
వార్తలు / కథనాలు
పేలుళ్లకు వెన్నుపోటే కారణమన్న ఇరాన్
ఇదే తొలిసారి కాదు..!
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
ఇరాన్ అణుకేంద్రంలో మరో కుట్రకు తెరలేచింది. జులై మొదట్లో ఇరాన్‌లోని నాన్తెజ్ యురేనియం శుద్ధి కేంద్రంలో భారీ పేలుడు జరిగి సెంట్రిఫ్యూజిలు దెబ్బతిన్నాయి. అనంతరం రక్షణ శాఖకు చెందిన కీలక భవనాల్లో కూడా పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. అప్పట్లో ఈ పేలుళ్లు ఎలా చోటు చేసుకొన్నాయో కూడా ఇరాన్‌కు అంతుచిక్కలేదు. ఒక దశలో ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్35 యుద్ధవిమానాలు దాడులు చేశాయని అనుమానించింది. ఈ పేలుళ్లపై దర్యాప్తు చేసిన ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ చివరికి ఇది వెన్నుపోటుగా తేల్చాయి. కచ్చితంగా ఇది కంప్యూటర్లను హ్యాక్‌చేసి చేశారా.. లేక ఎవరైనా కావాలని చేశారా అనేదానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. గతంలో కూడా ఈ అణుకేంద్రంపై భారీగా సైబర్ దాడులు జరిగాయి. ఆ దెబ్బకు ఇరాన్ కొన్నేళ్లపాటు కోలుకోలేదు.
నాన్తెజ్ అంత కీలకమైందా..
టెహ్రాన్‌కు దాదాపు 250 మైళ్ల దూరంలో నాన్తెజ్ యురేనియం శుద్ధి కేంద్రం ఉంది. యురేనియం-238 శుద్ధి చేసి ఆయుధాలకు అవసరమైన యూ-235ను తయారు చేస్తారు. ఈ శుద్ధికి సెంట్రిఫ్యూజిలు అనే పరికరాలను వాడతారు. ఇలాంటి వేలకొద్దీ సెంట్రిఫ్యూజిలను ఉపయోగించి నెలల కొద్దీ యురేనియంను శుద్ధి చేస్తేకానీ అణుబాంబుకు సరిపడా యురేనియం తయారు కాదు. ఈ సెంట్రిఫ్యూజిలు పనిచేయడానికి ఉపయోగించే కంప్యూటర్లను దెబ్బతీస్తే.. ఆ సెంట్రిఫ్యూజిలు కూడా పనికిరాకుండా పోతాయి. ఇప్పుడు నాన్తెజ్లో ఇరాన్ వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజిలను ఉపయోగిస్తోంది. తాజా దాడిలో ఎన్ని దెబ్బతిన్నాయో తెలియరాలేదు.
గతంలో స్టక్స్ నెట్ దెబ్బకు విలవిలా..
గతంలో ఇరాన్ అణుకార్యక్రమాన్ని అమెరికా దెబ్బకొట్టింది. ఇరాన్‌లోని ‘నాన్తెజ్’ యురేనియం శుద్ధి కేంద్రానికి సామగ్రిని సరఫరా చేసే నాలుగు సంస్థలను అమెరికా ‘స్టక్స్నెట్’ అనే డిజిటల్ ఆయుధంతో లక్ష్యంగా చేసుకొంది. ఆ సంస్థల్లోని ఒక దానికి చెందిన ఉద్యోగి తన పెన్‌డ్రైవ్‌ను ‘నాన్తెజ్’ అణుకేంద్రంలోని కంప్యూటర్‌కు అనుసంధానించాడు. అంతే, దాదాపు 984 ‘గ్యాస్ సెంట్రిఫ్యూజి’లు పనికిరాకుండా పోయాయి. ఫలితంగా ఇరాన్ ఇప్పటికీ అణుకార్యక్రమంలో పురోగతి సాధించలేని స్థితికి చేరింది. తాజా దాడితో ‘స్టక్స్నెట్’ ఘటన మరోసారి కళ్లముందు మెదిలింది.
‘ఎయిర్‌గ్యాప్’ను ఛేదించిందెవరు..?
సాధారణంగా ఏ దేశంలోనైనా అత్యంత కీలకమైన విభాగాల్లో పనిచేసే కంప్యూటర్లను హ్యాకర్ల నుంచి కాపాడటానికి ఇంటర్నెట్కు అనుసంధానించరు. ఇలాంటి స్థితిని ‘ఎయిర్ గ్యాప్’ అంటారు. ఈ స్థితిలో ఉన్న కంప్యూటర్లలోకి వైరస్ ప్రొగ్రామ్‌ను చొప్పించాలంటే ఎవరో ఒకరు ఆ కంప్యూటర్లను ఆపరేట్ చేసి ఉండాలి. స్టక్స్ నెట్ ఘటనలో కూడా ఓ ఉద్యోగి కీలక కంప్యూటర్లకు పెన్‌డ్రైవ్ అనుసంధానించడంతో వైరస్ వ్యాపించింది. ఈ సారి ఎవరు చేశారో ఇరాన్ గుర్తించలేదు.
గతంలో ఇరాక్‌లో ‘ఆపరేషన్ ఒపెరా’
ఇరాక్ 1976లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఓ న్యూక్లియర్ రియాక్టర్‌ను బాగ్దాద్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తోందని ఇజ్రాయెల్ గుర్తించింది. దీనిని ధ్వంసం చేయడానికి 1981 జూన్ 7వ తేదీ ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధవిమానాలు ఆ కేంద్రంపై దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాక్ గగనతల నిఘా రాడార్లను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో ఈ విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది. అంతే ఇజ్రాయెల్ విమానాలు ఆ అణు రియాక్టర్‌పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి. క్షణాల్లో ఈ ఆపరేషన్ ముగిసిపోయింది. ఒక చిన్న ఏమరపాటు అణుకేంద్రాలకు ఎంత ముప్పో ఈ ఘటన చెబుతుంది.