close

వార్తలు / కథనాలు

71 రోజులు.. 1500 కిలోమీటర్లు

ఆసుపత్రి కోసం యువకుడి సంకల్పం

71 రోజులు.. 1500 కిలోమీటర్లు

భువనేశ్వర్‌: హామీలు ఇవ్వడం.. మర్చిపోవడం రాజకీయ నాయకులకు రివాజు. కానీ, ‘ఈ రాజకీయ నాయకులెప్పుడూ ఇంతే’ అని అందరిలా ఆ యువకుడు నిట్టూర్చలేదు. హామీ ఇచ్చి మర్చిపోతే జ్ఞాపకం చేయడం తన బాధ్యత అనుకున్నాడు. అందుకు ఎవరూ చేయని సాహసం చేశాడు. చివరికి దిల్లీ పెద్దలను కదిలించాడు. దేశం దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ ఎవరా యువకుడు? ఏం చేశాడు?

ఒడిశా రాష్ట్రం, సుందర్‌గఢ్‌ జిల్లా రూర్కెలా పట్టణానికి చెందిన ముక్తికంఠ బిశ్వాల్‌ బొమ్మలు తయారు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తన ఊరిలోని ఇస్పాత్‌‌ జనరల్‌ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా చూడాలనేది అతని ఆకాంక్ష. 2014లో ప్రధాని మోదీ ఆ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తానని హామీ ఇచ్చారట. అందుకే తాను మోదీకి ఓటేశానని చెబుతాడు. అయితే, ఆ హామీని నెరవేర్చకపోవడంతో ఆయన్ని ఎందుకు ప్రశ్నించకూడదనేది బిశ్వాల్‌ భావించాడు. దానికి కొనసాగింపుగా మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. బొమ్మలు చేసుకుని బతికే తాను ప్రధానిని ఎలా ప్రశ్నించగలను? నేను ప్రశ్నిస్తే ఎవరు వింటారు? అనుకున్నాడు బిశ్వాల్‌.

ఆ ప్రశ్నల్లోంచే జవాబును వెతుక్కున్నాడు. నేరుగా ఆయన్ని కలిసి ప్రశ్నిస్తేనే ఉపయోగముంటుందని తెలుసుకున్నాడు. సాధారణంగా మోదీని కలిసే అవకాశం రాదని అతనికీ తెలుసు. అందుకే తన మిత్రుడి సూచన మేరకు కాలినడకన తన ఊరి నుంచి దిల్లీ వెళ్లి మోదీని కలుసుకోవాలని సంకల్పించాడు. 1500 కిలోమీటర్లు నడిచి వెళ్తానని కుటుంబ సభ్యులనడిగితే.. ‘అంతదూరం నడిస్తే బతుకుతావా..? వద్దు’ అన్నారు. ఊర్లో వాళ్లంతా పిచ్చోడని నవ్వుకున్నారు. కానీ వాళ్లెవరికీ చెప్పకుండానే 2018 ఏప్రిల్‌ 15న బిశ్వాల్‌ నడక ప్రారంభించాడు. మార్గ మధ్యంలో దట్టమైన ఝార్ఖండ్‌ అడవులు దాటాడు. దాబాల్లో పడుకున్నాడు. ఎంతో మందిని కలిశాడు. వారందరికీ తన ఆకాంక్ష చెప్పుకొన్నాడు. వారణాసిలో జనం తప్పుడు దారి చూపడంతో 250 కిలోమీటర్లు అదనంగా నడిచాడు. ఆగ్రాలో అనారోగ్యం పాలయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతను మీడియా దృష్టిలో పడ్డాడు.

సాయం కాదు.. రాజకీయం..!
ఆగ్రా మీడియా బిశ్వాల్‌పై కథనాలు ప్రచురించడంతో అతను కాంగ్రెస్‌ దృష్టిలో పడ్డాడు. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సూచన మేరకు కాంగ్రెస్‌ పార్టీ విరాళాల ద్వారా రూ.20 లక్షల నిధులు సేకరించింది. బిశ్వాల్‌ ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రధాని మోదీకి ఆ మొత్తం అందించాలని ప్రయత్నించింది. హామీలు నెరవేర్చడంలో భాజపా విఫలమైందని, రూర్కెలా ఆసుపత్రికోసం తాము నిధులు సేకరిస్తున్నామని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జూన్‌లో ట్వీట్‌ చేశారు. దీనికి ప్రతిగా స్పందించిన ఒడిశాకు చెందిన భాజపా నాయకుడు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కాంగ్రెస్ మరో అబధ్ధాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకుందన్నారు. రాహుల్‌కు నిజాలెప్పుడూ కనిపించవని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆసుపత్రికోసం రూ.200కోట్లు ఇప్పటికే కేటాయించిందని, దానికి సంబంధించిన పూర్తి నివేదిక సిద్ధమైందని తెలిపారు. ‌తన దీక్షను రాజకీయం చేయొద్దని బిశ్వాల్‌ కోరాడు. ‘రాహుల్‌ గాంధీ నాకు చెప్పి దిల్లీ వరకూ నడిపించారని ప్రజలనుకుంటారు. ఇవన్నీ రాజకీయ గిమ్మిక్కులే.. ఏ పార్టీకి చెందిన ప్రభుత్వమూ మా జిల్లాకు ఏమీ చేయలేదు. అందుకే నేను ఒంటరిగానే పోరాడేందుకు నిర్ణయించుకున్నాను’ అని బిశ్వాల్‌ స్పష్టం చేశాడు.

ఆసుపత్రిలేక అవస్థలు పడుతున్నాం అందుకే దీక్ష...
రూర్కెలా చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఇస్పాత్‌‌ జనరల్‌ ఆసుపత్రిపైనే ఆధారపడతారని, అరకొర సౌకర్యాలతో ఆసుపత్రిలో వారికి వైద్యం సరిగా అందటంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు బిశ్వాల్‌. డబ్బున్నవారు కటక్‌కీ, భువనేశ్వర్‌కీ వెళ్తారని, మిగతా వాళ్లకు చాలా ఇబ్బందులున్నాయని అన్నాడు. ‘2014 పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా మా దగ్గరికొచ్చినప్పుడు అప్పటి భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ రూర్కెలా జనరల్‌ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఆయన ప్రధానిగా ఎన్నికైన తరువాత 2015లో కూడా ఆయన మా దగ్గరికొచ్చారు. ‘నేను మీకు హామీ ఇచ్చినప్పుడు ప్రధానిని కాను.. మీ ఓట్ల వల్లే ఇప్పుడు ప్రధానినయ్యాను. నేనిచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నా అని మీకు చెప్పడానికే ఇప్పుడు మీ దగ్గరికొచ్చాను. నేనిచ్చిన హామీ ప్రకారం ఇస్పాత్‌‌ జనరల్‌ ఆసుపత్రిని వైద్య కళాశాలగా, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చేందుకు మా ప్రభుత్వం నిర్ణయించింది’ అని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. అందుకే ఆయన్ని ప్రశ్నించేందుకు నిర్ణయించుకున్నా’ అని బిశ్వాల్‌ చెప్పాడు.

ఈసారి స్నేహితులతో మళ్లీ వస్తా..
71 రోజుల పాటు ప్రయాణం సాగిన తరువాత బిశ్వాల్‌ దిల్లీ చేరుకున్నాడు. ఓ రోజు జన్‌పథ్‌లో ధర్నాకు కూర్చున్నాడు. తరువాత రామ్‌లీలా మైదానంలో నిరశన దీక్షలో కూర్చున్నాడు. జూలై 5న దిల్లీ పోలీసులు తనను అరెస్టు చేశారని, దీక్ష బలవంతంగా విరమింపజేశారని బిశ్వాల్‌ చెప్పాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అతను ప్రధానిని కలవకుండానే భువనేశ్వర్‌కు ఖాళీ చేతుల్తో వెనుదిరిగాడు. తిరిగొచ్చాక బిశ్వాల్‌కు ఘన స్వాగతం లభించింది. ఊరికోసం బిశ్వాల్‌ చేసిన సాహసాన్ని అందరూ పొగుడుతున్నారు. అతనిప్పుడు వాళ్ల ఊరికి హీరో అయిపోయాడు. ‘నేను ఒంటరిగా దిల్లీ వచ్చి తప్పు చేశాను. బలవంతంగా నా ఆమరణ దీక్షను భగ్నం చేశారు. అయినా ఎంతో కొంత విజయం సాధించినట్లే భావిస్తున్నా. నా లక్ష్యాన్ని సాధించేందుకు నా స్నేహితులతో మళ్లీ దిల్లీ వస్తా’ అని బిశ్వాల్‌ అంటున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు