close

వార్తలు / కథనాలు

ఆ ప్రాంతంలో దీపావళి జరుపుకోరు.. ఎందుకంటే

ఆ ప్రాంతంలో దీపావళి జరుపుకోరు.. ఎందుకంటే

చెన్నై: దేశంలో టపాసుల క్రయవిక్రయాలను నిషేధించే అంశంపై సుప్రీం కోర్టు సమతూకాన్ని పాటిస్తూ మంగళవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అటు టపాసుల తయారీదారుల పొట్టకొట్టకుండానే.. ఇటు పౌరుల ఆరోగ్యాన్నీ పరిరక్షించేలా నిర్ణయం వెలువరించింది. పర్యావరణానికి నష్టం కలిగించే టపాసులను నిషేధిస్తూ.. తక్కువ కాలుష్యం కలిగించే వాటిని మాత్రమే వినియోగించేందుకు ప్రజలకు అనుమతినిచ్చింది. దీపావళి, ఇతర పండుగలకు రెండు గంటలపాటు.. అర్ధరాత్రి సమయంలో ఉండే క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలకు 35నిమిషాల పాటు టపాసులు కాల్చవచ్చని స్పష్టం చేసింది. అయితే భారీ మోతాదులో రసాయనాలతో కూడిన టపాసులను కాల్చడం వల్ల మానవాళితో పాటు అటు జంతుజాలం కూడా తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని తమిళనాడులోని శివగంగ జిల్లావాసులు కొన్ని సంవత్సరాలుగా దీపావళి జరుపుకోవడమే మానేశారట. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడం మానేసి.. నిశ్శబ్ద దీపావళిని జరుపుకొంటూ అక్కడికి వచ్చే వలస పక్షులను సంరక్షిస్తున్నారట.

తమిళనాడులోని శివగంగ జిల్లాలోని కొల్లుకుడిపట్టి, సింగాంపునారి ప్రాంతాలకు ఉత్తర భారతదేశం, సైబీరియా, న్యూజిలాండ్‌ నుంచి అక్టోబరు-నవంబరు మాసాల్లో కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయి. వీటిలో కొంగలు, చెరువు కాకులు వంటి వివిధ రకాలు పక్షులున్నాయి. ఇవి మార్చి వరకూ ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు అయ్యేంత వరకూ ఉంటాయి. ఈ క్రమంలో టపాసుల కారణంగా ఆ పక్షుల జీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ ప్రాంతవాసులు నిశ్శబ్ద దీపావళి జరుపుకొంటున్నట్లు వారు పేర్కొన్నారు. చిన్నారులు కూడా వలస పక్షుల సంరక్షణ దృష్ట్యా తమ నివాస ప్రదేశాల నుంచి దూరంగా రెండు కిలోమీటర్ల వరకూ వెళ్లి మరీ టపాసులు కాలుస్తారట.

ఆ ప్రాంతంలో దీపావళి జరుపుకోరు.. ఎందుకంటే

మరోవైపు కోయంబత్తూరులోని కిట్టంపలాయం అనే మరో ప్రాంతంలో పురాతన కాలం నాటి ఓ చింతచెట్టు ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల కొద్ది గబ్బిలాలు అక్కడికి వలస వస్తుంటాయి. వాటి నివాసానికి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ ప్రాంతవాసులు టపాసులు కాల్చడమే మానేసినట్లు పేర్కొన్నారు. పక్షులు ప్రకృతికి ఎంతో తోడ్పాటునందిస్తాయని.. నీటిని శుభ్రంగా ఉంచుతూ, వ్యవసాయం దిగుబడి పెంచుతాయని వారి నమ్మకం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న