
వార్తలు / కథనాలు
ప్రస్తుత కరోనా కాలంలో శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఔషధ గుణాలున్న తేనె చాలా అవసరం. ఎన్నో పోషకాలు ఉన్న తేనెను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి తేనెతో చేకూరే లాభాలు ఏంటో మనమూ ఓసారి చూద్దామా..
చర్మ సౌందర్యానికి...
చర్మ సౌందర్యానికి తేనె చాలా చక్కగా పని చేస్తుంది. చక్కెర, నిమ్మ రసంతోపాటు తేనెను కలిపిన మిశ్రమాన్ని దూదితో ముఖానికి పట్టించాలి. కొంతసేపటి తర్వాత కడిగేస్తే చర్మం నిగనిగలాడుతుంది. తేనీరులో కానీ, గోరువెచ్చని నీటిలో ఓ స్పూను తేనె కలుపుకొని తాగితే వాతం చేయకుండా ఉంటుంది.
చక్కెరకు ప్రత్యామ్నాయంగా...
సాధారణంగా టీ, కాఫీలలో చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర కలిపిన తేనీరును సేవించలేరు. అలాంటి వారి కోసం తేనె వాడటం చాలా మంచిది. ఎలాంటి వారైనా తేలిగ్గా తీసుకోగలిగిన తేనెను చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అలాగే కుకీలు, కేక్‌లు, పేస్ట్రీల తయారీకి చక్కెర బదులు తేనెను వినియోగిస్తే మంచిది. తేనెతో తయారు చేస్తే ఇటు ఆరోగ్యానికి ఉపయోగంతోపాటు మిఠాయిలు భలే రుచిగా ఉంటాయి. 100 గ్రాముల తేనె పరిమాణంలో 300 కేలరీలు ఉంటాయి.
కంటికి చాలా మంచిది...
శ్వాస సంబంధమైన సమస్యలు ఉంటే తేనెను సేవించడం వల్ల తగ్గించుకోవచ్చు. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఊపిరి తీసుకోవడానికి సహకరిస్తుంది. ఒక టీ స్పూన్ తేనె, స్పూన్లో ఎనిమిదో వంతు దాల్చిన చెక్క పౌడర్‌ను గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. క్యారెట్స్, ఆకు కూరలు తినడం వల్ల కంటి చూపుకు ఎంతో మేలు. అలానే తేనె కూడా చాలా మంచిది. క్యారెట్ జ్యూస్‌లో కాస్త తేనెను కలుపుకొని తాగితే కంటి చూపు మెరుగయ్యే అవకాశం ఉంది. తలలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్న వారు తేనె వాడితే సత్ఫలితాలు పొందుతారు. గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి జుట్టుకు పట్టించి మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. దీని వల్ల తలలో వచ్చే దురదలు, చుండ్రు తగ్గించుకోవచ్చు.
గాయానికి పూతగా తేనె
ప్రమాదవశాత్తూ శరీరంలో ఎక్కడైనా గాయమైతే వెంటనే పసుపు, టించర్, ఇతర ఆయింట్మెంట్ను పూస్తాం. తేనె కూడా యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. గాయం అయిన చోట కాస్త తేనెను అద్దితే బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. గాయం త్వరగా మానేందుకు దోహదం చేస్తుంది. అలర్జీల నుంచి రిలీఫ్‌ను ఇస్తుందని పలువురు నేచురోపతి వైద్యులు పేర్కొన్నారు. తేనెలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చక్కెరలు నేరుగా రక్త ప్రవాహంలో కలవడం ద్వారా సత్వర శక్తి శరీరానికి వస్తుంది. క్రీడాకారులకు తేనె అవసరం చాలా ఉంటుంది.
డైటింగ్ చేసేటప్పుడు..
డైటింగ్ చేసేవారు క్రమం తప్పకుండా గ్రీన్ టీ సేవిస్తూ ఉంటారు. గ్రీన్‌టీలో కాస్త తేనెను కలుపుకొని తాగితే ఎంతో మంచిది. మెటబాలిజమ్ (జీవక్రియ) సక్రమంగా పని చేయడంలో తేనె ఉపకరిస్తుంది. మీకు నిద్ర సరిగా పట్టడం లేదా..? అయితే తేనె సేవిస్తే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. తేనెలోని చక్కెరలు విడుదల చేసే సెరోటోనిన్ నిద్ర వచ్చేందుకు సాయపడుతుంది. అసందర్భంగా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఓ టీ స్పూన్ తేనెను సేవిస్తే మేలు. తేనెను తీసుకోవడం వల్ల ఎక్కిళ్లు కాసేపటికి ఆగిపోయే అవకాశం ఉంది.
ముఖారవిందం కోసం..
ఏదైనా ఫంక్షన్స్, బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఫేషియల్ చేయించుకుంటాం. అయితే వివిధ రకాల క్రీములను ముఖానికి పూసి ఫేస్ స్క్రబ్‌తో క్లీన్ చేస్తారు. అయితే ఫేస్ స్క్రబ్ అనేవి ఎక్కువగా రసాయనాలతో తయారు చేసినవే. తేనె మాత్రం సహజసిద్ధమైన యాంటీ బయాటిక్ కావడం వల్ల ముఖంపై ఉండే నిర్జీవ కణాలు, బ్యాక్టీరియాను వందశాతం తొలిగిస్తుంది. ఫేషియల్‌ను శుభ్రం చేసుకోవాలంటే కాస్త కొబ్బరి నూనెలో తేనెను కలిపి ముఖాన్ని రుద్దితే సరిపోతుంది. సహజ సిద్ధమైన ఫేస్ స్క్రబ్‌గా తేనె పని చేస్తుంది. అలాగే ముఖం మీద వచ్చే మచ్చలు తగ్గేందుకు తేనె చాలా ఉపయోగకరం. కాస్త తేనె, బేకింగ్ సోడాను పాలు, వేడినీటిలో కలుపుకొని స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా కనిపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
ఎన్నో రకాల నొప్పులకు మందు..
నెలలు నిండే కొద్దీ గర్భిణులకు నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారు మందులను వాడటం బదులు పాలలో తేనె కలుపుకుని తాగితే చాలా ఉపశమనంగా ఉంటుంది. అలానే ఉదయం, రాత్రి వేళల్లో వచ్చే కడుపు నొప్పికి తేనె బాగా పనిచేస్తుంది. స్వచ్ఛమైన తేనెను సేవించడం వల్ల డయేరియా, గ్యాస్ సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. అల్లంతో కలిపి తేనెను వాడితే చాలా మంచిది. తేనెను ఆహారంలో భాగం చేసుకుంటే జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగు పడుతుంది. గొంతులో ఇబ్బందిగా ఉంటే కాస్త తేనెను వేసుకుంటే మందుల కంటే చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ సీ ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగితే ప్రయోజనం.