close

వార్తలు / కథనాలు

అతడి యుద్ధానికి ఓటమి చలించింది

అతడి యుద్ధానికి ఓటమి చలించింది

ప్రేరణ.. స్ఫూర్తి.. ఆత్మ స్థైర్యం.. ఆత్మ బలం.. ఆత్మ విశ్వాసం.. రగిలే జ్వాల.. వీటిని చదువుతోంటే రోజూ వినే సర్వ సాధారణ పదాలే కదా అనిపిస్తాయి! అవెంత అసాధారణంగా పనిచేస్తాయో అనుభూతి చెందేవాడికి తెలుస్తుంది. ఆలోచించే వాడికి తెలుస్తుంది. ప్రేరణ పోరాడే బలాన్నిస్తే స్ఫూర్తి ఆ బలాన్ని పదింతలు చేస్తుంది. ఆత్మస్థైర్యం.. ఆత్మబలం.. అణుబాంబులా విస్ఫోటం చెంది గుండెల్లో అగ్ని జ్వాలను రగిలిస్తాయి. జీవితంలో విజయం సాధించాలన్న కసిని పెంచుతాయి. ఇవన్నీ మనలో ఉంటే కాళ్లూ చేతులూ లేకున్నా కొండల్ని పిండి చేయొచ్చు. సప్త సముద్రాలను ఎదురీదొచ్చు. ఖండాతరాలను దాటేయొచ్చు.

‘అతడికో మహోన్నత ఆదర్శం ఏర్పడింది.

అతడో అసాధారణ పథకాన్ని రూపొందించాడు.

అతడి ఆలోచనలు బంధనాలు తెంచుకున్నాయి.

అతడి మనసు అన్ని పరిమితులను అధిగమించింది.

అతడి చైతన్యం అన్ని దిశల్లోనూ వ్యాపించింది.

అతడో నవ్య, మహోన్నత అద్భుత ప్రపంచంలో నిలిచాడు.

అతడిలో నిద్రాణమైన శక్తులు, ప్రతిభలు, జ్ఞానం ఒక్కసారిగా మేల్కొన్నాయి.

అతడు కలలో సైతం ఊహించనంత ఉన్నతుడిగా తనకు తాను దర్శనమిచ్చాడు.

అనుకున్నది సాధించాడు. విజయ తీరాలకు చేరుకున్నాడు’.. అతడే చందీప్‌ సింగ్‌ సుడాన్‌. ఇంతకీ ఎవరితను? ఏం సాధించాడు?

అవును.. రెండు చేతులు లేవు

చందీప్‌ సింగ్‌ యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. తైక్వాండోలో శిక్షణ పొందాడు. దక్షిణ కొరియాలో నిర్వహించిన కిముయాంగ్‌ కప్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పసిడి పతకాలు అందించాడు. అంతకు ముందే వియత్నాంలో జరిగిన ఆసియా తైక్వాండో ఛాంపియన్, అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌‌లో స్వర్ణాలు ముద్దాడాడు. చాలా మంది పతకాలు సాధిస్తారు? ఇతడిలో ప్రత్యేక ఏముందీ అంటారా? అతడికి రెండు చేతులు లేవు మరి.

11 ఏళ్లప్పుడు ప్రాణాపాయం

చందీప్‌ సింగ్‌ది జమ్ము కశ్మీర్‌. తనకిప్పుడు 19 ఏళ్లు. పదకొండేళ్ల వయసులో దాదాపు 11,000 వోల్టుల తీవ్రమైన విద్యుదాఘాతానికి గురయ్యాడు. అంత పెద్ద ప్రమాదంలో అతడు ప్రాణాలతో మిగిలాడంటేనే ఆశ్చర్యం. షాక్‌తో చందీప్‌ రెండు చేతులు అచేతనంగా మారాయి. ఇన్ఫెక్షన్‌ సోకడంతో వైద్యులు రెండు చేతుల్ని భుజాల వరకు తొలగించక తప్పలేదు. వైద్యం చేసినప్పుడు అతడి చేతులకు కట్లు కట్టారు. శస్త్రచికిత్స తర్వాత అతడన్న మాటలేంటో తెలుసా? చేతి వేళ్ల దగ్గర కాస్త నొప్పి పుడుతోంది కట్లను వదులు చేయండీ అని! చేతులు తొలగించినా తన చేతివేళ్లను అనుభూతి చెందాడు ఆ కుర్రాడు.

యుద్ధం మొదలు

నిజం తెలుసుకున్న చందీప్‌ ఎంత ఏడ్చాడో మనమెవ్వరం ఊహించలేం. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు సూచించారు. కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. ప్రోత్సహించారు. ఏం జరిగినా ఫర్వాలేదని భరోసా ఇచ్చారు. ఊహించని విధంగా అతడి స్నేహితులు వెన్నుదన్నుగా నిలిచారు. ఆ ధైర్యమే దన్నుగా అతడు జీవిత పోరాటానికి సిద్ధమయ్యాడు. స్కేటింగ్‌లో రికార్డులు సృష్టించాడు. పారా స్కేటింగ్‌ వందమీటర్లను13.95 సెకన్లలో పూర్తిచేసి అత్యంత వేగంగా పూర్తి చేసిన స్కేటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఘనత పొందేందుకు అతడెన్నో కష్టాలు పడ్డాడో.

‘బ్యాలెన్స్‌’ కష్టం

స్కేటింగ్‌ చేయాలంటే చేతులు తప్పనిసరి. శరీరం సమతూకంగా ఉంచేందుకు, కిందపడకుండా ఉండేందుకు అవే ఊతంగా ఉంటాయి. చేతులు లేకపోవడంతో స్కేటింగ్‌ చేయలేవని ఎందరో అవమానించారు. కొందరు కష్టమన్నారు. అతడవేమీ పట్టించుకోలేదు. తన గుండెల్లో ఆరని అగ్నిజ్వాల ప్రేరణ నింపింది. కాళ్లకు చక్రాలు  కట్టుకున్నాడు. ముందు పడ్డాడు. రెండోసారీ పడ్డాడు. మూడోసారీ.. నాలుగోసారీ.. వందల సార్లు పడ్డాడు. ఎన్నిసార్లు పడ్డాడో అతడికే తెలియదు. అయినా కష్టపడ్డాడు. చివరికి సమతూకం సాధించాడు. పరుగులు తీశాడు. ప్రపంచ రికార్డులు బద్దలు చేశాడు. అంతటితో ఆగలేదు. తనను తాను మళ్లీ నిరూపించుకోవాలన్న తపనతో  యుద్ధ విద్యలో ఆరితేరాడు. తైక్వాండోలో బంగారు పతకాలు అందించి భారత కీర్తి పతాకను సగర్వంగా రెపరెపలాడించాడు. అందరినీ గర్వపడేలా చేశాడు. ఇంతకీ అతడికి ప్రేరణ ఎవరో తెలుసా? పరుగుల వీరుడు మిల్కాసింగ్‌.

కదిలించిన సంఘటన

‘సందీప్‌ దేశాన్ని గర్వపడేలా చేశాడు. ఇతరులు అతడిని స్ఫూర్తిగా తీసుకొని ఇదే తరహాలో ఘనతలు సాధించాలి. సందీప్‌ మా ఇంటికి వచ్చిన రోజు తన కాళ్లతో ల్యాప్‌ట్యాప్, మొబైల్‌ ఫోన్‌‌తో పనిచేయడం చూశా. అతడికి చేతులు లేకపోవడం నన్ను కదిలించింది’ అని మిల్కాసింగ్‌ మీడియాకు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు