close

వార్తలు / కథనాలు

ఈ క్యాబ్‌లో... డ్రైవింగ్‌కీ ఓ మెనూ ఉంది!

మెనూతో మెప్పిస్తున్న ఉబర్‌ డ్రైవర్‌

వాషింగ్టన్‌లోని ఓ ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ జార్జి యురె తన కస్టమర్లకు మెనూ తయారు చేసి వారికి ఎలాంటి రైడ్‌ కావాలో ఎంపిక చేసుకోమంటున్నాడు. లూయిస్‌ ఆర్గ్యుజో అనే ప్రయాణికుడు ఆ మెనూను ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌ అయ్యింది. పోస్ట్ చేసిన వెంటనే ఐదు లక్షలకుపైగా లైకులు, లక్షకుపైగా రీట్వీట్‌లు చేశారు. డ్రైవర్ యురె ఆలోచన విధానాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. నేను పోస్ట్‌ చేసిన చిత్రం స్వల్ప వ్యవధిలో పెద్ద సంఖ్యలో మన్ననలు పొందుతుందని అనుకోలేదని లూయిస్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంత ప్రచారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని క్యాబ్‌ డ్రైవర్‌ యురె ఆనందపడ్డాడు.యురె ఐదు అంశాలతో మెనూ తయారు చేశాడు. వాటి నుంచి ప్రయాణికుడు ఒకదానిని ఎంచుకుంటే అలానే ప్రవర్తిస్తాడు యురె. అయితే ప్రయాణికులు ఎక్కువగా రెండింటిని మాత్రమే కోరుకునే వారట. ఆ ఐదు ఏంటో చూద్దామా!

స్టాండ్‌ అప్‌:

కారులో ప్రయాణం నవ్వుతూ సరదాగా సాగిపోవాలని కోరుకుంటున్నారా... అయితే ఇది అద్భుతమైన రైడ్‌. ఈ ప్రయాణం కోరుకున్న వారికి యురె నవ్వు తెప్పించే కథలను చెబుతాడు. ప్రయాణంలో మాట్లాడే అలవాటు ఉన్నవారికి ఇది చాలా బాగా ఉంటుందంటున్నాడు యురె.

సైలెంట్‌ రైడ్‌:

మీరు కారు ఎక్కగానే ‘ఆ పాటలు ఆపేయ్‌ బాస్‌..’ ఆ ‘విండోస్‌ క్లోజ్‌ చేయ్‌ హారన్‌ శబ్దాలొస్తున్నాయి’ అని అంటుంటారు. మీ లాంటివారి కోసమే ‘ది సైలెంట్‌ రైడ్‌’. దీన్ని ఎంచుకుంటే యురె కారులో ఏమీ మాట్లాకుండా, పెద్దగా శబ్దాలు చేయకుండా నడుపుతాడు.

థెరపీ రైడ్‌:

‘నేను మాట్లాడేటప్పడు నీ చెవులు మాత్రమే వినాలి...’ అని అదేదో సినిమాలు హీరో డైలాగ్‌ చెప్పినట్లు మీరూ అంటుంటారా? అయితే యురె దగ్గర ‘థెరపీ రైడ్‌’ ఎంచుకోవచ్చు. ఈ రైడ్‌తో ప్రయాణించాలనుకునే వారు యురెతో మాట్లాడుతూ ఉండొచ్చు. వారు చెప్పింది వింటూ ఉంటాడు డ్రైవర్‌.

క్రీపి రైడ్‌:

‘ముందుకు చూసి నడుపు.. మాట్లాడుతూ అటుఇటూ చూస్తావేం’. చాలామంది డ్రైవర్‌తో ఇలానే అంటుంటారు. మీరూ ఒకటి రెండుసార్లు అని ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా యురె ‘క్రీపీ రైడ్‌’ ఆప్షన్‌ కూడా ఇచ్చాడు. ఇది ఎంచుకుంటే యురె అద్దంలో ప్రయాణికులను గమనిస్తూ సంభాషణలు కొనసాగిస్తాడు.

రూడ్‌ రైడ్‌:

కొంతమంది క్యాబ్‌ తమ సొంతదైనట్లు.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. అలాంటివారు ‘రూడ్‌ రైడ్‌’ ఎంపిక చేసుకోవచ్చు. ఈ రైడ్‌ కోరుకునే వారు డ్రైవర్‌ అనుమతి తీసుకుని వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. దీన్ని కోరుకున్న వారికి సంస్కారం, సభ్యత అనేవి అడ్డురావు. వీటన్నింటిలో ది సైలెంట్‌ రైడ్‌, ది స్టాండప్‌ రైడ్‌లను ఎక్కువ మంది ప్రయాణికులు కోరుకుంటున్నారని యురె తెలిపారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న