
వార్తలు / కథనాలు
ఇంట్రా నాసల్ అత్యంత సులువు
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
నవంబర్ వచ్చేసింది.. ఎక్కడ చూసినా ఇప్పుడు కొవిడ్ టీకా ఎప్పుడు వస్తుందనే చర్చే జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే టీకాల అభివృద్ధి కూడా రాకెట్ వేగంతో జరుగుతోంది. అదే సమయంలో ఓ కొత్త రకం టీకా జనం దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ఇంట్రా నాసల్ కొవిడ్ టీకా..! అదేనండీ ముక్కులో వేసుకొనే వ్యాక్సిన్..! ప్రస్తుతం దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ స్టేజి ప్రయోగాలు భారత్‌లో ప్రారంభం కానునున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాక్సిన్ ఏమిటీ.. సాధారణ వ్యాక్సిన్‌కు భిన్నంగా దీనిపై ఎందుకు ప్రయోగాలు చేపట్టారు.. దీని లాభాలేమిటీ అనే అంశంపై ప్రజల్లో కుతూహలం పెరిగింది.
టీకాలను ఎలా వాడతారు..?
సాధారణ టీకాల వినియోగానికి పలు విధానాలు ఉంటాయి. ముఖ్యంగా వయస్సు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొంటారు. చాలా టీకాలను ఇంజెక్షన్ రూపంలో శరీరంలోని కండరాల్లోకి ప్రవేశపెడతారు. దీనిని ఇంట్రా మస్క్యూలర్ అంటారు. కొన్ని చర్మం, కండరం మధ్య ప్రదేశంలో చేస్తుంటారు. దీనిని సబ్కటానియస్ విధానం అంటారు. ఇక పిల్లలకు పోలియో నిరోధక టీకాలు వంటివి ప్రత్యేకమైన సొల్యూషన్‌తో కలిపి చుక్కల మందు రూపంలో నోటిలో వేస్తారు. మరికొన్ని టీకాలను ముక్కులో కండరాలపై పిచికారి చేయడం లేదా పీల్చుకోవడం చేస్తారు. దీనిని ఇంట్రానాసల్ విధానం అంటారు. ప్రస్తుతం ఇలాంటి టీకాలకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనుంది. సెయింట్ లూయిస్‌లోని ‘ది వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ సహకారంతో వీటిని అభివృద్ధి చేయనుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇటువంటి టీకాపై పనిచేస్తోంది.
ఎలా వినియోగిస్తారు..?
ఇంట్రా నాసల్ టీకాను ముక్కు రంధ్రాల్లో పిచికారీ చేస్తారు. ఇది ముక్కు రంధ్రాలు.. దానికి సంబంధించిన కండరాలపై వ్యాపిస్తుంది. ఇప్పటికే జలుబు ఔషధాలను ఈ విధంగా పిచికారీ చేయడం చూస్తున్నాం.
ప్రయోజనాలు ఏమిటీ..?
* ఖర్చు తగ్గుతుంది: ఈ విధానంలో సిరంజీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతోపాటు సూదులు వాడకం అసలే ఉండదు. ఆల్కహాల్ స్వాబ్‌ల అవసరమే రాదు.
* తక్కువ సిబ్బందితోనే..: టీకాపై ఉండే సూచనలు పాటిస్తూ.. సాధారణ నాసల్ స్ప్రే వలే వినియోగించవచ్చు. కొంత అవగాహన ఉంటే సొంతంగా వాడుకోవచ్చు. పెద్ద సంఖ్యలో సుశిక్షితులైన సిబ్బంది అవసరం లేదు.
* అదనపు రోగనిరోధక శక్తి : ఇంట్రా నాసల్ టీకా రక్తంలో వ్యాధినిరోధక శక్తి ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. దీంతోపాటు అదనపు వ్యాధినిరోధక కణాలు ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లో పుట్టుకొచ్చినట్లు కనుగొన్నారు. ఇలా కండరాల్లో పుట్టుకొచ్చిన వ్యాధినిరోధక కణాల్లోని టిసెల్స్ వైరస్‌ను గుర్తు పెట్టుకొంటాయి. దీంతో వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించే మార్గాల్లోనే ఇవి అడ్డుకొంటాయి.
ఇబ్బందులు ఏమిటీ..?
సక్సెస్ రేట్: అతి తక్కువ ఇంట్రా నాసల్ టీకాలను తయారు చేశారు. ఇప్పటి వరకు వీటిల్లో బలహీన పర్చిన ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను వినియోగించారు.
ప్రభావం: ఈ విధానాన్ని ఇప్పటి వరకు జంతువులపై ఎక్కువగా ప్రయోగించారు. మునుషలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో ఇంకా పూర్తి స్థాయి అంచనాకు రావాలి.
తక్కువ మొత్తం: ముక్కు రంధ్రాల ద్వారా అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే శరీరంలోకి పంపగలం. ఒక్కో నాసికా రంధ్రం ద్వారా 0.1 ఎంఎల్ పంపిస్తారు. కండరాలలో ఎక్కించే టీకాతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తం. ఎటువంటి పరికరం వాడి పంపిస్తున్నామన్నదానిని బట్టి కూడా ఇది మారుతూ ఉంటుంది.
‘ఇంట్రా నాసల్ విధానం’ అత్యంత తేలిక: కిరణ్ మజూందార్ షా
కొవిడ్ టీకాను నాసికా రంధ్రాల ద్వారా మనిషికి ఇవ్వడం అత్యంత తేలికైన విధానమని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కిరణ్ మజూందార్ షా ట్విటర్లో పేర్కొన్నారు. ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి కూడా ఈ టీకాలను ప్రజలకు వేయవచ్చని ఆమె పేర్కొన్నారు. అదే కండరాలకు చేసే టీకాల పంపిణీకి సుశిక్షితులైన నర్సులు, వైద్యులు అవసరం. అది పెద్ద సవాలు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న సింగల్ డోస్, శక్తిమంతమైన నాసల్ వ్యాక్సిన్ గేమ్ ఛేంజర్ కాగలదా..? అని ఆమె ఆంగ్లపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని షేర్ చేశారు.