close

వార్తలు / కథనాలు

బాంబు విసిరారు.. కానీ పారిపోలేదు!

భగత్‌సింగ్‌ త్యాగం వెనుక అంతరార్థం

నేడు భగత్‌ సింగ్‌ 112వ జయంతి

భగత్‌ సింగ్‌.. కణకణ మండే నిప్పు కణిక. సామ్యవాద భావజాలాన్ని నరనరాన ఒంట బట్టించుకున్న సామాజిక విప్లవ వీరుడు. తెల్లవారికి వ్యతిరేకంగా దేశం కోసం ఆవేశంగా పోరాడి, ప్రాణాలొదిలిన కొదమ సింహం. 23 ఏళ్లకే నూరేళ్లు నిండినా, తన సిద్ధాంతాలను అజరామరం చేసిన మహనీయుడు. పిన్న వయసులోనే అంత పరిపక్వతతో వేసిన సాహసోపేతమైన అడుగు, దేశంలోని యువతను ఆంగ్లేయులపై పోరాడేలా పురికొల్పింది. ఆయన అసెంబ్లీపై బాంబు దాడి చేశాక, తప్పించుకొనే అవకాశమున్నా ఆ పని చేయకుండా పోలీసులకు లొంగిపోవడం వెనుక అంతరార్థం.. భగత్‌ సింగ్‌ విప్లవ భావానికి అద్దం పడుతోంది. నేడు భగత్‌ సింగ్‌ 112వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

సెంట్రల్‌ అసెంబ్లీపై దాడి
విప్లవకారుల చర్యలను అణచివేయాలనే ఉద్దేశంతో బ్రిటీష్‌ ప్రభుత్వం పోలీసులకు మరింత అధికారం ఇవ్వాలని సంకల్పించింది. ఇందుకోసం రెండు బిల్లులను తీసుకొచ్చింది. ప్రజా భద్రత బిల్లు, వాణిజ్య వివాద బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ప్రజాహితం కోసమేనంటూ వీటిని ఆమోదింపజేశారు. భగత్ సింగ్ వంటి విప్లవకారులకు ఇది మింగుడు పడని విషయం. ఆయనతోపాటు చంద్రశేఖర్‌ ఆజాద్‌, సుఖ్‌దేవ్‌ థాపర్‌ స్థాపించిన హెచ్‌ఆర్‌ఎస్‌ఏ బిల్లులను వ్యతిరేకించింది. దిల్లీలోని కేంద్ర అసెంబ్లీపై దాడి చేయాలని వ్యూహాం పన్నింది. 1929 ఏప్రిల్ 8న అసెంబ్లీ వసారాలపై భగత్‌ సింగ్, బతుకేశ్వర్‌ దత్‌ బాంబు విసిరారు. "ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్థిల్లాలి)’’ అని నినాదాలు చేశారు. అయితే ఈ దాడికి ప్రధాన ఉద్దేశం బిల్లును వ్యతిరేకించడం తప్ప మరే ఉద్దేశమూ లేదు. అందుకే భగత్ సింగ్‌ బాంబులను వసారాలో పడేలా విసిరాడు. దీనివల్ల ఏ ఒక్కరికీ హానీ కాలేదు. ఆ బాంబు కూడా గాయపరిచేంత శక్తివంతమైంది కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్స్ అధికారులు కూడా తేల్చారు. 

అనంతరం ‘బ్రిటీష్‌ ప్రభుత్వానికి వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామ’ని ముద్రించిన కరపత్రాలను భగత్‌ సింగ్‌, దత్‌ అక్కడ పడేశారు. ఇంకా కరపత్రంలో ‘‘వ్యక్తులను చంపడం సులభమైనప్పటికీ సిద్ధాంతాలను మాత్రం సమాధి చేయలేరు. గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయినా సిద్ధాంతాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి.’’ అని ఉంది. బాంబు విసిరిన అనంతరం భగత్‌ సింగ్‌కు అక్కడి నుంచీ పరారయ్యే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. ఇందుకు కారణం ఆయన నమ్మిన సిద్ధాంతమే! ఒకవేళ పారిపోతే సమాజం దృష్టిలో నేరం చేసి పరారీలో ఉన్న ముద్దాయిగా ముద్ర పడుతుందని భగత్‌ సింగ్‌ భావించారు. భగత్‌ సింగ్, దత్‌ లొంగిపోయేందుకు ఇదే కారణమని చరిత్రకారులు చెబుతారు.

1931లో ఉరి కొయ్య ఎక్కేముందు కూడా కుమారుడిని క్షమించమని భగత్ సింగ్ తండ్రి బ్రిటీష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు నిరాకరించాడు. ఈ సందర్భంగా టెరెన్స్ మాక్‌స్వినే మాటలను ఉటంకించాడు. ‘‘నా విడుదల కన్నా నా మరణం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం’’ అని చెప్పి, పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తండ్రికి సూచించాడు. తన మరణం యువతను ప్రేరేపించేలా ఉంటుందని, బ్రిటీష్‌ వారిపై సంఘటితంగా తిరగబడే శక్తి వారికి ఇస్తుందని భగత్‌ సింగ్‌ నమ్మాడు. ఆయన అనుకున్నట్టుగానే భగత్‌ సింగ్‌ త్యాగం ఎంతో మంది యువతను స్వాతంత్ర్యోద్యమం వైపు మళ్లేలా చేసింది. చివరికి తరతరాలు మారినా వన్నె తరగని సూర్యుడిలా మిగిలిపోయాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు