close

వార్తలు / కథనాలు

ఒకప్పుడు ఉగ్రవాది.. ఇప్పుడు వీర జవాన్‌

ఒకప్పుడు ఉగ్రవాది.. ఇప్పుడు వీర జవాన్‌

శ్రీనగర్‌: ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన జవాను లాన్స్‌ నాయక్‌ నజీర్ అహ్మద్ వనీ ఒకప్పుడు ఉగ్రవాది. ఎంతో మంది ప్రాణాలు తీశాడు. మరెంతోమందిని తీవ్రంగా గాయపర్చాడు. 90ల నాటికాలంలో ఉగ్రవాదంలో తన దూకుడు చూపించిన నజీర్‌‌.. తర్వాత తన మనసు మార్చుకున్నాడు. ఉగ్రవాదుల చేతిలో హతమైన ఓ జవాను కుటుంబసభ్యుల ఆవేదనను కళ్లారా చూసిన‌ తర్వాత అతనిలో మార్పు వచ్చింది. దీంతో అతనే స్వయంగా జవాన్ల ముందు లొంగిపోయాడు. తర్వాత ఆర్మీలో చేరాలన్న తన అభీష్టాన్ని వారిముందుంచాడు. దీంతో కొద్ది రోజులకే ఆర్మీ జవాను అవతారం ఎత్తాడు.

2004లో జవానుగా చేరిన నజీర్‌‌..అప్పట్నుంచి ఎన్‌కౌంటర్‌లలో పాల్గొనడం ప్రారంభించాడు. ఎన్నో ఎన్‌కౌంటర్‌లలో పాల్గొని ఉగ్రవాదుల పని పట్టాడు. కొద్ది రోజుల్లోనే చురుకైన జవానుగా పేరుతెచ్చుకున్న నజీర్‌‌.. 2007 ఆగస్టులో సేనా పతకాన్ని పొందాడు. కుల్గాంలోని చెకి అష్ముజి అనే గ్రామానికి చెందిన ఈయన ఎక్కువగా ఆ ప్రాంతంలో జరిగే ఎన్‌కౌంటర్లలో పాల్గొనడం గమనార్హం. ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నజీర్‌ వైద్యం అందించేలోపే అమరుడయ్యారు. మృతదేహంపై త్రివర్ణపతాకం కప్పి సొంత గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడే అంత్యక్రియలు చేశారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

దీనిపై ఆర్మీ ఆఫీసర్‌ మాట్లాడుతూ..‘ నజీర్‌ చాలా ధైర్యవంతుడు. తెగింపుకలిగిన వ్యక్తి. ఎన్నో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి జవానుగా మారి సేవలందించడం అభినందించాల్సిన విషయం’ అని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న