close

వార్తలు / కథనాలు

ఆహారం నమిలే తింటున్నారా?

ఇలా చేయకపోతే లావైపోతారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆహారాన్ని నమిలే తినండి.లేకపోతే లావైపోతారు’ అంటున్నారు నిపుణులు. నిజమే మరి! ప్రస్తుతం మనం నివసిస్తోంది యాంత్రిక యుగంలో. దీనికి తోడు సెడంటరీ జీవన విధానం పెరిగిపోతోందాయె!. భౌతికంగా కష్టపడే ఉద్యోగాలు, పనులు తగ్గిపోయి మానసికంగా శ్రమించే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తిపరమైన రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఇక తిండి విషయంలో అయితే హడావిడి పనే. ఉదయం, మధ్యాహ్న సమయాల్లో ఆహారాన్ని భారతీయులు వేగంగా తింటారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇది ఆరోగ్యానికి ముప్పని నిపుణులు చెబుతున్నారు. నమిలి తినే తీరిక లేక మింగేస్తుండటంతో జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువవుతున్నాయి.

అరుగుదల అక్కడి నుంచే..

తిన్న ఆహారం జీర్ణాశయం చేరాకే జీర్ణం కావడం మొదలవుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆహారం నోటిలోనే జీర్ణంకావడం ప్రారంభమవుతుంది. నోటిలోని అమైలేజ్‌, లైపేజ్‌ అనే ఎంజైమ్‌లు ఈపని చేస్తాయి. నోట్లోనే ఈ ఎంజైమ్‌లు జీర్ణక్రియను ప్రారంభిస్తాయి.

తేలికగా జీర్ణం కావడం కోసం...

ఆహారాన్ని నమిలి తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ నోటి నుంచే మొదలవుతుంది కాబట్టి ఆహారాన్ని బాగా నమలడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వెంటనే మెదడు కూడా ఉత్తేజం చెందుతుంది. జీర్ణక్రియలో మెదడుది సైతం కీలక పాత్రే. ఎలాగంటే ఉదాహరణకు మనకు ఎదురుగా ఆహారం ఉన్నప్పుడు దాన్ని వాసన చూసిన వెంటనే మెదడు ఉత్తేజమవుతుంది. వెంటనే నోట్లో సెలైవా విడుదల ప్రారంభం అవుతుంది. ఇందులో ఉన్న ఎంజైములు తీసుకున్న ఆహారన్ని జీర్ణం చేయడంలో తోడ్పడతాయి. అయితే తీసుకున్న ఆహారాన్ని ఎంత నమిలితే సెలైవా అంత బాగా విడుదల అవుతుంది. కాబట్టి ఆహారం కూడా తేలికగా జీర్ణం అవుతుంది.

వేగంగా తింటే లావైపోతారు...

సమయాభావం వల్లనో లేదా ఇంకేదయినా కారణం వల్ల ఆహారాన్ని వేగంగా తింటే నమలడానికి ఆస్కారం ఉండదు. ఫలితంగా జీర్ణానికి తోడ్పడే ఎంజైముల, ఆమ్లాల విడుదల మందగిస్తుంది. దీని వల్ల అసిడిసీ, అజీర్తి వంటివి సంభవించే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా వేగంగా తినడం వల్ల ఎక్కువ తినేసే ఆస్కారం లేకపోలేదు. దీని వల్ల శరీరానికి ఎంత అవసరమో అంతమాత్రమే ఉపయోగించుకుని మిగిలింది కొవ్వు రూపంలో శరీర భాగాల్లో పేరుకు పోతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక జబ్బులు బారిన పడే అవకాశం ఉంది.

పిల్లలకూ చెప్పాలి..!

చాలా మందికి ఆహారం నమిలే అలవాటు ఉండదు. అయితే దీన్ని క్రమంగా అలవాటు చేసుకోవాలంటే పక్కన సెల్‌ఫోన్లు, టెలివిజన్, మాట్లాడటం వంటి పద్ధతులను పక్కన పెట్టాలి. ఏం తింటున్నాం? ఎంత తీసుకుంటున్నాం? ఎలా తీసుకుంటున్నామనే లెక్కలు వేసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు ఆరు సార్లు గట్టిగా శ్వాస తీసుకోండి. దీనివల్ల శరీరం ఆహారం తీసుకోవాడానికి సన్నద్ధం అవుతుంది.ఫలితంగా మనం ఆదమరిచినప్పటికీ మన మెదడు మనకు గుర్తు చేస్తుంది. ఇదే అలవాటును పిల్లలకూ నేర్పించాలి.


Tags :

మరిన్ని