close

వార్తలు / కథనాలు

ఈ టీ రకం.. కేజీ రూ.40వేలు!  

ఈ టీ రకం.. కేజీ రూ.40వేలు!
 గువాహటి: టీ పొడి ధర కేజీ ఎంతుంటుంది? మహ అయితే నాలుగైదొందలు. మరీ అయితే ఓ వెయ్యి రూపాయలు. కానీ ఈ టీ రకం ధరెంతో తెలుసా అక్షరాలా రూ.40,000! నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ రకం టీ ఇంత ధర పలికింది. గువాహటిలో నిర్వహించిన వేలంలో ఈ రికార్డు ధర దక్కింది.
అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన డోన్యి పోలో టీ ఎస్టేట్‌ నుంచి సేకరించిన గోల్డెన్‌ నీడిల్స్‌ టీ రకం కేజీ ప్యాక్‌కు ఈ మొత్తం ధర పలికినట్లు గువాహటి టీ ఆక్షన్‌ కొనుగోలుదారుల సంఘం కార్యదర్శి దినేశ్‌ బిహానీ ఓ ప్రకటనలో వెల్లడించారు. జులైలో నిర్వహించిన వేలంలో అసోం టీ రకం కేజీ రూ.39,001ను పలకగా.. ఆ రికార్డును ఇది అధిగమించింది.

ఇలాంటి టీ రకాలు మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తాయని, ఉత్పత్తిదారులు సైతం ముందుకొస్తారని దినేశ్‌ చెప్పారు. ఇలాంటి టీ రకాలు ప్రపంచ పటంలో మన దేశ కీర్తిని ఇనుమడింపజేస్తాయని పేర్కొన్నారు. గోల్డెన్‌ నీడిల్స్‌ రకం తేయాకు చెట్ల నుంచి మొగ్గలను, ఆకులను చాలా జాగ్రత్తగా వేరుచేస్తారు. వీటి ఆకులు బంగారు రంగు పూత కలిగి మృదువుగా ఉంటాయి. వీటిని మరిగించగా వచ్చే ద్రవం కూడా బంగారు వర్ణంలో సువాసనతో ఉంటుందని దినేశ్‌ తెలిపారు.

ఈ టీ రకాన్ని ఆన్‌లైన్‌ వేదిక ‘అబ్సల్యూట్‌టీ.ఇన్‌’ ద్వారా విక్రయిస్తామని అస్సాం టీ ట్రేడర్స్‌ అధిపతి లలిత్‌కుమార్‌ జలాన్‌ తెలిపారు. కాగా, గతంలో సిల్వర్‌ నీడిల్స్‌ వైట్‌ టీ రకాన్ని కేజీ రూ.17,001 విక్రయించినట్లు డోన్యి పోలో టీ ఎస్టేట్‌ మేనేజర్‌ మనోజ్‌ కుమార్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న