close

వార్తలు / కథనాలు

టైప్‌రైటరే కుంచెగా.. చిత్రాలు చూడచక్కగా..

టైప్‌రైటరే కుంచెగా.. చిత్రాలు చూడచక్కగా..

ముంబయి: చిత్రకారుడి కుంచె నుంచి జాలువారే అద్భుత చిత్రాలు ఎన్నెన్నో చూశాం. సముద్ర తీరంలో ఇసుక తిన్నెల నుంచి రూపుదిద్దుకునే సైకత శిల్పాలు చూసి అబ్బురపడ్డాం. ఇంకా కొందరు కళాత్మక హృదయులు బియ్యపు గింజపై, సుద్దముక్కపై అద్భుతమైన చిత్రాలు చెక్కుతుంటారు. వీరందరి కంటే ప్రత్యేకం ఈ చంద్రకాంత్‌ భిడే. అక్షరాలు అచ్చువేసే టైప్‌రైటర్‌నే కుంచెగా మలుచుకుని ఎన్నో చిత్రాలు గీస్తున్నారు చంద్రకాంత్‌.

ముంబయికి చెందిన చంద్రకాంత్‌ ఓ బ్యాంక్‌ ఉద్యోగి. కళలపై మక్కువతో ఆయన ఆర్ట్‌స్కూల్‌కు వెళ్లి ఓ మంచి పెయింటర్‌ అవ్వాలని అనుకున్నారు. అయితే కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించలేదు. దీంతో స్టెనోగ్రఫీ నేర్చుకోవాల్సి వచ్చింది. అలా బ్యాంకు ఉద్యోగం సాధించారు. 1967లో ఒకరోజు చంద్రకాంత్‌ బాస్‌ ఆయనను తమ బ్యాంకులోని సిబ్బంది ఇంటర్‌కమ్‌ ఫోన్‌నంబర్లను టైప్‌ చేసుకుని తీసుకురమ్మన్నారు. అప్పుడు ఆయన ఆ నెంబర్లను టెలిఫోన్‌ మాదిరిగా టైప్‌చేసి తీసుకెళ్లారు.

టైప్‌రైటరే కుంచెగా.. చిత్రాలు చూడచక్కగా..

అప్పుడే తనలోని నైపుణ్యాన్ని గుర్తించారు చంద్రకాంత్‌. టైప్‌రైటర్‌తోనే చిత్రాలు ఎందుకు గీయకూడదు అనుకుని దానిమీద ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎందరో ప్రముఖుల చిత్రాలను టైప్‌రైటర్‌ ద్వారా గీశారు. ‘ఇప్పటివరకు 150 చిత్రాలు టైప్‌రైటర్‌తో గీశాను. మహాత్మాగాంధీ, జవహార్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఛార్లీ ఛాప్లిన్‌, అమితాబ్‌బచ్చన్, సచిన్‌ తెందుల్కర్‌, బ్రయన్‌ లారా.. ఇలా ఎందరో గొప్ప గొప్పవారి చిత్రాలను తయారుచేశాను. వినాయక చవితి సందర్భంగా ఎక్స్‌ అనే అక్షరంతో గణేశ్ విగ్రహాన్ని గీశాను. కేవలం 15 నిమిషాల్లోనే గణేశ్‌ రూపాన్ని గీయడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నా చిత్రాలతో 12 ప్రదర్శనలను ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు చంద్రకాంత్‌.

30ఏళ్లుగా ఒకే టైప్‌రైటర్‌పైనే..

గత 30ఏళ్లుగా ఒకే టైప్‌రైటర్‌పై ఈ చిత్రాలను గీస్తున్నట్లు చెప్పారు చంద్రకాంత్‌. బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసినప్పుడు ఈ టైప్‌రైటర్‌ను బ్యాంకు యాజమాన్యం తనకు బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్రాలను గీయాలని ఉందని చంద్రకాంత్‌ చెప్పారు. 

 


Tags :

మరిన్ని