
వార్తలు / కథనాలు
భారీ కరవు దిశగా డ్రాగన్..?
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
చైనా ఏం చేసినా దానికో వ్యూహం ఉంటుంది.. పక్కాగా లెక్కుంటుంది.. గత వారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహార వృథాను తగ్గించుకోవాలని ప్రకటించారు. ఆహార వృథా సిగ్గుచేటని కఠిన వ్యాఖ్యలు చేశారు. జిన్‌పింగ్ చెప్పారంటే అక్కడ అది శిలాశాసనం. దీంతో దానిని అమలు చేయడం మొదలుపెట్టారు. దీని కోసం ఎన్-1 విధానం కూడా మొదలుపెట్టారు. అంతేకాదు ఫుడ్ యూట్యూబర్లపై ఆంక్షలు విధించారు. చాలా మంది చైనా అధికారులకు భయపడిపోయి తమ సామాజిక మాధ్యమాల్లోని వీడియోలను కూడా తొలగించడం మొదలుపెట్టారు. చైనాలో ఏదైనా ఉద్యమస్థాయిలో తీవ్రంగా అమలు చేస్తారు. దీంతో తాజాగా క్లీన్‌ప్లేట్ ఉద్యమం ఎటు పోతుందో అన్నది ఆందోళనకరంగా మారింది.
అసలు ఈ ‘క్లీన్‌ప్లేట్’ ఏమిటీ..?
ఆహార వృథాను అడ్డుకొనేందుకు తొలిసారి 2013లో ‘ఆపరేషన్ ఎమ్టీ ప్లేట్’ ప్రవేశపెట్టారు. అప్పట్లో సాధారణ ప్రజలకు కాకుండా అధికారులు.. ఇతర హైప్రొఫైల్ వ్యక్తులు మాత్రమే దీనిలో చేర్చారు. వీరు ఇచ్చే విందుల్లో ఆహార వృథా లేకుండా చూడాలనేది దీని లక్ష్యం. 2015లో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లెక్కల ప్రకారం 1.8కోట్ల టన్నుల ఆహారం చైనాలో వృథాగా పోతోంది. దీంతో దాదాపు 5 కోట్ల మందికి ఏడాదిపాటు ఆకలి తీర్చవచ్చు.
తాజాగా షీ జిన్‌పింగ్ వుహాన్‌లోని కేటరింగ్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ ఆహార వృథాను తగ్గించాలని ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ క్లీన్ ప్లేట్’ 2.0ను ప్రతిపాదించారు. ఈ సారి సాధారణ ప్రజలను కూడా దీనిలో భాగస్వాములను చేశారు. రెస్టారెంట్లలో ఎన్-1 విధానం ప్రవేశపెట్టమని చెప్పారు. ఒక గ్రూపుగా వచ్చే వారు ఆర్డర్లో ఒకరికి తగ్గించాలి. అంటే 10 మంది వెళితే 9 మందికి సరిపడా ఆర్డరే ఇవ్వాలి. అంతేకాదు.. కస్టమర్లకు అవసరమైన విధంగా చిన్నచిన్న మొత్తంలో కూడా ఆర్డర్లను స్వీకరించాలని నిర్ణయించారు. పాఠశాలల్లో విద్యార్థులకు కూడా దీనిని చిన్నప్పటి నుంచే నేర్పించాలని నిర్ణయించారు.
గతంలో కోట్ల మంది మరణం..
చైనాకు మావో నేతృత్వం వహిస్తున్న సమయంలో దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే మొండి పట్టుదలతో గ్రేట్ లీఫ్ ఫార్వర్డ్ విధానం ప్రవేశపెట్టారు. ఫలితంగా ఆహార పంటలు తగ్గడం.. దీనికి ప్రకృతి విపత్తులు తోడుకావడంతో కోట్ల మంది మరణించారు. చరిత్రలో మనిషి సృష్టించిన మహాకరవుగా ఇది నిలిచిపోయింది.
ఇంత అత్యవసరంగా దేనికి..?
చైనాలో ఈ సారి ఆహారధాన్యాల కరవు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు చైనాలో గతేడాదితో పోలిస్తే గోధుమల సేకరణ 20శాతం తగ్గినట్లు సమాచారం. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కరవు అంశాన్ని కొట్టిపారేసింది. 120 కోట్ల కిలోల ధాన్యం అదనంగా పండించామని పేర్కొంది. కానీ దేశంలో చాలా చోట్ల ఈ ఏడాది భారీగా వరదలు ముంచెత్తడంతో కొంత నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ది గార్డియన్ కథనం ప్రకారం వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. చైనా ఆహార అవసరాలను 30శాతం వరకు దిగుమతులే తీరుస్తాయి. మరోపక్క భారత్, వియత్నాంలు కరోనావైరస్ కారణంగా వరి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి.
ఆహార సంక్షోభం ఖాయమా..?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన కంటే ముందే గత నెలలో ఫోర్బ్స్ ఓ కథనం ప్రచురించింది. దీనిలో చైనా ఆహార సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల కాలంలో చైనాలో ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సప్లయ్‌లో ఒత్తిడిని ఎదుర్కొంటేనే ఈ విధంగా ధరలు పెరుగుతాయి. ఇటీవల కాలంలో యాంగ్జీ నదికి భారీగా వరదలు వచ్చాయి. చైనా భారీగా గోధుమలు ఉత్పత్తి చేస్తుంది. కానీ, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనే గత పదేళ్లలో ఎన్నడు లేనంతగా గోధుములను దిగుమతి చేసుకొంది. మరోపక్క మొక్కజొన్నల ధరలు కూడా చైనాలో భారీగా పెరిగాయి. చైనా రిజర్వులోని మొక్కజొన్నలను విక్రయించిందంటే ఉత్పత్తిలో కోతపడినట్లే కదా. అంతేకాదు గత కొన్ని నెలలుగా చైనా భారీ మొత్తంలో పందిమాంసం, సోయాబీన్, సోయా మీల్, గోధుమలు, మొక్కజొన్న, నిల్వ ఆహారంను దిగుమతి చేసుకుంది. చైనాలో ఆహార కొరత వస్తే దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధినాయకత్వం తొలి ప్రాధాన్యం కూడా ఆహార భద్రతే. అందుకే ఇప్పుడు ‘క్లీన్‌ప్లేట్ ’ ఉద్యమాన్ని మొదలుపెట్టింది.