close

వార్తలు / కథనాలు

దొంగో..దొరో.. ఆ అద్దాలు చెప్పేస్తాయ్‌!

రైల్వే స్టేషన్లు, క్రీడా మైదానాలు, విమానాశ్రయాలు, జనావాసాల్లో దొంగలను గుర్తించడానికి పోలీసులు నానా అవస్థలు పడుతుంటారు. సంబంధిత ఫోటోను దగ్గర పెట్టుకొని వాళ్లకోసం వెతుకుతుంటారు. టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకోవడం వల్ల ఈ పని మరింత సులువుతుందని యూఏఈ ( యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)కి చెందిన ఎన్‌ఎన్‌టీసీ సంస్థ  చెబుతోంది. తాను అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన కళ్లద్దాలతో దొంగలను ఇట్టే కనిపెట్టొచ్చని చెబుతోంది. అదెలాగంటే..!

ఒక్కసెకెనులో 15 ముఖాలు..

ఎన్‌ఎన్‌టీసీ సంస్థ ఐ ఫాల్కన్‌ ఫేస్‌ కంట్రోల్‌ అనే ఓ ప్రత్యేక కళ్లజోడును అభివృద్ధి చేసింది. దీనిని ఓ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తారు. దాదాపు 10 లక్షల మంది వ్యక్తిగత వివరాలను డేటాబేస్‌లో నిక్షిప్తం చేసే వెసులుబాటు ఉంటుంది. దీనికి సంబంధించిన హార్డ్‌డిస్క్‌ను కళ్లద్దాలతో జత చేస్తారు. కళ్లజోడు 8 మెగాఫిక్స్‌ల్‌ సామర్థ్యం ఉన్న కెమెరా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. అటువైపుగా వెళుతున్న వ్యక్తులను మనం చూస్తే.. కెమెరా వారి ముఖాన్ని స్కాన్‌ చేసి డేటాబేస్‌లో ఉన్న వివరాలతో సరిపోలుస్తుంది. ఒక వేళ ఆ డేటాబేస్‌లో సదరు వ్యక్తి తాలుకు సమాచారం ఉంటే.. ఒక్క సెకెనులో ఆ వివరాలు కళ్లజోడుపై ప్రత్యక్షమవుతాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ పని చేయడానికి ఇంటర్నెట్‌ కనెక్షన్ కూడా అవసరం లేదు. సెకెను కాలంలో 15 మంది ముఖాలను గుర్తించే సామర్థ్యంతో ఈ డివైస్‌ను తయారు చేశారు. అయితే ప్రాంతాన్ని బట్టి ముఖాలను గుర్తించే వేగంలో కాస్తా వ్యత్యాసం కనిపించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఇప్పటి వరకు ఇలాంటి 50 జతల కళ్ల జోళ్లను తయారు చేశామని, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబిలోని పలు రక్షణ సంస్థలకు వీటిని ఇప్పటికే పంపిణీ చేశామని వారు చెబుతున్నారు. అయితే భద్రతా కారణాల రీత్యా కేవలం రక్షణ, న్యాయ విభాగానికి చెందిన సంస్థలకు మాత్రమే వీటిని విక్రయిస్తున్నారు. ఒకవేళ డేటాబేస్‌ వివరాల్లో తప్పులు దొర్లినట్లయితే నిరపరాధులను అరెస్టుచేసి వేధించే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని సామాజిక రక్షణకు, ఉగ్రవాదుల నిర్మూలనకు, వలసవాదులను గుర్తించడానికి ఉపయోగించవచ్చని ఎన్ఎన్‌టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐఫాల్కన్‌ గ్లాస్‌ ద్వారా అవతలి వ్యక్తి భావోద్వేగాలను కూడా గుర్తించవచ్చని పేర్కొంది. ఇలా అవతలి వ్యక్తి ప్రమేయం లేకుండా వారి వివరాలను తెలుసుకోవడం చాలా సున్నితమైన అంశమే అయినప్పటికీ.. సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఎన్నోలాభాలుంటాయని ఎన్‌ఎన్‌టీసీ వెల్లడించింది.

చైనాలో ఇది కొత్తేం కాదు..

సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న మన పొరుగు దేశం చైనాలో ఇలాంటి టెక్నాలజీని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. గత ఏడాదే  దొంగలను గుర్తించేందుకు వీలుగా అక్కడి పోలీసులకు ఈ రకమైన కళ్లజోళ్లను పంపిణీ చేశారు. రైల్వేస్టేషన్లు, బస్‌ స్టాండ్లలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీని వ్యక్తిగతంగా వాడుకోవడంపై అక్కడ నిషేధం విధించారు. అంతేకాకుండా భద్రతా పరమైన కారణాల దృష్ట్యా జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలకు ఈ టెక్నాలజీని వినియోగించేందుకు అవకాశం కల్పించలేదు.

అమెరికా, రష్యాల్లోనూ..

అమెరికా, రష్యాలాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వివిధ పశ్చిమదేశాల్లో ఈ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన చిత్రాలను డేటాబేస్‌తో సరిపోల్చి దొంగలను సులువుగా గుర్తించే ఇదే రకమైన సాంకేతికత ఇప్పటికే అక్కడ అందుబాటులో ఉంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగే సమయాల్లో ప్రత్యేక వాహనాల్లో ముఖాలను గుర్తించే కెమెరాలను ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంటారు.

భారత్‌లో కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తే ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే సరైన మార్గంలో ఉపయోగిస్తేనే దాని ఫలాలు పొందేందుకు వీలుంటుంది. లేని పక్షంలో వ్యక్తిగత వివరాలు దుండగుల చేతికి చేరి మరింత నష్టం చేకూరే అవకాశాలూ లేకపోలేదు.

ఇంటర్నెట్‌ డెస్క్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు