి అనుమతి రావడానికి, ఎవరి నుంచి అభ్యంతరాలు లేవని తెలుసుకోవడానికి 15 రోజుల నుంచి ఆరు నెలలు.. ఒక్కోసారి ఏడాదిపైగా సమయం పడుతుంది. అప్పటివరకు మృతదేహాన్ని ఐస్‌ బాక్స్‌లో పెట్టి భద్రపర్చాల్సిందే.

అక్కడ దహన సంస్కారాలు చేయాలంటే...

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 


Tags :

మరిన్ని