close

వార్తలు / కథనాలు

సులభంగా పెడితే.. సులువుగా దొరికేస్తారు

‘దయచేసి వినండి... దయచేసి వినండి.. ’ అంటూ రైల్వే స్టేషన్‌లో రైళ్ల గురించి ఓ ప్రకటన వినిపిస్తుంటుంది. ఇది మీ రైలు ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము ఇదే తరహాలో చెప్పేది ఆన్‌లైన్‌లో మీ వ్యక్తిగత సమాచారం చోరీ అవకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు అంతర్జాతీయ పాస్‌వర్డ్‌ డే సందర్భంగా పాస్‌వర్డ్‌ భద్రతకు సంబంధించి కొన్ని చిట్కాలు మీకోసం..

ఎంత పెద్దగా ఉంటే...

హ్యాకర్లు మీ అకౌంట్‌ను హ్యాక్‌ చేయడానికి అనేక పద్ధతులు పాటిస్తారు. మొదట మీ పేరు, తదితర ప్రాథమిక అంశాలను పరిశీలించి.. ఊహించి పాస్‌వర్డ్‌లను టైప్‌ చేసి ప్రయత్నిస్తారు. ‘బ్రూట్‌ ఫోర్స్‌ అటాక్‌’ అనేది మరో పద్దతి. ఇది ఒక కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌. దీని ద్వారా పదాలు, సంఖ్యలు, సింబల్స్‌ను కలిపి వీలైనన్నీ పాస్‌వర్డ్‌లను రూపొందించి మీ అకౌంట్‌కు ఉన్న పాస్‌వర్డ్‌ను కనిపెట్టే అవకాశముంది. అలా జరగకూడదంటే.. మీరు మీ పాస్‌వర్డ్‌ను వీలైనన్ని ఎక్కువ అక్షరాలు, సంఖ్యలు, సింబల్స్‌తో పెద్ద పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడం మంచిది.

 

ఎవరికి అర్థం కానీ

చాలా మంది తమ పేర్లు, పుట్టిన రోజు, లేదా 12345 అంటూ సాధారణ పాస్‌వర్డ్‌లు పెడుతుంటారు. దీని వల్ల హ్యాకర్లు చాలా సులభంగా పాస్‌వర్డ్‌ను కనిపెట్టేస్తారు. అందుకే ఎవరూ గ్రహించ లేకుండా అర్థం లేని, క్రమం లేని పదాలను, సంఖ్యలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోండి.. దాన్ని మీరు మాత్రమే గుర్తుంచుకుంటే చాలు.. ఇంకెవరు ఆ పాస్‌వర్డ్‌ను కనిపెట్టలేరు. కేవలం పదాలతోనో, సంఖ్యలతోనో పాస్‌వర్డ్‌ పెట్టుకోవడమూ ప్రమాదమే.. చాలా తొందరగా పాస్‌వర్డ్‌ క్రాక్‌ అయ్యే అవకాశముంటుంది. అదే పదాలు, సంఖ్యలు, సింబల్స్‌, ఒక అక్షరం లోయర్‌కీ (స్మాల్‌ లెటర్‌), ఒక అక్షరం అప్పర్‌ కేస్‌ (బిగ్‌ లెటర్‌/క్యాపిటల్‌ లెటర్‌) ఇలా వైవిధ్యంగా ఉంటే పాస్‌వర్డ్‌ భద్రంగా ఉన్నట్టే.

 

పెట్టిన పాస్‌వర్డ్‌

హ్యాకర్లు ఇప్పటికే ఎన్నో మెయిళ్లను, పాస్‌వర్డ్‌లను దొంగలించి ఉంటారు. కాబట్టి మీరు గతంలో పెట్టుకున్న పాస్‌వర్డ్‌ను మళ్లీ కొత్త వాటికి పెట్టకండి. దీని ద్వారా హ్యాకర్లు సులభంగా మీ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి దుర్వినియోగపరిచే అవకాశముంది. ఆన్‌లైన్‌లో పాస్‌వర్డ్‌ మేనేజర్లు చాలా ఉన్నాయి. ఉచితంగా లభించేవి చాలా తక్కువ. కాస్త ఖర్చయినా పెయిడ్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్లలో మీ పాస్‌వర్డ్‌లు భద్రంగా ఉంటాయి. ఇవి మీరు పెట్టుకున్న పాస్‌వర్డ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేసి భద్రపరుస్తాయి. మీ విలువైన సమాచారాన్ని భద్రపర్చుకోవాలంటే అవసరం ఉన్నా లేకున్నా అప్పుడప్పుడు పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండండి. ఎక్కడ లాగిన్‌ అయినా పని పూర్తవగానే లాగవుట్‌ కావడం మర్చిపొవద్దు.

 

గోప్యంగా ఉంచడం

చాలా మంది చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అన్నది చూడకుండానే పాస్‌వర్డ్‌ను టైప్‌ చేస్తుంటారు. ఇది అంత మంచిదికాదు. మీరు వీలైనంత గోప్యంగా పాస్‌వర్డ్‌ను వినియోగంచండి. ఎవరికి చెప్పొద్దు. అందరికి తెలిసేలా రాసిపెట్టడం.. పాస్‌వర్డ్‌ను సూచించేలా వస్తువులు పెట్టడం లాంటివి చేయకూడదు. అలాగే పబ్లిక్‌ వైఫై వినియోగిస్తున్నప్పుడు ఏ వెబ్‌సైట్లు, యాప్స్‌లో లాగిన్‌ అవకుండా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే పబ్లిక్‌ వైఫై లక్ష్యంగా హ్యాకర్లు దాడి చేస్తుంటారు. ఎవరైనా ఈ వైఫైను ఉపయోగిస్తూ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తే అది హ్యాకర్లకు తెలిసిపోతుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని