close

వార్తలు / కథనాలు

సౌకర్యాల మధ్య సుఖమయ ప్రయాణం‌!

బుల్లెట్‌ రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు

పిల్లలకు ప్రత్యేక ఫీడింగ్‌ రూమ్‌.. పురుషులకు స్త్రీలకు వేర్వేరుగా వాష్‌రూమ్స్‌

సౌకర్యాల మధ్య సుఖమయ ప్రయాణం‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. సుమారు 67వేల కి.మీ. మేర భారతీయ రైల్వే విస్తరించి ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణ సాధనంగా భారతీయ రైల్వేలకు పేరుంది. అయితే, సౌకర్యాల కల్పనలో మాత్రం ఇతర దేశాల రైల్వే వ్యవస్థలతో పోలిస్తే ఆమడ దూరంలో నిలిచిపోయిందనే చెప్పాలి. బుల్లెట్‌ ట్రైన్‌ల గురించీ మనం ఇప్పుడిప్పుడే ఆలోచనలు చేస్తున్నాం. అయితే, ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, స్థల సేకరణలో భాగంగా ఇది కూడా మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి వేస్తోంది. వీలైనంత త్వరగా స్థల సేకరణ పూర్తి చేసి, ప్రాజెక్టును పూర్తి చేయాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.

ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యమైనా, అత్యాధునిక హంగులతో దీన్ని తీర్చిదిద్దాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ముఖ్యంగా ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాలని భావిస్తోంది. లక్ష కోట్లతో సిద్ధం చేయనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. భారత్‌లో జపాన్‌కు చెందిన ఈ5 సింకన్‌సేన్‌ రైళ్లను ఈ కారిడార్‌లో నడపనున్నారు. జపాన్‌ అందించే సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అనుగుణంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి. ఏయే ఏర్పాట్లు ఉండాలన్న దానిపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. అందుకు సంబంధించిన వివరాలు కొన్ని బయటకు వచ్చాయి.

జపాన్‌ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 25 ఈ5 సిరీస్‌ బుల్లెట్‌ ట్రైన్లను ఆ దేశం అందించనుంది. వీటి మొత్తం విలువ రూ.5వేల కోట్లు. ముంబయి-అహ్మదాబాద్‌ మార్గం 508 కి.మీ. కాగా, గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లను నడపాలని భావిస్తున్నారు. అంటే 2గంటల.. 7 నిమిషాల్లో ముంబయి నుంచి అహ్మదాబాద్‌ చేరుకోవచ్చు. మార్గం మధ్యలో 21 కి.మీ. భూగర్భం గుండా, 7కి.మీ. సముద్రంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ నుంచి భూగర్భం గుండా ప్రారంభమయ్యే రైలు 21కి.మీ. అనంతరం థానే వద్ద భూమిపైకి వస్తుంది. రైలు వేగం ప్రభావ ప్రయాణీకులపై పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఆగస్టు 15, 2022 నాటికి ఈ రైళ్లను నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సౌకర్యాల మధ్య సుఖమయ ప్రయాణం‌!

బుల్లెట్‌ట్రైన్‌లో ఏయే సౌకర్యాలు తీసుకురానున్నారంటే..

* పురుషులకు, మహిళలకు వేర్వేరుగా శౌచాలయాలు.
* పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది.
* అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు.
* బుల్లెట్‌ ట్రైన్‌లో మొత్తం 750 సీట్లు ఉంటాయి. విమానాల్లో ఉన్నట్లు ప్రతి రైలులో 55 సీట్లు బిజినెస్‌ క్లాస్‌కు కేటాయించనుండగా, 695 సీట్లను స్టాండర్డ్‌ క్లాస్‌కు కేటాయించనున్నారు. 
* ప్రయాణికులు తమ సామాగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు.
* బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌లో ప్రత్యేకంగా నడిపే ఈ5 సింకన్‌సేన్‌ సిరీస్‌ బుల్లెట్‌ రైళ్లలో పిల్లలకు కూడా ప్రత్యేక టాయ్‌లెట్‌ సీట్లను ఏర్పాటు చేయనున్నారు. 

సౌకర్యాల మధ్య సుఖమయ ప్రయాణం‌!

* ఇక చిన్న పిల్లల కోసం టేబుల్స్‌, డైపర్‌ డిస్పోజల్స్‌‌, చేతులు శుభ్రం చేసుకునేందుకు చిన్న వాష్‌ బేషిన్‌లను కూడా ఉంచనున్నారు.
* ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికులకు సైతం విడిగా టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
* పురుషుల కోసం ప్రత్యేక మూత్రశాలలను ఇందులో తీసుకురానున్నారు. టాయ్‌లెట్స్‌, మూత్రశాలలు విడివిడిగా ఉంటాయి. ఉదాహరణకు 1,3,5,7,9 కోచ్‌లలో టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేస్తే, 2, 4, 6, 8 కోచ్‌లలో మూత్ర శాలలు ఏర్పాటు చేస్తారు. 
* అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్‌ సీట్‌ రొటేషన్‌ సిస్టమ్‌ ఉంటుంది. దీని ద్వారా కుర్చీని ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. 
* ప్రతి కోచ్‌లోనూ ఎల్‌సీడీ ప్యానెళ్లను అమర్చనున్నారు. దానిపై ప్రస్తుత స్టేషన్‌, తర్వాతి స్టేషన్‌ గమ్యస్థానం ఇంకెంత దూరంలో ఉంది? ఎంత సమయానికి చేరుకుంటారు ఇలా ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి దానిపై చూపిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు